Denmark, Copenhagen: డెన్మార్క్ తెలుగు అసోషియేషన్ (DTA) గత ఆదివారం డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగెన్ (Copenhagen) లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు సమాజం పెద్ద ఎత్తున పాల్గొని, సంప్రదాయ వేడుకలను ఆనందంగా జరుపుకుంది.
ఉదయం 8:00 గంటలకు శ్రీ లక్ష్మణ హనుమాన సమేత సీతారాముల అభిషేకంతో ప్రారంభమైన ఈ వేడుక, కళ్యాణం, పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ వంటి కార్యక్రమాలతో సాయంత్రం 8:00 గంటల వరకు వేద మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగింది.
ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పట్టాభి రామ్ (Pattabhi Ram) మరియు డెన్మార్క్ (Denmark) లోని భారత రాయబారి (Indian Ambassador) తో సహా దాదాపు 1200 మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి తరించారు.
ఈ విజయవంతమైన కార్యక్రమం తర్వాత, డెన్మార్క్ తెలుగు అసోషియేషన్ (DTA) వారు, మన-సంస్కృతి (Mana Samskriti) అనే మరో హిందు ధార్మిక సంస్థ తొ కలిసి వచ్చే మూడు వారాంతాలలో డెన్మార్క్ (Denmark) మరియు స్వీడన్ (Sweden) లోని పలు నగరాల్లో శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలను, హనుమాన్ జయంతోత్సవాలాను నిర్వహించాలని సంకల్పించి, ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమాల ద్వారా భారతదేశ సంప్రదాయాలను, ప్రత్యేకించి తెలుగు సంస్కృతిని మరింత విస్తృతంగా ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. డెన్మార్క్ (Denmark) లో నివసిస్తున్న తెలుగు వారు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా DTA గత 15 సంవత్సరాలుగా అనేక పండుగలు మరియు ఉత్సవాలను నిర్వహిస్తోంది.
సంక్రాంతి, ఉగాది, దసరా వంటి పండుగలతో పాటు, వినాయక చవితి, సీతారాముల కళ్యాణోత్సవం వంటి ముఖ్యమైన ఉత్సవాలను ప్రతి ఏటా ఘనంగా జరుపుతూ, తెలుగు సంప్రదాయాలకు జీవం పోస్తున్నారు. ప్రతీ కార్యక్రమంలో స్థానిక సమాజ సభ్యులు ఐకమత్యంతో కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.
“మన తెలుగు సంస్కృతిని విదేశాల్లో ఇలా జరుపుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తుంది. ఇది తర్వాతి తరానికి మన సంస్కృతి గొప్పతనాన్ని అందజేసే అవకాశాన్ని ఇస్తుంది,” అని అసోషియేషన్ వ్యవస్థాపకుడు అమరనాథ్ పొట్లూరి (Amarnath Potluri) అన్నారు. “సొంత ఊరికి దూరంగా ఉన్నప్పటికీ, తెలుగు వారు ఐకమత్యంతో సంప్రదాయాన్ని కొనసాగించడం చాలా సంతోషాన్ని ఇస్తుంది,” అని అసోషియేషన్ అధ్యక్షుడు రవి గంగం మరియు కార్యనిర్వాహక సభ్యులు తెలిపారు.
డెన్మార్క్ తెలుగు అసోషియేషన్ (Denmark Telugu Association) తెలుగు వారి ఐక్యతకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా కొత్త తరం తెలుగు పిల్లలకు కూడా మన సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతోంది. వారు చేస్తున్న కృషి సర్వదా ప్రసంశనీయం.