Connect with us

Associations

వినోదం + విభిన్నం = తామా మహిళా సంబరాలు

Published

on

యాంత్రికమయమైపోయిన నేటి జీవన విధానంలో ఆలోచనల ఒత్తిడికి ఆటవిడుపుగా వినోద కార్యక్రమాలు దోహదపడతాయి అని మన అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి వినోద కార్యక్రమాలను మరింత విజ్ఞానాత్మకంగా, కళాత్మకంగా రూపొందిస్తే అది వైవిధ్యమే. దీనికి నిలువెత్తు నిదర్శనమే గత శనివారం ఆగస్టు 17న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ నిర్వహించిన మహిళా సంబరాల కార్యక్రమం. ఇంటి పని మరియు పిల్లల బాధ్యతలతో బిజీగా ఉండే నారీమణులకు ప్రత్యేకంగా ఒక ఆటవిడుపు కార్యక్రమాన్ని అందజేయడంలో తామా మహిళా కార్యదర్శి శ్రీమతి శ్రీవల్లి శ్రీధర్, కోశాధికారిణి శ్రీమతి ప్రియ బలుసు సారధ్యంలోని ‘తామా’ జట్టు సఫలీకృతమైంది.   

ఇన్ఫోస్మార్ట్  టెక్నాలజీస్ అధినేత కరుణాకర్ రెడ్డి అసిరెడ్డి గారి సమర్పణలో, స్థానిక దేశాన పాఠశాల ప్రాంగణంలో వైభవోపేతంగా జరిగిన ఈ సంబరాలకు సుమారు 400 మందికి పైగా పాల్గొన్నారు. ముందుగా తామా కార్యవర్గ వనితలు శ్రీవల్లి శ్రీధర్, ప్రియ బలుసు, శిల్ప మద్దినేని , గౌరి కారుమంచి, హరిప్రియ దొడ్డాక, నీరజ ఉప్పు మరియు ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టారు. ప్రతిభను ప్రయోజనాత్మకంగా ప్రదర్శింపజేస్తూనే సామాన్య ప్రేక్షకులను కూడా ఆటపాటల్లో నిమగ్నం చేయిస్తూ తొక్కుడుబిళ్ళ, గచ్చ కాయలు, మూగసైగల వంటి సైయ్యాటలు ఆడించి చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేశారు. రంగు రంగుల చీరలలో, రమణీయ అలంకరణలో తెలుగు ఆడపడుచులు తమ వైవిధ్య భరిత కళలను ప్రదర్శించి కార్యక్రమాన్ని రక్తికట్టించారు. అందరూ చెట్టాపట్టాలేసుకుని ఆడిందే ఆటగా పాడింది పాటగా స్వేచ్ఛా విహంగాల్లో తేలియాడారు. వయస్సులో పెద్ద వారు కూడా చిందులేయడం కొసమెరుపు.

తదనంతరం అలనాటి ఇలనాటి పాటలతో గాయనీమణులు శ్రీవల్లి, శిల్ప ఉప్పులూరి, స్రవంతి, పూజిత, పూర్ణిమ అర్జున్, రాగ వాహిని, భానుశ్రీ వావిలకొలను గాన కోకిలలై తమ గాత్రాలతో ప్రేక్షకుల మనస్సు దోచుకున్నారు. వీణావాయిజ్యకారిణి ఉష మోచెర్ల, శాంతి మేడిచెర్ల వివిధ ప్రాంతీయ నృత్యాలతో మయూర వన్నెల నాట్య శిఖామణులు, మాట చాతుర్యతతో ఆద్యంతం అందరినీ ఉత్సాహభరితం చేసిన యాంకర్ రాగ వాహిని, అలానే సహకారవర్గం లో రేఖ హేమాద్రిభొట్ల, దీప్తి అవసరాల, గౌతమీ ప్రేమ్, కల్పనా పరిటాల మరియు సుష్మ కిరణ్ తదితరులను అభినందించాలి. అధిక బరువు, మానసిక ఒత్తిడికి సంబంధించి డాక్టర్ నందిని సుంకిరెడ్డి మరియు డాక్టర్ సౌమ్య రెడ్డి తమఅమూల్యమైన సూచనలు సలహాలు అందించారు. తామా సహకారంతో ప్రతి శనివారం నిర్వహిస్తున్న సిలికానాంధ్ర మనబడి గురువులను సత్కరించారు.

అన్ని అంశాలు కలికితురాయిలే అయినప్పటికీ వజ్రమై అందరి హృదయాలను ఆకట్టుకుంది ‘ఆడజన్మ’ విశిష్ఠ ప్రదర్శన. ఇందులో భాగంగా దాస్యం మాధవి ‘స్త్రీ తత్వం’ అనే కవితాంశతో మొదలయి ఆడజన్మను మొదలుకొని ఒక స్త్రీ తన జీవిత కాలంలో తను ఎదుర్కొని పోరాడే ఒక్కో అంశాన్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణిస్తూ రమణీయంగా అభివ్యక్తపరిచారు. పాటలతో, ఆటలతో, మాటలతో నవరసాలను పండించారు అనుటకు చివరి వరకూ చిత్రంగా చూస్తూ నిలిచిపోయిన వీక్షకమహాశయులే సాక్ష్యం. అంతే కాకుండా ‘తెలుగు అమ్మాయి’ పోటీ నిర్వహించి పలురకాల వైవిధ్య పరీక్షలతో పోటీదారులలో ఉత్సాహాన్ని నింపి వారిలో అత్యుత్తమంగా రాణించిన కొందరు నారీమణులకు విశిష్ఠ అతిథుల చేత బహుమానాలను అందింపచేసారు. ఈ సందర్భంగా బహుమతులను సమర్పించిన శ్రీకాంత్ పొట్నూరు మరియు సునీత పొట్నూరు లను అభినందించాలి. అలాగే కే.బి. జవేరి జువెలర్స్ డికేటర్ సమర్పించిన డైమండ్ రింగ్ తోపాటు ఇతర రాఫుల్ బహుమతులను కూడా విజేతలకు అందించారు.

ఆడి పాడి అలరాడి అలసి పోగా విచ్చేసిన వారందరికీ అమ్మలా రుచికరమైన విందుతో మెప్పించారు మన శ్రీధర్ దొడ్డపనేని సారధ్యంలోని పెర్సిస్ బిర్యాని ఇండియన్ రెస్టారెంట్ బృందం. అంతకు ముందు మయూరి ఇండియన్ గ్రిల్ స్నాక్ స్టాల్ మరియు ఇతర వ్యాపార స్టాల్ల్స్ అందరిని ఆకట్టుకున్నాయి.  చివరిగా ఆడియో, లైటింగ్, ఫోటోగ్రఫీ సేవలందించిన ట్రెండీ ఈవెంట్స్ అధినేత శ్రీని టిల్లు, వేదికను అందంగా అలంకరించిన మేరీగోల్డ్ ఈవెంట్స్ అధినేత్రి సుజాత పొన్నాడ, మహిళా సంబరాలను విజయవంతం చేసిన అట్లాంటా మహిళలకు పేరు పేరునా ప్రత్యేక అభినందల వాన కురిపించడంతో కార్యక్రమం ముగిసింది.

error: NRI2NRI.COM copyright content is protected