అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సంక్రాంతి సంబరాలు జనవరి 29న ఘనంగా జరిగాయి. అంతర్జాలం వేదికగా సాగిన ఈ సంబరాలకు సమర్పకులుగా శేఖర్స్ రియాలిటి శేఖర్ తాడిపర్తి, ఐ డి డబ్ల్యు టీం హిమబిందు, విజయ్ నరహరిశెట్టి, మై టాక్స్ ఫైలర్ హరిప్రసాద్ శాలియన్ వ్యవహరించారు. సుమారు 250 మందికి పైగా అంతర్జాలంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించడం ముదావహం.
తామా సాంస్కృతిక కార్యదర్శి సునీత పొట్నూరు కార్యక్రమాన్ని ప్రారంభించి, అందరినీ ఆహ్వానించారు. అధ్యక్షులు రవి కల్లి కుటుంబ సభ్యులు జ్యోతి ప్రజ్వలన గావించి, సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం పలికారు. తదుపరి తామా కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేసి అందరికీ కృతజ్ఞతలు తెలియచేసారు. అటు పిమ్మట బోర్డు ఛైర్మన్ శ్రీరామ్ రొయ్యల బోర్డు సభ్యులను పరిచయం చేసి, తామా చేసే పలు కార్యక్రమాలు ఉచిత క్లినిక్, పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, వివిధ సదస్సుల గురించి తెలియజేశారు.
సంక్రాంతి సందర్భంగా సురభి శ్రీ విజయ భారతి నాట్య మండలి, వరంగల్ వారు ప్రత్యేకంగా ప్రదర్శించిన భక్త ప్రహ్లాద నాటకం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇలాంటి అణగారిపోతున్న ప్రత్యేక కళలను ప్రోత్సహించడంలో, వారికి సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడూ తామా వారు ముందంజలో ఉంటారనీ, ఇప్పటి వరకు ఈ కోవకు సంబంధించి చేసిన కార్యక్రమాల గురించి చెప్తూ, భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తామా ఉపాధ్యక్షులు సాయిరామ్ కారుమంచి తెలిపారు.
అట్లాంటావాసులు భక్తి గేయాలు, పద్యాలు, టాలీవుడ్ మెడ్లీలు, సినిమా పాటలు, కూచిపూడి నృత్యాలు కన్నుల విందుగా చేసి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను సునీత పొట్నూరు సమన్వయపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రముఖ టీవి యాంకర్ శ్రీముఖి ఆద్యంతం తన సరదా మాటలతో, చలాకీతనంతో సంక్రాంతి సంబరాలను రక్తి కట్టించారు. ఎంతో మంది శ్రీముఖితో ముఖాముఖి కార్యక్రమంలో పాలుపంచుకొని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో పలువురు మహిళామణులు, చిన్నారులు పాల్గొని, విభిన్న రీతులలో ముగ్గులు వేసి అలరించారు. మగవారి పంచకట్టు పోటీలు సరే సరి, తండ్రీ కోడుకులు, స్నేహితులు, పెద్దవారు ఇలా అందరూ పాల్గొనటం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ రెండు పోటీలలో గెలిచిన వారికి తామా వారు బహుమతులు అందజేశారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ రకరకాల మ్యానరిజమ్స్ తో ఎంతో మంది ప్రముఖులను అనుకరిస్తూ, పద్య గద్యాలతో ప్రేక్షకులను ఆసాంతం వినోదంతో కట్టిపడేసారు.
సంక్రాంతి సంబరాలని విజయవంతం చేసిన ప్రేక్షకులకు, అట్లాంటా ప్రజలకు, స్పాన్సర్లకు, ముఖ్య అతిధులకు, వ్యాఖ్యాత శ్రీముఖి, మిమిక్రీ రమేష్, కార్యక్రమ ప్రత్యక్షప్రసారానికి ఏర్పాట్లు చేసిన ఎ బి ఆర్ బృందానికి, తామా టీంకి, వాలంటీర్లకు సభాముఖంగా సాయిరామ్ కారుమంచి ధన్యవాదాలు తెలిపి దిగ్విజయంగా ముగించారు.