జ్ఞానం విజ్ఞానం కలగలిపితేనే చదరంగం ఇటువంటి చదరంగం క్రీడను ఆడాలంటే ఎంతో మేధస్సు ఉండాలి. పరాయి దేశంలో ఉంటున్న తెలుగు వారు కూడా ఈ చదరంగం (Chess) ఆటపై మక్కువ చూపుతూ తమ ప్రతిభాపాఠవాలను ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అట్లాంటా (Atlanta) లో చదరంగం ప్రేరణ పై తామా (TAMA) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోటీలు తెలుగువారి సత్తాను వెలికి తీస్తున్నాయి.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఆధ్వర్యంలో మార్చి 2న అట్లాంటా లోని ది వైన్ కమ్యూనిటీ చర్చ్ లో (The Vine Community Church) 19వ అర్థవార్షిక చదరంగం పోటీలు నిర్వహించారు. ఇటువంటి రేటెడ్ (Rated) మరియు అన్ రేటెడ్ (UnRated) చెస్ టోర్నమెంట్ లను తామా గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తోంది.
ఈ టోర్నమెంట్ కు దాదాపు 150 మందికి పైగా కిండర్ గార్డెన్ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు మరియు పెద్దలు పాల్గొన్నారు. ఈ పోటీలకు రేడియంట్ లైఫ్ ఇంటర్నేషనల్ (Radiant Life International) రవి కుమార్ మందాడి (Ravi Kumar Mandadi) స్పాన్సరుగా వ్యవహరించారు.
ఈ టోర్నమెంట్ స్విస్ పద్ధతి లో 4 విభాగాలు (యు 500, యు 1000, యు 1500, ఆన్ రేటెడ్ మరియు పెద్దలు) మరియు టైమ్ కంట్రోల్ జి 25+5 డిలే ప్రకారంగా జరిగింది. ఉదయం 10 గంటలకు టోర్నమెంట్ ప్రారంభమై సాయంత్రం 5 వరకు కొనసాగింది. మొత్తం 4 రౌండ్లు, ఉదయం 10, 11 గంటలకు మరియు మధ్యాహ్నం 1:30, 2:30 గంటలకు జరిగాయి.
ఈ ఆహ్లదకర వాతావరణంలో పిల్లలు ఎంతో క్రమబద్ధతతో పాల్గొన్నారు. ప్రతి విభాగంలో మొదటి ముగ్గురు విజేతలకు మరియు ప్లస్ 2.5 స్కోర్ వారికీ తామా (Telugu Association of Metro Atlanta) కార్యవర్గ మరియు బోర్డు సభ్యులు ట్రోఫీలు అందజేశారు. తామా వారు స్పాన్సర్ రవి కుమార్ మందాడిని ఘనంగా సత్కరించారు.
అలాగే రవి కుమార్ మందాడి మాట్లాడుతూ.. అట్లాంటా తెలుగు సంఘం తామా (TAMA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తాను భాగమవటం ఎంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) చేపట్టడం చాలా ఆనందదాయకమన్నారు.
ఈ పోటీలను ఉద్దేశించి తామా అధ్యక్షులు సురేష్ బండారు (Suresh Bandaru) మాట్లాడుతూ.. తెలుగువారి మేదస్సు ప్రపంచ దేశాల పౌరులు అందరికంటే ఎంతో అద్వితీయమని ప్రశంసించారు. చదరంగం ఆడటం అంటే ఎత్తుకు పై ఎత్తు వేయడం, మేధస్సును ప్రయోగించడం చివరకు విజయం సొంతం చేసుకోవడం అన్నారు. అనంతరం ముఖ్య అతిధులను, తామా కార్యవర్గ మరియు బోర్డు సభ్యులను ఆహుతులకు పరిచయం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జార్జియా స్టేట్ రిప్రజంటేటివ్ టాడ్ జోన్స్ (Todd Jones), పాస్టర్ మార్క్ (Mark), ఎడ్యుకేషన్ బోర్డు కంటెస్టెంట్ డోరి అషేర్ వుడ్ (Doria Usherwood) మరియు జార్జియా స్టేట్ రిప్రజంటేటివ్ కంటెస్టెంట్ అశ్విన్ (Ashwin) ను శాలువాతో పాటు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు.
ముఖ్య అతిధులు మాట్లాడుతూ.. భారతీయుల మేధాసంపత్తి ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉందని ప్రశంసించారు. అలాగే భారతీయుల (Indians) జ్ఞాన సంపత్తి ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయని, అందుకే భారతీయులంటే ఎక్కువ విలువ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న పిల్లలకు, పెద్దలకు, తల్లిదండ్రులకు మరియు విచ్చేసిన అందరికి తామా వారు పిజ్జా, మంచి నీరు, స్నాక్స్ మరియు టీ అందజేశారు.
తామా క్రీడా కార్యదర్శి చలమయ్య బచ్చు (Chalamayya Batchu) ముఖ్యపాత్ర వహించగా చెస్ట్రానిక్స్ స్కూల్ ఆఫ్ చెస్ అధినేత సూర్య (Surya), ధన (Dhana) మరియు పార్నెల్ వాట్కిన్స్ (Parnell Watkins) తోడ్పాటు అందించారు. ఈ కార్యక్రమంలో తామా కార్యవర్గ మరియు బోర్డ్ సభ్యులు శ్రీనివాస్ ఉప్పు, సురేష్ బండారు, చలమయ్య బచ్చు, సునీత పొట్నూరు, సాయిరామ్ కారుమంచి, శశి దగ్గుల, శ్రీనివాసులు రామిశెట్టి, సునీల్ దేవరపల్లి, తిరు చిల్లపల్లి, సత్య నాగేందర్ గుత్తుల పాల్గొన్నారు. మరిన్ని ఫోటోల కోసం www.NRI2NRI.com/TAMA Chess 2024 ని సందర్శించండి