అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా వేలాదిమంది సభ్యులతో ఉన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 తెలుగు సంఘంగా గుర్తింపు పొందింది. అలాంటి తానాలో జరిగే కార్యక్రమాల్లో ఎక్కువమంది తెలుగువాళ్ళు పాల్గొనేలా, సేవా కార్యక్రమాల్లో ఎక్కువమంది పాలుపంచుకునేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని 2023-25 కాలానికి ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన తానా నూతన ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని అన్నారు.
తానాలోని సభ్యులంతా కలిసి నడవాలని, ప్రపంచంలోని తెలుగు సంఘాలను కలుపుకుని తానా కార్యక్రమాలు చేయాలన్న లక్ష్యం ఉంది. అందుకు అనుగుణంగా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్‌గా తన ఆశయంతోపాటు తానా వేదికగా అందరినీ కలుపుకుని కార్యక్రమాల విజయవంతానికి కృషి చేస్తానంటున్నారు కృష్ణా జిల్లా పెనమలూరువాసి ఠాగూర్ మల్లినేని.
ప్రపంచంలోని తెలుగు కమ్యూనిటీకి, తెలుగు సంఘాలకు కూడా తానా (Telugu Association of North America) కార్యక్రమాలు తెలుసుకునేలా చేస్తాను. వారిని కూడా ఇందులో భాగస్వాములయ్యేలా పెద్దలతో కలిసి కృషి చేస్తానని చెబుతున్నారు. గత రెండేళ్లుగా తానా మీడియా కోఆర్డినేటర్‌గా తను (Tagore Mallineni) చేసిన సేవలు మీకు తెలిసిందే.
జన్మభూమిలో తానా సేవలు, కార్యక్రమాలను పత్రికల ద్వారా అందరికీ అందే విధంగా కృషి చేశారు. తద్వారా పత్రికల్లో ప్రచురితమైన తానా కార్యక్రమాలు అమెరికాలోని మన వాళ్ళకే కాక, తెలుగు రాష్ట్రాల్లోని వారికి కూడా చేరాయి. అలాగే ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ (International Coordinator) గా ఇక నుంచి తానా సేవా కార్యక్రమాలు ప్రపంచంలోని అందరికీ తెలిసేవిధంగా కృషి చేస్తారు.
ఠాగూర్ మల్లినేని ఇటీవల జరిగిన తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా పెనమలూరులో చేయూత కార్యక్రమం కింద పేద విద్యార్థులకు దాదాపు లక్ష రూపాయల విలువ చేసే స్కాలర్ షిప్ లను, పేద రైతులకు పవర్ స్ప్రేయర్లు, రైతు రక్షణ పరికరాలను అందజేశారు. ఆదరణ కార్యక్రమం కింద మహిళలకు కుట్టుమిషన్లను, వికలాంగులకు ట్రై సైకిళ్ళను పంపిణీ చేశారు.
క్యాన్సర్ పరీక్ష కేంద్రం ఏర్పాటుతోపాటు ఇఎన్‌టి, ఉచిత వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. జడ్‌పి హైస్కూల్‌కు కుట్టుమిషన్లను అందజేశారు. కాగా ఠాగూర్ మల్లినేనికి పదవి లభించడం పట్ల తానా సభ్యులు, పెనమలూరువాసులు, ఆయన మిత్రులు పలువురు సంతోషం వ్యక్తం చేశారు.