నవంబర్ 2న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ నిర్వహణలో అంతర్జాతీయ కథకురాలు, విశిష్ట వ్యక్తిత్వ పురస్కార గ్రహీత, హరికథా భారతి, ఆల్ ఇండియా రేడియో మరియు టీవీ కథకురాలు శ్రీమతి ఏలూరి ఆదిలక్ష్మీ శర్మ గారిచే సీతాకళ్యాణం హరికథా కార్యక్రమం జరిగింది. ప్రహ్లాద్ రామ్ మృదంగంతో, ప్రణవ్ స్వరూప్ వయోలిన్ తో తదనుగుణంగా ఆదిలక్ష్మీ శర్మ గారికి సహకారమందించారు. స్థానిక దేశానా పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 200 మందికి పైగా సాహితీ ప్రియులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా తెలుగు సాహిత్య కార్యక్రమాలలో భాగంగా తామా ఈ హరికథా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ముందుగా తామా అధ్యక్షులు వెంకీ గద్దె స్వాగతోపన్యాసం చేస్తూ, సాహితీవేత్తలు ఆదిలక్ష్మీ శర్మ గారిని, మృదంగం వాయిద్యకారులు ప్రహ్లాద్ రామ్ మరియు వయోలిన్ వాయిద్యకారులు ప్రణవ్ స్వరూప్ లను సభికులకు పరిచయం చేసారు. ఆదిలక్ష్మీ శర్మ గారు పూజతో మొదలుపెట్టి తదుపరి హరికతలోకి వెళ్లారు. రాముని జననం, యాగరక్షణ కొరకు రామలక్ష్మణులను విశ్వామిత్రుడు తనతో తీసుకెళ్లడం, సకల విద్యలు నేర్పించడం, సీతా స్వయంవరం, రాముడు శివధనస్సు విరిచి సీతను వివాహమాడడం తదితర ముఖ్య ఘట్టాలని హరికథా రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు. సీతా స్వయంవరంలో భాగంగా శంభో శివ శంభో అంటూ పాడిన పాట మొత్తం కార్యక్రమానికే హైలైట్. మధ్యమధ్యలో పిట్ట కథలతో సభికులను నవ్వించడం విశేషం. వయస్సులో చిన్నవారైనప్పటికీ, కార్యక్రమం ఆసాంతం ప్రహ్లాద్ రామ్, ప్రణవ్ స్వరూప్ హరికథకు అనుగుణంగా వాయిద్యం అందించడం అభినందనీయం. చివరిగా మంగళంతో హరికథను ముగించారు. సభికులందరూ చివరివరకు హరికథలో లీనమై ఆస్వాదించడం విశేషం. చిన్న పిల్లలు సైతం ఆద్యంతం ఆసక్తిగా తిలకించడం కొసమెరుపు.
తదనంతరం తామా కార్యవర్గ సభ్యులు మరియు బోర్డు సభ్యులు కలిసి అతిధులు ఆదిలక్ష్మీ శర్మ గారిని, ప్రహ్లాద్ మరియు ప్రణవ్ లను పుష్పగుచ్ఛం, శాలువా మరియు జ్ఞాపికలతో సగౌరవంగా సత్కరించారు. ఆదిలక్ష్మీ శర్మ గారికి ఆతిధ్యమిచ్చి ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించిన విజయ్ కొత్తపల్లి గారిని, ఈ కార్యక్రమానికి ఉచితంగా ఆడియో సహకారం అందించిన తామా బోర్డు సభ్యులు కమల్ సాతులూరు గారిని, తమ సహాయసహకారాలందించిన తామా కార్యవర్గ సభ్యులు భరత్ మద్దినేని, ఇన్నయ్య ఎనుముల, ప్రియా బలుసు, సుబ్బారావు మద్దాళి, సాయిరాం కారుమంచి, ఆదిత్య గాలి, రవి కల్లి, సురేష్ బండారు, శ్రీవల్లి కంసాలి, తామా బోర్డు సభ్యులు వినయ్ మద్దినేని, నగేష్ దొడ్డాక, మనోజ్ తాటికొండ, అలాగే ఈ హరికథా కార్యక్రమానికి హాజరైన సాహితీ ప్రియులందరినీ తామా అధ్యక్షులు వెంకీ గద్దె అభినందించారు. సభికులందరూ అతిథులతో ఫోటోలు దిగడం, ఆతర్వాత తేనీటి విందుతో కార్యక్రమం ఘనంగా ముగిసింది.