ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) లో ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న ఠాగూర్ మల్లినేని (Tagore Mallineni) అటు అమెరికాలోనూ, ఇటు జన్మభూమిలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. పెనమలూరు (Penamaluru, Vijayawada) వచ్చిన సందర్భంగా ప్రజలకు ఏదైనా మేలు చేయాలని భావించి ఉయ్యూరులోని కెసిపి రోటరీ హాస్పిటల్ వారి సహకారంతో, తానా ఆధ్వర్యంలో రైతుకోసం తానా పేరుతో ఉచిత మెగా కంటి వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు.
అక్టోబర్ 20వ తేదీన పెనమలూరులోని జడ్ పి హస్కూలులో జరిగిన ఈ కంటి వైద్య శిబిరానికి (Eye Camp) దాదాపు 400 మందికిపైగా హాజరై పరీక్షలను చేసుకున్నారు. ఈ పరీక్షల్లో కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి 7వ తేదీన ఆపరేషన్లు చేయనున్నారు. 10వ తేదీన అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేయనున్నారు.
అలాగే పేద రైతులకు పవర్ స్ప్రేయర్లను, రక్షణ పరికరాలను, మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఠాగూర్ మల్లినేని (Tagore Mallineni) మాట్లాడుతూ, తానా తరపున జన్మభూమిలో సేవా కార్యక్రమాలు చేసే అవకాశం లభించిందని, ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
తానా సెక్రటరీ రాజా కసుకుర్తి (Raja Kasukurthi), తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli) సహకారంతో, తానా రైతు కోసం చైర్ రమణ అన్నె, కో చైర్ ప్రసాద్ కొల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనమలూరు (Penamaluru) ఎన్నారై ప్రతినిధులు పాలడుగు సుధీర్, కిలారు ప్రవీణ్, మోర్ల నరేంద్ర తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు.