అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కమ్మింగ్ నగరంలోని లైఫ్ లైన్ తెలుగు చర్చిలో డిసెంబర్ 14న ఎంతో ఘనంగా జరిగాయి. తామా వారి ఆహ్వానాన్ని అందుకొని అనేకమంది తెలుగు వారు ఈ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు.
సిలికానాంధ్ర మనబడి తెలుగు తరగతులు తామా వారి సహకారంతో లైఫ్ లైన్ చర్చిలో గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నాయి. తరగతుల అనంతరం టీచర్లు మరియు బాలబాలికలు క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ప్రీతి పవార్ గారి ఆధ్వర్యంలో చర్చి వారు పిల్లలకోసం అనేక ఆటలు నిర్వహించారు. అలాగే చర్చి వారు నిర్వహించిన ఫేస్ పెయింటింగ్ లో పిల్లలు ఎంతో ఉంత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో లైఫ్ లైన్ చర్చి వర్షిప్ టీం వారు తెలుగు మరియు ఇంగ్లీష్ క్రిస్మస్ పాటలతో అందరిని అలరించారు. చర్చి వారు చక్కని నృత్యాలు మరియు క్రిస్మస్ స్కిట్ ను ప్రదర్శించారు. ఏంజెలినా నిట్టాల, నిరుపమ నీల, మంజుల గుండుగొల్లు, సుసాన్ పుల్ల మరియు ప్రసన్న కాకర్లమూడి తదితరలు ఇందుకు సహాయపడ్డారు.
లైఫ్ లైన్ చర్చి పాస్టర్ సంజీవ్ కటికల గారు క్రిస్మస్ శుభాకాంక్షలు అందచేస్తూ యేసు క్రీస్తు జననం ఒక జాతికో, మతానికో సంబంధించింది కాదని చెప్పారు. బైబిల్ లో యేసు జననం ప్రజలందరికి మహా సంతోషకరమైన సువర్తమానమని వ్రాయబడి ఉందని తెలియచేసారు. యేసు క్రీస్తు మానవుల పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయటానికి ఈ లోకానికి వచ్చారని చెప్పారు. తదుపరి సంజీవ్ గారు విచ్చేసిన కుటుంబముల కొరకు ప్రార్ధించారు.
సభను ఉద్దేశించి మాట్లాడుతూ తామా ప్రెసిడెంట్ వెంకీ గద్దె గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసి తామా కార్యక్రమాల గురించి వివరించారు. ఆయనతో పాటు తామా కార్యవర్గం ఇన్నయ్య ఎనుముల, రవి కల్లి, సాయిరాం కారుమంచి, రాజశేఖర్ చుండూరి, శ్రీనివాస్ ఉప్పు, శ్రీరామ్ రొయ్యల తదితరులు వేదికను అలంకరించారు. సిలికానాంధ్ర మనబడి కార్యనిర్వహణాధికారి విజయ్ రావిళ్ల గారు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి, తెలుగు తరగతులు అందుబాటులో ఉన్నాయి గనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా మనవి చేసారు.
అనంతరం పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా శాంతా తో ఫోటోలు తీసుకున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా చర్చి వారు పాల్ పుణ్యసముద్రం, నిరుపమ నీల తదితరుల ఆధ్వర్యంలో వెనువెంటనే ఫొటోస్ లామినేట్ చేసి ఇవ్వడం విశేషం. భిన్నత్వంలో ఏకత్వంలా తామా వారు అన్ని పండుగలను నిర్వహించడాన్ని అందరూ అభినందించారు. రుచికరమైన విందు భోజనాలతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ముగిశాయి.