Connect with us

Associations

అట్లాంటాలో తామా సిలికానాంధ్ర తెలుగు మాట్లాట పోటీలు

Published

on

ఆగష్టు 10వ తేదీన అట్లాంటా నగరంలోని దేశాన పాఠశాల ప్రాంగణంలో తెలుగు వికాసం వెల్లి విరిసింది. అట్లాంటా తెలుగు సంఘం “తామా” మరియు సిలికానాంధ్ర సంయుక్తంగా  నిర్వహించిన తెలుగు మాట్లాట పోటీలలో సుమారు 50 మందికి పైగా  చిన్నారులు పాల్గొన్నారు.  రకరకాల విభాగాలలో తెలుగు భాషా విషయ పరిజ్ఞానాన్ని తెలియజెప్పే “తిరకాటం” చాలా కోలాహలంగా జరిగింది. తెలుగు పదాలలో సరైన అక్షరాలు వ్రాయడాన్ని పరీక్షించే “పదరంగం” పోటీలు చూసి అందరూ మిక్కిలి సంతోషించారు.  సరదాగా ఆడించిన “ఒక నిమిషం మాత్రమే (ఒనిమా)” లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో పిల్లలు చెప్పిన సమాధానాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కరతాళ ధ్వనులతో ప్రాంగణం హోరెత్తింది. ఇదే రోజు మనబడి ఓపెన్ హౌస్ కూడా నిర్వహించడం జరిగింది. కొత్తవారికి మనబడి పాఠ్యప్రణాళిక, తరగతులు, పరీక్షలు తదితర వివరాలను విజయ రావిళ్ల గారు వివరించారు. చాలా మంది మొదటిసారి దరఖాస్తు చేసుకోవడానికి విచ్చేసి కార్యక్రమాన్ని చూసి సంతోషించారు.

మనబడి కార్యక్రమంలో అట్లాంటా మహానగరంలో మొత్తం 450 మందికి పైగా పిల్లలు ఐదు తరగతుల పాఠ్యప్రణాళికలో వారం వారం తెలుగు నేర్చుకుంటున్నారు. ఈ పోటీలకు  అట్లాంటాలో ఉన్న నాలుగు తెలుగు బడుల నుంచి పిల్లలు పాల్గొనటం విశేషం. మనబడికి వెళ్లని వారు కూడా పాల్గొనడం నిర్వాహుకులకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. అట్లాంటా సాహితీ లోకం ఈ పోటీలను చివరిదాకా ఉండి, సంపూర్ణంగా నిర్వహించి  ఆస్వాదించటం మరొక విశేషం. విచ్చేసిన అందరికీ భోజనం ఏర్పాటు చేశారు.

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలలో పాల్గొన్న మరియు గెలుపొందిన బాలబాలికలకు స్థానిక పర్యవేక్షకులు విజయ్ రావిళ్ల  గారు, తామా అధ్యక్షులు వెంకీ గద్దె గారు, తామా బోర్డు చైర్మన్ వినయ్ మద్దినేని గారు, తామా విద్యాకార్యదర్శి సాయిరామ్ కారుమంచి గారు,  మనబడి గురువులు, వాలంటీర్స్ బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ రావిళ్ల  గారు మనబడి, తెలుగు ఆవశ్యకతను వివరించి, టీచర్ల కృషిని మరియు తల్లిదండ్రుల ఆసక్తిని కొనియాడారు. వెంకీ గద్దె గారు తామా నిర్వహించు పలు సేవ మరియు స్వచ్చంద కార్యక్రమాల గురించి వివరించారు. వినయ్ మద్దినేని గారు తెలుగు భాష గొప్పదనాన్ని వివరించి, పిల్లలకు ఎక్కువ భాషలు రావడం వలన కలుగు ప్రయోజనాలను చెప్పారు.

ఈ కార్యక్రమంలో తామా కార్యవర్గ సభ్యులు భరత్ మద్దినేని, భరత్ అవిర్నేని మరియు బోర్డు సభ్యులు శ్రీనివాస్ ఉప్పు, హర్ష యెర్నేని, విజు చిలువేరు తదితరులు పాల్గొన్నారు. సిలికానాంధ్ర మనబడితో ప్రవాసులలో తెలుగుపై మమకారం ఆసక్తి మరెంతో పెంపొందాలని హాజరైన అనేక మంది తెలుగు వారు ఆకాంక్షించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వున్న టీచర్లకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, పెద్దలకు, భాషా సైనికులకు కృతజ్ఞతాభినందనాలు తెలియజేస్తూ తామా విద్యా కార్యదర్శి సాయిరాం కారుమంచి గారు పోటీలను ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected