ఎన్టీఆర్! ఈ మూడు అక్షరాలు వినగానే ప్రతి తెలుగోడి వెంట్రుకలు కూడా నిల్చుంటాయి. సినిమాలైతేనేం, రాజకీయాలైతేనేం ఒక వెలుగు వెలిగిన ధృవతార ఎన్టీఆర్. మరి అలాంటి యుగపురుషునికి తమ స్వరాలతో అభిషేకం చేయాలనే ఆలోచన రావడం, అనుకుందే తడవుగా సంకల్పించడం, అదే ధృడ సంకల్పంతో ఎన్టీఆర్ 96వ జయంతి సందర్భంగా అట్లాంటాలో జూన్ 3న రామ్ దుర్వాసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయం.
ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం మొదలవగా సుమారు 3 గంటలపాటు ఎన్టీఆర్ సినీ చరిత్రలో అజరామరంగా నిలిచిన సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలలోని వివిధ పాటలను పద్యాలను ఆలపించారు అట్లాంటా గాయనీ గాయకులు రామ్ దుర్వాసుల, వెంకట్ చెన్నుబోట్ల, భానుశ్రీ వావిలకొలను, శ్రీవల్లి శ్రీధర్, ఫణి డొక్కా, శాంతి మేడిచెర్ల, లక్ష్మి వేదాల, ఉష మోచెర్ల, హరిణి యనమండల, శిరీష దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, నీలిమ గడ్డమణుగు మరియు మేఘన పోతుకూచి. సమాంతరంగా నీలిమ గడ్డమణుగు వ్యాఖ్యానం మరియు వీడియో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమ ఆద్యంతం చప్పట్లు ఈలలతో వేదిక ప్రాంగణం మార్మోగిపోయింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి, కవి, రచయిత శ్రీ జొన్నవిత్తుల గారు ఎన్టీఆర్ నటన, పాలనాదక్షత గురించి మాట్లాడుతూ చిన్నప్పుడు ఎన్టీఆర్ సినిమాలకి రిలీజ్ రోజు మొదటి ఆటకే వెళ్లడం, వెళ్లొచ్చి ఆ సినిమాల గురించి అందరికి వివరించడం లాంటి విషయాలను నెమరు వేసుకున్నారు. తదనంతరం అట్లాంటా ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు మరియు అభిమానులు కేక్ కట్ చేసి అందరికి పంచారు. గాయనీ గాయకులు, ఫోటోగ్రాఫర్ జి.వి. రావు మరియు స్పాన్సర్స్ అందరిని జొన్నవిత్తుల గారి చేతుల మీదుగా శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. చివరిగా కృష్ణ విలాస్ అందించిన తేనీయ విందుతో కార్యక్రమం ముగిసింది.