Connect with us

Picnic

అట్లాంటాలో ఆటవిడుపుగా తానా & తామా పిక్నిక్

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ అట్లాంటా జట్టు మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ ఆధ్వర్యంలో ఆగష్టు 27న పిక్నిక్ నిర్వహించారు. ఉల్లాసంగా సాగిన ఈ తామా & తానా పిక్నిక్ లో సుమారు 400 మంది అట్లాంటా వాసులు పాల్గొన్నారు.

గైన్స్విల్ లోని లేక్ లేనియర్ బొల్డింగ్ మిల్ షెల్టర్స్లో నిర్వహించిన ఈ పిక్నిక్ ఉదయం 7 గంటలకే తానా మరియు తామా కార్యవర్గ సభ్యులు, వలంటీర్ల రాకతో మొదలైంది. ఒక పక్క కొంతమంది వలంటీర్లు కూరగాయలు కోసి అందివ్వడంతో మరోపక్క నలభీములు లైవ్ కుకింగ్ చేసి కమ్మని వంటకాలను తయారుచేశారు.

11 గంటల నుండి అట్లాంటా వాసులు రావడం మొదలవగా, 12 గంటల నుండి భోజనాలు వడ్డించారు. మటన్, చికెన్ వంటి మాంసాహార భోజనంతోపాటు గుత్తి వంకాయ, కొబ్బెరన్నం, పన్నీరు, మిక్స్డ్ వెజిటబుల్స్, సాంబారు, పెరుగు చారు, గులాబ్జామ్, డబల్ కా మీఠా వంటి శాఖాహార భోజనాలను భుక్తాయాసం వచ్చేలా వడ్డించారు.

అట్లాంటా వారికి పసందైన వంటకాలతో స్వచ్ఛమైన తెలుగు వంటల రుచి చూపించారు. వారాంతం ఆహ్లదంగా గడిపారు. ఈ ఔట్డోర్ ఈవెంట్ లో మ్యూజిక్, ఆటపాటలు, కుర్చీలాట, బింగో వంటి సరదా కార్యకలాపాలతో ఆహ్వానితులందరూ ఆటవిడుపుగా ఫీల్ అయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

భోజనాలకు ముందు వినాయక చవితి కోసం వినయ్ మద్దినేని పిల్లలతో 100 శాతం పర్యావరణానికి అనుకూలమైన మట్టితో దగ్గిరుండి వినాయకుని ప్రతిమలు చేపించారు. పక్కనే ఉన్న లేక్ లేనియర్ గట్టు వద్ద నీళల్లో పిల్లలు, పెద్దలు ఆడుతూ ఉల్లాసంగా కనిపించారు.

అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణ ప్రసంగిస్తూ ఇంతమంది తెలుగువారిని ఒకేచోట కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సత్యనారాయణ అందరితో సరదాగా కలిసిపోయి కలివిడిగా ఉండడం చూసి అందరూ హర్షించారు.

ఈ సందర్భంగా అంజయ్య చౌదరి లావు, వెంకట్ మీసాల, శ్రీరామ్ రొయ్యల మరియు సురేష్ బండారు ప్రసంగించారు. ఈ పిక్నిక్ స్పాన్సర్స్ డెల్టా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అధినేత శ్రీనివాస్ లావు మరియు శరత్ పుట్టి లను తానా, తామా కార్యవర్గ సభ్యులు సత్కరించారు. అలాగే పిక్నిక్ ఆసాంతం సునీల్ దేవరపల్లి తానా పాఠశాల స్టాల్ ద్వారా తరగతుల వివరాలను పలువురికి వివరించి రెజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రమోట్ చేశారు.

సాయంత్రం మిరపకాయ బజ్జీలు, కాఫీ, టీ ఏర్పాటు చేశారు. ఈ తానా & తామా పిక్నిక్ ద్వారా కోవిడ్ తర్వాత ఇలా కుటుంబ సమేతంగా అందరినీ ఒకే దగ్గర కలవడం చాలా సంతోషంగా ఉందని, ఇంత మంచి ఆటవిడుపు కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన తానా, తామా కార్యవర్గాలను పలువురు అభినందించారు.

ఈ పిక్నిక్ నిర్వహణలో రవి కల్లి, సురేష్ బండారు, సునీత పొట్నూరు, యశ్వంత్ జొన్నలగడ్డ, సునీల్ దేవరపల్లి, శ్రీనివాసులు రామిశెట్టి, తిరు చిల్లపల్లి, శ్రీవల్లి కంసాలి, సత్య నాగేందర్ గుత్తుల, సుధా ప్రియాంక సుందర, శ్రీరామ్ రొయ్యల, సుబ్బారావు మద్దాళి, మధుకర్ యార్లగడ్డ, ప్రవీణ్ బొప్పన, ఇన్నయ్య ఎనుముల, నగేష్ దొడ్డాక, విజయ్ కొత్తపల్లి, భరత్ అవిర్నేని, ఆనంద్ అక్కినేని, అంజయ్య చౌదరి లావు, వెంకట్ మీసాల, అనిల్ యలమంచిలి, హితేష్ వడ్లమూడి, జనార్ధన్ పన్నెల, గణేష్ కాసం, శ్రీనివాస్ ఉప్పు, బాలనారాయణ మద్ద, మురళి బొడ్డు తదితరులు పాలుపంచుకున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected