Connect with us

Events

అంబరాన్నంటిన ‘తాజా’ సంక్రాంతి సంబరాలు

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్ ఏరియా ‘తాజా’ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సురేష్ మిట్టపల్లి కార్యవర్గం కొత్త సంవత్సరంలో ఈ మొట్టమొదటి ముఖాముఖి కార్యక్రమాన్ని గత శనివారం జనవరి 29న స్థానిక బోల్స్ మిడిల్ స్కూల్లో నిర్వహించారు. యువర్ ట్రావెల్ బుకింగ్ మరియు యెడాస్ టెక్ సమర్పించిన ఈ సంబరాలలో సుమారు 500 మందికి పైగా పాల్గొని పండుగ వాతావరణాన్ని తెచ్చారు.

హిందూ సంప్రదాయం ప్రకారం దైవ ప్రార్ధన గావించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. స్వామి కార్యం అనంతరం స్వకార్యం అన్నట్టు ఆహూతులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపి సూర్యాయ నమః అంటూ ఒక మంచి కళాఖండంతో సాంస్కృతిక కార్యక్రమాలకు శుభారంభాన్ని అందించారు.

అనంతరం యోగా సాధన, సాంప్రదాయ దుస్తుల పోటీలు, అక్షరాభ్యాసం, సిరివెన్నెల అమృతం, పరమానందయ్య శిష్యుల నాటకం, సిలికానాంధ్ర మనబడి మరియు తానా పాఠశాల గురువుల సత్కారం, హిందుస్తానీ క్లాసికల్ ఫ్యూజన్, సంక్రాంతి పండుగ థీమ్ తో పాటలు, డాన్సులు, కోలాటం, ముగ్గుల పోటీలు తదితర కార్యక్రమాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసారు.

అధ్యక్షోపన్యాసంలో భాగంగా అధ్యక్షులు సురేష్ మిట్టపల్లి తాజా సంస్థ సేవాకార్యక్రమాలను వివరించి, తెలుగుదనం నిండిన ఈ సంక్రాంతి సంబరాలు ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తోటి కార్యవర్గ సభ్యులు, స్పాన్సర్స్, విచ్చేసిన ప్రేక్షకులు, వాలంటీర్స్ ఇలా ప్రతిఒక్కరినీ పేరు పేరునా అభినందించారు.

విశాలమైన వేదిక, ప్రతి సాంస్కృతిక కార్యక్రమానికి తగ్గట్టు నేపధ్య గ్రాఫిక్స్, నోరూరించే పిండివంటలతో విందు భోజనం అందరినీ ఆకట్టుకున్నాయి. 20వ వసంతంలోకి అడుగెట్టిన జాక్సన్విల్ తెలుగు సంఘం ‘తాజా’ సంక్రాంతి సంబరాలతో 2022వ సంవత్సరానికి ప్రత్యేక ఆహ్వానం పలికినట్టైంది.

కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సీడీసీ గైడ్లైన్స్ మరియు సేఫ్టీ మెజర్స్ పాటించడం అభినందనీయం. చివరిగా అందరూ భారతదేశ మరియు అమెరికా జాతీయ గీతాలతో తాజా సంక్రాంతి సంబరాలను ముగించారు.

error: NRI2NRI.COM copyright content is protected