అట్లాంటా నగరంలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ కార్యాలయంలో ఆగష్టు 15న భారత 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పని రోజు అయినప్పటికీ ఈ జెండా పండుగలో 100 మందికి పైగా పెద్దలు, పిల్లలు పాల్గొనటం విశేషం.
ముందుగా తామా ప్రెసిడెంట్ వెంకీ గద్దె గారు విచ్చేసిన అందరికీ స్వాగతం పలికి, కార్యక్రమాన్ని ఆరంభించారు. భారత సైన్యంలో పని చేసిన విశ్రాంత మేజర్ జనరల్ డాక్టర్ ఆర్. శివ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఎగుర వేశారు. ఆయనతో పాటు అందరూ జాతీయ గీతం ఆలపించి జెండా వందనము గావించారు. మేజర్ గారు భారత స్వాతంత్య్ర సాధన, నాయకుల గురించి వివరించారు. సైన్యం చేసే వివిధ కార్యక్రమాల గురించి తెలిపి, పిల్లలు తమ స్వంత ఊర్లకు వెళ్లాలని, వీలైతే కొన్ని రోజులైనా అమెరికా లేక ఏ దేశ సైన్యంలోనైనా పనిచెయ్యాలి అని చెప్పారు. తామా నిర్వహించు ఉచిత వైద్యశాల, మనబడి మున్నగునవి చాలా బాగున్నాయన్నారు.
తామా బోర్డు చైర్మన్ వినయ్ గారు తామా వారు నిర్వహించే పలు కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేసారు. మనబడి ప్రతినిధి విజయ్ రావిళ్ల గారు తెలుగు గురించి, నేర్చుకోవడం వల్ల కలుగు ఉపయోగాల గురించి వివరంగా చెప్పారు. వెంకీ గారు ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మేజర్ గారికి, విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తామా వారు ఎన్నో సంవత్సరాలుగా క్రమం తప్పకుండా భారత దేశ జాతీయ పండుగలు నిర్వహించడం బహు ప్రశంసనీయం అని పలువురు మెచ్చుకున్నారు. అందరూ మేజర్ శివ కుమార్ గారితో ఫోటోలు దిగారు. చివరగా అందరికీ అల్పాహారం మరియు తేనీరు విందుతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.