Connect with us

Festivals

వైభవోపేతంగా 1200 మందితో తామా దసరా బతుకమ్మ వేడుకలు & మహిళా సంబరాలు

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (Telugu Association of Metro Atlanta) ‘తామా’ వారు సెప్టెంబర్ 25న స్థానిక దేశానా మిడిల్ స్కూల్ లో అత్యంత వైభవోపేతంగా దసరా బతుకమ్మ వేడుకలు మరియు మహిళా సంబరాలు నిర్వహించారు. అట్లాంటాలోని తెలుగువారంతా ఈ ప్రాంగణంలో ఉన్నారా అన్న రీతిన 1200 మందికి పైగా ఈ వేడుకలలో పాల్గొనడం ముదావహం.

కార్యక్రమానికి మహిళామణులు, చిన్నారులు చక్కగా ముస్తాబయ్యి, పలు రకాల పూలతో ప్రకృతి సిద్ధంగా అందమైన బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను పూజించి, భక్తి శ్రద్ధలతో బతుకమ్మ (Bathukamma) వేడుకలలో పాల్గొన్నారు. ఎస్ ఎల్ ఆర్ మోర్ట్ గేజ్ మరియు పెర్సిస్ బిర్యానీ ఇండియన్ గ్రిల్ వారు ఈ కార్యక్రమాన్ని సమర్పించారు.

మొదటగా తామా సాంస్కృతిక కార్యదర్శి సునీత పొట్నూరు (Suneetha Potnuru) అందరినీ సాదరంగా కార్యక్రమానికి ఆహ్వానించి, దసరా శరన్నవరాత్రుల గురించి, బతుకమ్మ విశిష్టత గురించి విపులంగా వివరించారు. తామా అధ్యక్షులు రవి కల్లి (Ravi Kalli) ఆహుతులందరికీ శుభాకాంక్షలు తెలిపి, తామా వారు చేసే విభిన్న కార్యక్రమాలను వివరించారు.

బోర్డు ఛైర్మన్ శ్రీరామ్ రొయ్యల (Sreeram Royyala) తామా చేసే పలు సాంఘిక కార్యక్రమాలు, తామా ఫ్రీ క్లినిక్ (TAMA Free Clinic) మున్నగు వాటి గురించి విశదీకరించారు. ఈ వేడుకలను ప్రముఖ యాంకర్ సాహిత్య వింజమూరి (Sahitya Vinjamuri) ఆద్యంతం ఆహ్లాదకరంగా నిర్వహించారు.

దసరా సందర్భంగా అట్లాంటా (Atlanta) స్థానిక కళాకారులు నృత్యాలు, సంగీతం, ఆట పాటలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా తామా వారు బతుకమ్మ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. తామా వారు స్పాన్సర్స్ ని ఘనంగా సన్మానించారు.

తామా మహిళా కార్యదర్శి శ్రీవల్లి శ్రీధర్ (Srivalli Sridhar) ఆధ్వర్యంలో జరిగిన తామా మాస్టర్ చెఫ్, తామా మహారాణి వంటి వినూత్న కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ (National Human Rights Commission) మెంబర్ సుమలత గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, మహిళా సాధికారత ఆవశ్యకతను చాటి చెప్పారు. ఆమెను మరియు ప్రముఖ మహిళలను తామా మహిళా టీం సత్కరించారు.

అందరూ షాపింగ్ మాల్స్ చుట్టూ కలియ తిరగడం, చిన్న పిల్లల కేరింతలు, పెద్దవారి పలకరింపులు చూసి, మనం తెలుగు నేల మీద ఉన్నామా లేక అమెరికా గడ్డ మీద ఉన్నామా అన్న సందేహం రావడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బతుకమ్మ ఆటా పాటా లో ఆడపడుచులందరూ ఎంతో హుషారుగా పాల్గొని, భక్తి శ్రద్ధలతో నిమజ్జనం గావించి, ప్రసాదాలు పంచారు.

అనూష మరియు రాజ్ ఆధ్వర్యంలోని ఏఆర్ డాజల్ ఈవెంట్స్ వారు చేసిన స్టేజ్ అండ్ ఫోటో బూత్ డెకొరేషన్ మరియు ఆడియో సేవలు అమోఘం. అలాగే శ్రీ ఫొటోస్ నుంచి సురేష్ ఓలం చక్కని ఫోటోగ్రఫీ సేవలు అందించారు. అందరూ తామా వారి విందు బాగుంది అంటూ అభినందించారు.

శ్రీవల్లి శ్రీధర్ మరియు సునీత పొట్నూరు స్పాన్సర్స్ కు, వాలంటీర్లకు, తామా టీంకు, ప్రేక్షకులకు కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. విచ్చేసిన అందరూ తామా వారు షడ్రసోపేతంగా అందించిన భోజనాన్ని ఆస్వాదించి, ఏర్పాట్లను ప్రశంసించి సెలవు తీసుకున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected