అట్లాంటాలో జూలై 8 న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ వారు సాహితీ సదస్సు నిర్వహించారు. ప్రముఖ అవధాని, సాహితీవేత్త, ప్రవచనకర్త శ్రీ మేడసాని మోహన్ గారు మరియు ప్రముఖ కవి, ఈనాడు సంపాదకులు శ్రీ ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసారు. సుమారు వంద మందికి పైగా సాహితీ ఔత్సాహికులు పాల్గొనగా, ముందుగా కుమారి నిత్య ప్రార్ధనాగీతంతో కార్యక్రమం మొదలయ్యింది. తామా సాహిత్య కార్యదర్శి సాయిరామ్ కారుమంచి, విజు చిలువేరు స్వాగతోపన్యాసం చేశారు. శ్రీ ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ గారికి శ్రీ సుబ్బారావు మద్దాళి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలకగా, శ్రీ ఎఱ్ఱాప్రగడ ప్రతిభాపాఠవాలను శ్రీ సురేష్ కొలిచాల వివరించారు. ఆ తరువాత శ్రీ మేడసాని మోహన్ గారిని సభికులందరూ కరతాళ ధ్వనులతో వేదిక మీదకు ఆహ్వానించగా శ్రీ భోగారావు పప్పు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. శ్రీ మేడసాని వారి సాహిత్య, అవధాన, ప్రవచనాల గురించి సాయిరామ్ వివరించారు.
ముందుగా శ్రీ ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ గారు తెలుగు పద్యం, సంగీత స్వరకల్పన అనే అంశం పై ప్రసంగించారు. అనంతరం శ్రీ మేడసాని మోహన్ గారు పోతన భాగవతం గురించి ప్రవచించారు. సాయిరామ్ తెలుగు భాష, పద్యాలు మరియు సాహిత్యం పైన కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పినవారికి బహుమతులు అందజేశారు. తామా సాహిత్య పోటీలలో పాల్గొన్న పలువురు అట్లాంటా వాసులు, వారు వ్రాసిన కవితలు మరియు కథలు చదివి వినిపించారు. వీరికి శ్రీ మేడసాని మరియు శ్రీ ఎఱ్ఱాప్రగడ బహుమతి ప్రధానం గావించారు.
తామా బోర్డు ఛైర్మన్ మహేష్ పవార్ తామా నిర్వహించే ఉచిత వైద్యశాల, విద్యార్థులకు ప్రోత్సాహకాలు, సేవ, సాంస్కృతిక మరియు సాహిత్య కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేసారు. తదనంతరం శ్రీమతి సీత వల్లూరి, శ్రీ సోమయాజులు నేమాని, శ్రీ కృష్ణమోహన్ చింతమనేని, శ్రీ సురేష్ కొలిచాల, శ్రీ ప్రభాకర్ కడియాల ను అతిథులను సన్మానించేందుకు వేదిక మీదకు ఆహ్వానించారు. శ్రీ ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ గారిని తామా ప్రెసిడెంట్ ఎలెక్ట్ వెంకీ గద్దె శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. శ్రీ మేడసాని మోహన్ గారిని తామా బోర్డు ఛైర్మన్ మహేష్ పవార్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
చివరగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులకు, శ్రీ మేడసాని ని తామా సాహిత్య విభావరికి తీసుకువచ్చిన శ్రీ కృష్ణమోహన్ చింతమనేనికి, శ్రీ ఎఱ్ఱాప్రగడ ని తీసుకువచ్చిన శ్రీ సురేష్ కొలిచాలకి, ఫొటోలు తీసిన శ్రీ కృష్ణ కి, సాహితీవేత్తలు శ్రీ మేడసాని మోహన్ మరియు శ్రీ ఎఱ్ఱాప్రగడ రామకృష్ణలకు సభాముఖంగా తామా ప్రెసిడెంట్ ఎలెక్ట్ వెంకీ గద్దె ధన్యవాదాలు తెలిపి, తేనీటి విందుతో తామా సాహిత్య విభావరిని విజయవంతంగా ముగించారు.