ఏప్రిల్ 14న అమెరికాలోని చికాగోలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ‘టీఏజీసీ’ ఆధ్వర్యంలో శ్రీ విళంబి నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది మరియు శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక స్ట్రీమ్వుడ్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ వేడుకలకు సుమారు 1000 మందికి పైగా చికాగో పరిసర ప్రాంత వాసులు పాల్గొన్నారు. స్వాగతోపన్యాసం, జ్యోతి ప్రజ్వలనతో మొదలైన వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రదర్శించిన రామాయణం, సందర్భోచిత కామెడీ స్కిట్, సినీ నృత్యాలు, జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు మరియు పాటలు సుమారు 300 మంది కళాకారులతో అందరిని ఆహ్లాదపరిచాయి. అతిలోక సుందరి తెలుగు నటి శ్రీదేవికి నివాళిలో భాగంగా ప్రదర్శించిన నృత్యాలను ఆహుతులందరు కొనియాడారు. యువతకు ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్ సర్టిఫికెట్స్ అందజేశారు. అలాగే టీఏజీసీ అధ్యక్షులు జ్యోతి చింతలపాణి ఈ వేడుకల నిర్వహణకు సర్వదా సహస్రదా సహకరించిన సాంస్కృతిక కమిటీ సభ్యులు పాండురంగారెడ్డి లెంకల, ఉమా అవదూత, శ్వేత జనమంచి, మాధవి రాణి కొనకొల్ల, వేదిక అలంకరణ పనులను నిర్వహించిన వాణి ఏట్రింతల, మెంబర్‌షిప్ కమిటీ సభ్యులు ప్రవీణ్ వేములపల్లి, మమత లంకల, విజయ్ బీరం, ఫుడ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ కంద్రు, అంజి రెడ్డి కందిమళ్ల, సంపత్ సప్తగిరి తదితర టీఏజీసీ కార్యవర్గ సభ్యులకు మరియు సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఈ వేడుకలను జయప్రదం చేసిన ఆహుతులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేసారు. చివరిగా ఉగాది పచ్చడితో కూడిన విందు భోజనాలతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.