స్టార్ మా టెలివిజన్ (Star Maa TV) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సూపర్ సింగర్ (Super Singer) కార్యక్రమానికి అమెరికానుండి డెట్రాయిట్ (Detroit, Michigan) అమ్మాయి సుధ వైష్ణవి నన్నూర్ ఎంపికైంది. ఎన్నో వడపోతల తర్వాత మిగిలిన టాప్ పదహారు గాయనీ, గాయకుల్లో ఒకటిగా నిలిచింది.
వైష్ణవి (Sudha Vaishnavi Nannur) చిన్నతనం నుండీ సంగీతం పట్ల అంకితభావంతో ఉండేది. ఆమెలోని సంగీతం పట్లఉన్న ఆమె ఆసక్తిని గమనించిన వైష్ణవి తల్లిగారు, ఆమెను ప్రముఖ సంగీత విద్వాంసులైన శ్రీమతి పద్మ సుందర్, శ్రీ మదురై సుందర్ గార్ల వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించింది.
ఒక పక్క సంగీతాన్ని సాధనచేస్తూనే మరో పక్క అనేక ప్రాంతీయ తెలుగు కార్యక్రమాల్లో ఎన్నో లలితగీతాలు, సినిమాల్లోని పాటలు పాడడం వైష్ణవికి చిన్ననాటి నుండి పట్టుబడ్డ ఒక లక్షణం. తానా (TANA), ఆటా (ATA), నాటా (NATA) ల్లాంటి అనేక తెలుగు కార్యక్రమాల్లో నిర్వహించిన అనేక పోటీల్లో జాతీయ స్థాయిలో గెలుపొందింది.
నాటా (North American Telugu Association)వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నాటా ఐడల్ (NATA Idol) కార్యక్రమంలో రన్నరప్‌గా నిలిచి సినీప్రముఖులైన శ్రీ చంద్రబోస్ (Lyricist Oscar Chandrabose), శ్రీ కళ్యాణి మలిక్ (Kalyani Malik) లాంటి వారి ప్రశంసలు పొందడమే కాకుండా “గానవిశారద” అన్నబిరుదును కూడా పొందింది.
ఎన్నెన్నోసంగీత విభావరుల్లో తన ప్రఙ్ఞతో ప్రేక్షకుల హృదయాలను దోచుకొన్న వైష్ణవికి, ప్లేబ్యాక్ సింగర్ (Playback Singer) గా రాణించాలన్నది బలమైన కోరిక. అలాగే ప్రముఖ టీవీ ఛానల్స్ నిర్వహించే అనేక సంగీత కార్యక్రమాల్లో పాల్గొనాలన్నది చిరకాల ఆశయం. వైష్ణవి మన తెలుగమ్మాయి.
ఆ ప్రయత్నంలో విజయంసాధించి స్టార్ మా (Star Maa TV) వారు నిర్వహిస్తున్న సూపర్ సింగర్ (Super Singer) కార్యక్రమంలో ఎంపిక కాబడింది. మీ అందరి ఆదరాభిమానాలతో, ఆశీస్సులతో తను ఈ కార్యక్రమంలో విజయం సాధించాలనీ, ప్లేబ్యాక్ సింగర్ గా రాణించాలని కోరుకొందాం.