ప్రముఖ క్వాలిటీ మాట్రిక్స్ గ్రూప్ (Quality Matrix Group) అధినేతలు శశికాంత్ వల్లేపల్లి మరియు ప్రియాంక వల్లేపల్లి డిసెంబర్ 20న గుడివాడలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించి సేవానిరతిని చాటారు. తానా చైతన్య స్రవంతిలో భాగంగా నిర్వహించిన ఈ సేవాకార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది.
ఉచిత మెగా మెడికల్ క్యాంప్, నేత్ర వైద్య శిబిరం, కాన్సర్ నిర్ధారణ కేంద్రం, తానా చేయూత ప్రాజెక్ట్ ద్వారా 55 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, తానా ఆదరణ ప్రోగ్రాం ద్వారా 25 మంది మహిళల జీవనోపాధి కోరకు కుట్టు మిషన్ లు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు 15 సైకిళ్లు, వికలాంగులకు 4 వీల్ చైర్స్ అందించారు.
శశికాంత్ వల్లేపల్లి ఇలాఖాలో రాజయకీయ, వ్యాపార ప్రముఖుల నడుమ నిర్వహించిన ఈ సేవాకార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, గుడివాడ ప్రముఖులు రావి వెంకటేశ్వర రావు, రాము వెనిగండ్ల, వర్ల కుమార్ రాజ, గుడివాడ రోటరీ క్లబ్ ప్రతినిధులు మరియు పలువురు తానా నాయకులు పాల్గొన్నారు.
శశికాంత్ తండ్రి వల్లేపల్లి సీతా రామ్మోహన్ రావు పేరు మీద రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ (Rotary Club of Gudivada), రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్ గుడివాడ వారికి వైకుంఠ రథం అందజేశారు. పర్యావరణ సంరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రముఖులందరూ ప్రసంగించారు.
అమెరికా నుండి భారత దేశానికి వచ్చి మరీ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న శశికాంత్ వల్లేపల్లి (Sasi Kant Vallepalli) కుటుంబాన్ని, అలాగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ నాయకులను సభికులు అభినందించారు. ఎప్పటినుంచో గుడివాడపై మక్కువ చూపిస్తున్న శశికాంత్ వల్లేపల్లి సేవానిరతిని కొనియాడారు.
ఈ సందర్భంగా తానా (TANA) అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, సతీష్ వేమూరి, రాజా కసుకుర్తి, ఉమా ఆరమండ్ల కటికి, పురుషోత్తం గూడె, ఠాగూర్ మల్లినేని, సునీల్ పాంత్రా, శశాంక్ యార్లగడ్డ, జోగేశ్వర రావు పెద్దిబోయిన, శ్రీనివాస్ ఓరుగంటి, నాగ పంచుమర్తి, రఘు ఎద్దులపల్లి, సుబ్బారావు చెన్నూరి, ముద్దు కృష్ణమ నాయుడు లను వేదిక మీద ఘనంగా సత్కరించారు.