Connect with us

Events

‘తాజా’ ఉగాది వేడుకలు నభూతో న భవిష్యతి

Published

on

. ‘తాజా’ చరిత్రలో మైలురాయి
. 1400 మందికి పైగా హాజరు
. మినీ కన్వెన్షన్ తరహా కార్యక్రమాలు
. పాల్గొన్న తానా అధ్యక్షులు, సిటీ కౌన్సిల్ సభ్యులు
. కోవిడ్ ని మరిచేలా ఆహ్లాదం
. తాజా కి శుభాన్ని అందించిన శుభకృత నామ సంవత్సరం

జాక్స‌న్విల్ తెలుగు సంఘం ‘తాజా’ ఉగాది వేడుకలు ఏప్రిల్ 16న నభూతో న భవిష్యతి అనేలా పెద్ద ఎత్తున నిర్వహించారు. స్థానిక త్రాషెర్ హార్న్ సెంటర్ లో గత శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 11 గంటలవరకు ఎడతెరిపిలేకుండా సంస్కృతీ సంప్రదాయాలను ఆహ్లాదకరమైన కార్యక్రమాలతో మేళవించి తెలుగు అసోసియేష‌న్ ఆఫ్ జాక్స‌న్విల్ ఏరియా ‘తాజా’ చరిత్రలోనే ఒక మైలురాయిలా అంగరంగ వైభవంగా నిర్వహించారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలో సూర్య భాయ్ అంటే నేను కాదు, ఇట్స్ ఏ బ్రాండ్ అంటాడు. అలాగే తాజా ఉగాది వేడుకలు కూడా ఒక ఈవెంట్ మాత్రమే కాదు, ఇట్స్ ఏ బ్రాండ్ న్యూ ఎక్స్ పీరియన్స్. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి తర్వాత లార్జర్ దాన్ లైఫ్ తరహాలో ఇంతలా మధురానుభూతులను పంచేలా వేడుకలు నిర్వహించడం అంటే విశేషమే.

1400 మందికి పైగా హాజరు, 450 మంది యువత ప్రదర్శనలు, 400 కుటుంబాల ఆహ్వానితులు, 100 మందికి పైగా వాలంటీర్స్, 50 సాంస్కృతిక కార్యక్రమాలు, 15 రకాల వంటకాలతో షడ్రుచుల పండుగ భోజనం ఇలా చెప్పుకుంటూ పొతే తమ్ముడు సినిమాలోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నంబర్స్ తో సహా చెప్పే డైలాగ్స్ గుర్తుకు వస్తాయి.

మొదటగా సువిశాల వేదిక ప్రాంగణంపై తాజా అధ్యక్షులు సురేష్ మిట్టపల్లి కుటుంబ సమేతంగా జ్యోతి ప్రజ్వలనతో మంగళకరంగా తాజా ఉగాది వేడుకలను ప్రారంభించి, ఆహుతులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపి స్వాగతించారు. శాస్త్రీయ సంప్రదాయంతో మొదలుకొని, రామ రసం, హిందోళ రాగం, పాత కొత్త సమ్మిళతంగా సినీ డ్యూయెట్స్, అన్ స్టాపబుల్ షో అనుకరణ వంటి కార్యక్రమాలు సభికులను ఉర్రూతలూగించాయి.

ఈ సందర్భంగా తాజా గత అధ్యక్షులను గుర్తుపెట్టుకొని మరీ ఘనంగా సన్మానించడం అభినందనీయం. అలాగే ఇంత పెద్ద వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్న అన్ని కమిటీల సభ్యులను వేదికమీదికి ఆహ్వానించి ప్రతి ఒక్కరినీ అభినందించారు. కార్యక్రమాల మధ్య మధ్యలో యాదృచ్ఛికంగా అందించిన విలువైన రాఫుల్ బహుమతులు అందరినీ ఆకట్టుకున్నాయి.

తాజా ఉగాది వేడుకల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో బూత్ అందరినీ ఆకర్షించడంతో అందరూ తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగుతూ కనిపించారు. తాజా ఉగాది వేడుకలు ముగింపు అనంతరం ఆహుతుల మొహాల్లో ఆనందం, ఆహ్లాదం చూస్తే తెలుగు అసోసియేష‌న్ ఆఫ్ జాక్స‌న్విల్ ఏరియా ‘తాజా’ కార్యవర్గ సభ్యులు పడ్డ 2 నెలల కష్టం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.

20 సంవత్సరాల తాజా సంస్థ చరిత్రలో మైలురాయి లాంటి చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన అధ్యక్షులు సురేష్ మిట్టపల్లి, తాజా కార్యవర్గ సభ్యులు, వాలంటీర్స్, ఈవెంట్ డెకరేటర్స్, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తలు, కొరియోగ్రాఫర్స్, వ్యాఖ్యాతలు, స్పాన్సర్స్ ఇలా అందరినీ ప్రత్యేకంగా అభినందించాలి. చివరిగా వందన సమర్పణలో భాగంగా జనగణమన జాతీయ గీతంతో తాజా ఉగాది వేడుకలను ఘనంగా ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected