Connect with us

Literary

డాలస్ లో తానా & టాంటెక్స్ ఆద్వర్యంలో తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు యజ్ఞేశ్వర శతక పద్యగాన మహోత్సవం

Published

on

జూన్ 25, డాలస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) లు సంయుక్తంగా “యజ్ఞేశ్వర శతకము” పద్యగాన మహోత్సవం కార్యక్రమాన్ని డాలస్ మెట్రో ఏరియాలో ఫ్రిస్కో నగరంలో నెలకొని ఉన్న కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం లో వైభవంగా నిర్వహించారు. ముందుగా దేవాలయ ఛైర్మన్ డా. వెలగపూడి ప్రకాశరావు తెలుగు వేదకవి, సినీగీత రచయిత జొన్నవిత్తుల గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని, మహా విద్వత్తు వున్న కవి, రచయిత డాలస్ రావడం మన అదృష్టమని, వారిని దేవాలయం తరపున ఘనంగా ఆహ్వానిస్తున్నాను అని అన్నారు.

డాలాస్-ఫోర్ట్ వర్త్ తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన సాహితీ ప్రియులందరికీ సాదర స్వాగతం పలికి, తానా మరియు టాంటెక్స్ సంస్థలు కలసి పనిచేస్తూ మున్ముందు కూడా అనేక మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అలాగే తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు సారధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక సాహిత్య, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం అని, అందరూ తానా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

తెలుగుసారధి, తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఈ సభకు అధ్యక్షత వహించగా ఆచార్య డా. పుదూర్ జగదీశ్వరన్ ప్రత్యేక అతిథిగా యజ్ఞేశ్వర శతక సమీక్షకులుగా చక్కని విశ్లేషణ చేశారు. సభాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర సభను ప్రారంభించి శ్రీ జొన్నవిత్తుల మంచి ప్రజాదరణ పొందిన సినిమా పాటలు ఎన్నో రాశారని, సాధారణంగా సినీగీత రచయితలు సినీ రంగానికే పరిమితం అవుతారని కాని కవి జొన్నవిత్తుల అనేక సామాజిక స్పృహకలిగిన పేరడీలు, దండకాలు, దాదాపు 30 శతకాలను రాశారన్నారు.

“తెలుగు వేదం”, “తెలుగు శంఖారావం” లాంటి రచనలతో తెలుగు భాష సౌందర్యాన్ని, సొగసుని అద్భుతంగా ఆవిష్కరించిన కవి అన్నారు. తెలుగు భాష మీద ప్రజలకు భాషానురక్తి, స్పూర్తి కలిగించాలి అనే ఉద్దేశంతో నిరంతరం కృషి చేస్తున్న సినీగీత రచయిత, కవి, పండితులు, తెలుగు భాషే తన ఆశ, ధ్యాసగా తన జీవన యానాన్ని సాగిస్తున్న శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి అందరి హర్ష ధ్వానాల నడుమ కవి జొన్నవిత్తులకు ఘన స్వాగతం పలికి డా. తోటకూర ప్రసాద్ వేదికపైకి ఆహ్వానించారు.

తెలుగువేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు సకల దేవతా మూర్తులు కొలువైనటువంటి పవిత్ర కార్య సిద్ది హనుమాన్ దేవాలయంలో తనకు దైవదర్శనం ఒక దివ్యమైన అనుభూతినిచ్చింది అని, ప్రకాశరావు గారు హిందూ మతం, ధర్మం కోసం చేస్తున్న కృషి, తపన చాలా గొప్పవని అభినందించారు. సభాధ్యక్షులు, అమెరికా తెలుగుసారధి డా. ప్రసాద్ తోటకూర తెలుగు భాష, సాహిత్యంపై ఉన్న మక్కువతో ప్రపంచంలో వున్న తెలుగువారికి మంచి కార్యక్రమాలు అందించడంలో గొప్ప దార్శనికులు అని, గొప్ప వక్త అని కవి జొన్నవిత్తుల కొనియాడారు. డా. పుదూరు జగదీశ్వరన్, మొట్ట మొదటి అమెరికా తెలుగు అష్టావధాని అని, వారు ఈరోజు యజ్ఞేశ్వర శతకం సమీక్షకులుగా వ్యవహరించడం ఆనందదాయకం అన్నారు.

వేదకవి జొన్నవిత్తుల తాను రాసిన “యజ్ఞేశ్వర శతకం” నుండి అనేక పద్యాలను మాధుర్యంగా పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యజ్ఞేశ్వరుడు అంటే విష్ణుమూర్తి, అగ్ని దేవుడు, అగ్ని రూపంలో వున్న విష్ణుమూర్తి, ఆయనే శివుడు, బ్రహ్మ, విష్ణువు. అగ్ని సూక్తంతోనే ప్రారంభం, ఋగ్వేదం కూడా అని, ఈ అగ్ని ఆరాధన అనేది మన ఋషులు చేశారు. మనం విగ్రహారాధన కంటే ముందు అగ్ని ఆరాధన ప్రారంభమైంది, మన భారతీయత, ఋషి పరంపర. అగ్ని లేనిదే ఎమీ లేదు, ఈ యజ్ఞేశ్వర శతకం సులభంగా అందరికీ అర్ధమయ్యేలా సరళమైన భాషలో రాశానని ప్రకటించారు.

“హే ఆ: కారక! ఆత్మ దీపిక! మహాగ్నీ! లోక వైతాళికా!” …
ఓ అగ్ని దేవా, అగ్ని రూపం లో వుండేటటువంటి సమస్త దేవతా స్వరూపా…. అగ్నిని గురించి మనం ఆలోచిస్తే మనకి కలిగేది ఆశ్చర్యం. ఈ పద్యాలన్ని మనకి ఆశ్చర్యం కలిగించేవే, “అగ్ని స్వరూపం ఆశ్చర్యం” అనే అంశం మీదే ఈ 100 పద్యాల సారం వుంటుందని, అందరికీ అర్ధమయ్యే రీతిలో సాహితీ ప్రియులను పద్య సౌగంధంతో మైమరపిస్తూ, సభలో నవ్వులు పూయిస్తూ, కరతాళ ధ్వనుల మధ్య శ్రీ జొన్నవిత్తుల యజ్ఞేశ్వర శతక పద్యగానం ఒక గంగా ప్రవాహంలా సాగింది. ఈ యజ్ఞేశ్వర శతకంలో మనోవికాసం, సామాజిక దృక్పధం, దైవానుగ్రహం పొందే అనేక ప్రజోపకరమైన విషయాలను పొందుపరచానని కవి జొన్నవిత్తుల తెలియజేశారు.

డా. పుదూర్ జగదీశ్వరన్ యజ్ఞేశ్వర శతకపద్య సమీక్షలో జొన్నవిత్తుల విశిష్ఠ కవి, తెలుగువేదకవి అని, మహా కవులు దీర్ఘ సమాసాలు వాడతారని, వీరి పద్యాలలో కూడా దీర్ఘ సమాసాలు, చక్కటి పద ప్రయోగాలు పుష్కలంగా ఈ యజ్ఞేశ్వర శతకంలో ఉన్నాయని అన్నారు. శ్రీ జొన్నవిత్తుల గారిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపిక ఇచ్చి, ” 21వ శతాబ్దపు శతక సార్వభౌమ” అనే బిరుదుతో సత్కరించారు.టాంటెక్స్ అధ్యక్షులు ఉమామహేష్ పార్నపల్లి వందన సమర్పణలో మాట్లాడుతూ శ్రీ జొన్నవిత్తుల రామలింగెశ్వర రావు గారు ముఖ్య అతిధిగా రావడం చాలా ఆనందంగా ఉందని, తానా, టాంటెక్స్ కలసి ఇక ముందు కూడా పరస్పర సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డా. ప్రసాద్ తోటకూర, డా. పుదూర్ జగదీశ్వరన్, శ్రీకాంత్ పోలవరపు, సతీష్ కొమ్మన, చినసత్యం వీర్నపు, సతీష్ బండారు, భానుమతి ఇవటూరి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, వెంకట్ ములుకుట్ల, లోకేష్ నాయుడు కొణిదల, డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డా. ప్రకాశరావు వెలగపూడి, లెనిన్ వీర, విజయ్ కొల్లపనేని, కృష్ణమోహన్ రెడ్డి, వెంకట్, డా. రతీరెడ్డి, సాగర్ అండవోలు, చంద్రహాస్ మద్దుకూరి, పాలేటి లక్ష్మి, కళ్యాణి తాడిమేటి తో సహా ఎంతో మంది భాషాభీమానులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారికి, సభ విజయవంతం కావడానికి సహకరించిన వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు అన్ని ప్రసార మాధ్యమాలకు డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు తనకు జరిగిన ఘన సన్మానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యజ్ఞేశ్వర శతక ప్రకాశకులు డా. సత్యం ఉపద్రష్టకు ప్రత్యేక కృతజ్ఞతలు, శతక సాహితీ జైత్రయాత్ర సారధి డా. తోటకూర ప్రసాద్ కు శతకోటి వందనాలు తెల్పుతున్నాను. ఎంతోమంది సాహితీప్రియులు, తెలుగు భాషాభిమానులు నిరాటంకంగా మూడు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం తనకు ఒక మధురానుభూతిగా మిగిలిపోతుందన్నారు. ఈ సమావేశం చివర్లో తానా పూర్వాధ్యక్షులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తనకు కళాశాల స్థాయిలో విద్యాబుద్ధులు నేర్పిన డా. ఎం. విజయకుమార్, డా. ఎం. స్వర్ణకుమారి అధ్యాపక దంపతులు ఈ సాహిత్య సభలో ఉండడం తన అదృష్టమని, వారిని వేదికపైకి ఆహ్వానించి వారివురిని ఘనంగా సన్మానించి పాదనమస్కారం చేసుకున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected