Connect with us

News

అట్లాంటా గగన వీధుల్లో విహరించిన యువత @ TAMA Discovery Flight

Published

on

యువతీ యువకులు కారు డ్రైవింగ్ నేర్చుకోవడం విన్నాము, ఫ్లైట్ డ్రైవింగ్ గురించి ఎంత వరకు వినుంటాము. ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ ఫ్లైట్ ట్రైనింగ్ ఏర్పాటు చెయ్యడం ఎక్కడైనా చూశామా. ఇలాంటి విశిష్ట కార్యక్రమాలు చూడాలంటే మీరు అట్లాంటా రావాల్సిందే. చరిత్రలోనే మొట్టమొదటి సారిగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) వారు అగస్టా ఫ్లైట్ స్కూల్ వారి సౌజన్యంతో అక్టోబర్ 28, 29 న స్థానిక చెరోకీ కౌంటీ ఎయిర్ పోర్ట్ లో ‘డిస్కవరీ ఫ్లైట్’ నిర్వహించారు.

రెండు రోజులకు కలిపి 16 స్లాట్స్ ఉండడంతో యువతకు మాత్రమే అవకాశం ఇవ్వడం ద్వారా తామా తమకు యువత ఎంత ముఖ్యమో తెలియజెప్పారు. ప్యాసెంజర్ ఫ్లైట్స్ ఓవర్ బుక్ అయినట్టుగా, ఇక్కడ కూడా చాలా మంది ఉత్సాహం చూపారు. వారిలో త్వరగా దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మొదటిసారి కాబట్టి చాలా మందికి అర్థం కాలేదు, కొందరు సిమ్యులేషన్ అనుకున్నారు, కొందరు థియరీ క్లాస్ అనుకున్నారు.

అసలు డిస్కవరీ ఫ్లైట్ (Discovery Flight) అంటే ఏంటంటే, ఫ్లైట్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ఒక గంట పాటు జరిగే పైలట్ ట్రైనింగ్, దీన్ని ఫస్ట్ అవర్ ఫ్లైట్ అని కూడా అంటారు. అగస్టా ఫ్లైట్ స్కూల్ సమతా శెట్టి మరియు నంది శెట్టి, అఖిల్ ఇన్స్ట్రక్షన్ లో 10 నుండి 20 సంవత్సరాల మధ్య పిల్లలు హుషారుగా ఆకాశంలో షికారు చేశారు. ట్రైనీతో పాటు మరొక్కరు వెళ్ళడానికి అవకాశం ఉండటంతో తోబుట్టువులు లేక తల్లిదండ్రులలో ఒకరు వెళ్లడం జరిగింది.

Cherokee County Airport చుట్టుపక్కల చిన్న చిన్న కొండలు, చెట్లు, మంచి ఫాల్ కలర్స్ ఉండడం వల్ల ఆకాశ యాత్ర మరింత శోభాయమానంగా సాగింది. సముద్రపు మట్టం నుండి సుమారు 3 నుంచి 4 వేల అడుగుల ఎత్తులో సాగిన ఈ ట్రైనింగ్ లో ఎంతో ప్రాచుర్యం పొందిన సెస్నా 172 ఫ్లైట్ ఉపయోగించారు.

2023లో ఇది తామా (Telugu Association of Metro Atlanta) వారి 23వ కార్యక్రమం. రాబోయే రోజులలో విల్ & ట్రస్ట్ గ్రాండ్ మేళా, చెస్, దీపావళి, క్రిస్మస్ ఇలా ఇంకా ఎన్నో జరగబోతున్నాయి. వివరాల కోసం www.tama.org ని సందర్శించండి లేదా info@tama.org కి ఈమెయిల్ చేయండి.

ట్రైనింగ్ లో పాల్గొన్న వారందరికీ ఫ్లైట్ అఫీషియల్ లాగ్ బుక్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎవరైనా ట్రైనింగ్ కొనసాగిద్దామనుకుంటే వారు సెకండ్ అవర్ ఫ్లైట్ లో చేరవచ్చు. అందరూ ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లడం, రన్ వే, ఫ్లైట్లను దగ్గరనుండి చూడడం ఒక ప్రత్యేక అనుభూతి. పాల్గొన్న పిల్లలు చాలా థ్రిల్లింగ్ గా ఉందని చెప్పారు, కొందరు భవిష్యత్తులో కొనసాగిస్తామని అన్నారు.

పెద్దవాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. తామా వారు ఇలాంటి వైవిధ్యమైన కార్యక్రమాలు చాలా చేస్తున్నారనీ, మరిన్ని చేయాలని ఆకాంక్షించారు. తామా (TAMA) అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి, టెక్నాలజీ కార్యదర్శి సునీల్ దేవరపల్లి, కమ్యూనిటీ కార్యదర్శి సత్య గుత్తుల ఎయిర్ పోర్ట్ సిబ్బంది నంది శెట్టి, అఖిల్ లను ఘనంగా సత్కరించారు.

ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఇలాంటి కార్యక్రమం తాము మొదటిసారి చూస్తున్నామనీ, చాలా బాగుందని కితాబిచ్చారు. మామూలుగా 50 సంవత్సరాల పైబడ్డ వారికి శిక్షణ ఇస్తుంటాననీ, ఇలా ఇంత మంది యువతకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందనీ, ఇదొక గొప్ప అనుభూతి అని అఖిల్ చెప్పారు.

ఇప్పటిదాకా ఏ సంస్థ ఇలాంటి కార్యక్రమం చేయలేదనీ, తామా (TAMA) వారు ఇలా ముందుకు రావడం ఒక గొప్ప విషయం అనీ, ఇలా ఎందరో ముందుకు రావాలని నంది శెట్టి అని, ఈ ఆలోచన చేసి, ఆచరించి చూపిన సాయిరామ్ ను ప్రత్యేకంగా అభినందించారు. రెండు రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఈ అరుదైన, అద్భుతమైన కార్యక్రమానికి సహకరించిన అందరికీ సాయిరామ్ కృతజ్ఞతలు తెలిపి, దిగ్విజయంగా ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected