Connect with us

Devotional

కడు కమణీయంగా శ్రీ సీతారాముల కల్యాణం, $1116 కి లడ్డు వేలం @ Los Angeles, California

Published

on

Los Angeles, California: లాస్ ఆంజెల్స్ పరిసర ప్రాంతాలలో ఉన్న, రెండు రాష్ట్రాల తెలుగు కుటుంబాలు కలిసి చేసుకున్న సామూహిక శ్రీ సీతారాముల వారి కళ్యాణం గత శనివారం (Apr-20-2024) నాడు ఆద్యంతం కడు కమణీయంగా జరిగింది.

గత 8 సంవత్సరాలుగ, ఏ సంస్థ కి సంబందం లేకుండా అందరు కలిసి శ్రీ సీతారాముల వారి కళ్యాణం చేసుకుంటున్నారు. గత శనివారం Indian Community Center లో జరిగిన ఈ ఉత్సవం భద్రాచల శ్రీ సీతారాముల వారి కళ్యాణం ని తలపించింది. ఉదయం 8 గంటలకు, కల్యాణం పనులు, తలంబ్రాలు కలపడం, పసుపు దంచడం, ఊరేగింపు, కోలాటం, రాముల వారి నృత్యాలతో ప్రారంభమైన శ్రీ సీతారాముల వారి కల్యాణం, మధ్యాహ్నం పెళ్ళి భోజనంతో మొదటి ఘట్టం ముగిసింది.

భద్రాచలంలో ప్రత్యేక పూజలు చేయించుకొని అమెరికా చేరుకున్న ఉత్సవ మూర్తులను, మేళ తాళాల సాక్షిగా ఆడపడచుల కోలాటంతో సాగిన ఊరేగింపు అందరి మనసులని ఆకట్టుకొంది. దాదాపు 50 మంది తెలుగు ఆడపడచులు చేసిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సారి జరిగిన కళ్యాణ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా, అమెరికాలో పుట్టి పెరిగిన 30 మంది టేనేజ్ పిల్లలు చేసిన రాముల వారి నృత్యాలు, 20 మంది చిన్నారుల కోలాటం మరియు 20 మంది చిన్నారుల మాలధారణ నృత్యం అందరిని ఎంతో అలరించాయి.

భారతదేశపు మూలాలు ఉన్న మనలో అతి కొద్ది మందికే పరిచయమున్నయోగ్‌చాప్ అనబడే సంగీత వాయిద్యాన్ని ఇక్కడి పిల్లలు నేర్చుకొని రాములవారి నృత్యంలో వినియోగించడం అందరినీ అబ్బురపరిచింది. ఎంతో ఉన్నతమైన మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించాలనే నిర్వాహకుల ఆలోచనకు అనుగుణంగా అమెరికాలో పుట్టి పెరిగిన చిన్నారులు చేసిన ఈ నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అద్భుతమైన నృత్య ప్రదర్శనతో పాటు వివిధ విభాగాల్లో తమ వంతు ఉడుతా భక్తి సహాయాన్ని రాముల వారి కళ్యాణానికి అందించడం చూసి పలువురు అభినందించారు.

తమ తమ దైనందిక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికిని దాదాపు 100 మందికి పైగా వాలంటీర్స్ గత రెండు నెలలుగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించడంలో చేసిన కృషిని చూసి అందరూ ప్రశంసించారు. అందంగా అలంకరించుకున్న రాముల వారిని, లక్ష్మణుల వారిని, హనుమానుల వారిని, పట్టాభిషేక పాదుకలని మగవారు వేడుకతో పెళ్ళి మండపానికి ఊరేగింపుగా తీసుకొని రాగా ఆడపడచులు ముందుండి చేసిన కోలాటంతో ఊరేగింపు రమణీయంగా సాగింది. గోవింద నామాలు, రామ నామాలతో ప్రాంగణమంతా మార్మోగి పోయింది.

ఊరేగింపులో పాల్గొన్న వారందరు తిరుమల వీధులలో జరిగిన ఊరేగింపులో పాల్గొన్న భక్తి భావనలో మునిగి పోయారు. ఈసారి తాజా కొబ్బరి ఆకులతో, మామిడి తోరణాలు, బంతి, చామంతి, మల్లెపూలతో పాటు పసుపు, కుంకుమ పట్టించిన స్తంభాలతో అలంకరించిన పెళ్లి పందిరి అందర్నీ అమితంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరు సాంప్రదాయ వస్త్రధారణ, నుదుటన తిలకం, ఏకరూప కండువాలతో కార్యక్రమంలో పాల్గొని కల్యాణానికి మరింత శోభను జత చేసారు. శ్రీ సీతా రాముల వారి కల్యాణం ఆద్యంతం కమణీయంగా జరిగింది. 1000 మందికి పైగా భక్తులు కల్యాణాన్ని వీక్షించి పరవశించి పోయారు.

100కి పైగా జంటలు సామూహిక కల్యాణంలో భాగస్వాములయ్యారు. గణపతి పూజతో కార్యక్రమం ఆరంభమయింది. వర పూజ లో రాముల వారు ధగ ధగా మెరిసి పోయారు. ముహుర్త సమయానికి మేన మామల చేతుల మీదుగ సీతమ్మ వారు మండపానికి వొచ్చారు. సుముహుర్త సమయాన, రాముల వారికి సీతమ్మ వారికి జీలకర్ర బెల్లం పెట్టారు. లోక కల్యాణార్థం, ఆ ఆదర్శ దంపతులు మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు.

రాముల వారికి సీతమ్మ వారికి భక్తులందరు కలిసి పట్టు వస్త్రాలు, బంగారు తాళి బొట్టు, మట్టెలు, నల్ల పూసలు, ఆభరణాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించుకొని తమ భక్తిని చాటుకొన్నారు. భక్తుల ఆనందోత్సవల మద్య, శ్రీ సీతా రాముల వారి కల్యాణం అంగ రంగ వైభవంగా జరిగింది. కల్యాణం జరిగినంత సేపు, శ్రీమతి విజయ కూనపులి గారి సంగీత విద్యార్థులు ఆలపించిన రాముల వారి కీర్తనలు అందరిని అలరింప చేసాయి. ఈ కార్యక్రమం పలువురికి భద్రాచలంలో జరిగే సీతా రాముల వారి కల్యాణాన్ని తలపించాయి.

దాదాపు 3 గంటలకు పైగా జరిగిన ఈ కల్యాణాన్ని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కలిసి ఆనందంగా జరుపుకున్నారు. ఎంతో అద్భుతంగా జరిగిన ఈ కల్యాణం విందు భోజనంతో మొదటి ఘట్టం ముగిసింది. భోజనానంతరం జరిగిన వేడుకలలో సీతమ్మవారికి 11 రకాల స్వీట్లు, 11 రుచికరమైన పిండివంటలతో అమ్మవారికి వోడి బియ్యం సమర్పించుకుని తమ భక్తిని చాటుకున్నారు. అలాగే నూతన దంపతుల తరపున బంతులాట, ఉంగరం వెతికే వివాహనంతర వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సీతమ్మవారిని మంగళ వాయిద్యాలతో రాముల వారికి అప్పగింతల కార్యక్రమంతో కళ్యాణం ముగిసింది. స్వామివారికి సమర్పించిన 3.8 పౌండ్ల లడ్డును వేలం వేయగా భక్తులు ఆనందోత్సవాల మధ్య 1,116 డాలర్లకు కైవసం చేసుకున్నారు. ఈ సామూహిక సీతారామ కళ్యాణం ఏ సంస్థతో సంబంధం లేకుండా, రెండు తెలుగు రాష్ట్రాల నుండి వొచ్చి ఇక్కడ నివసిస్తున్న తెలుగు కుటుంబాల వారు కలిసి చేసుకోవడం ఎంతో అభినందనీయం.

నిర్వాహకులు రాం కొడితాల (Ram Koditala), చందు నంగినేని (Chandu Nangineni), కుమార్ తాలింకి, మనోహర్ ఎడ్మా మాట్లాడుతూ… చిన్నప్పుడు రాముల వారి పందిరిలో (Ram Mandir) ఆడుకున్న అనుభవాలు, సహపంక్తి భోజనాలు, ఆ పండగ వాతావరణం మళ్ళీ జ్ఞప్తికి తెచ్చేలా, మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు ముందు తరాల వారికి నేర్పించేలా గత 8 సంవత్సారాలుగా ఈ కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క వాలంటీర్‌కి (Volunteers), దాతలకి, విచ్చేసిన భక్తులందరికి ధన్యవాదాలు తెలుపుతూ మహ నైవేద్యంలో సహకరించిన వారికి, అద్భుతంగా మాలలు చేసిన వారికి, అందంగా పందిరిని అలంకరించిన వారికి, భోజనాదులలో సహకరించిన వారికి, సకాలంలో పూజాసామగ్రి సమకూర్చిన వారికి, కల్యాణం ఆద్యంతం రామ కీర్తనలతో అలరించిన చిన్నారులకి, కోలాటంతో అలరించిన ఆడపడచులకి, అద్భుతమైన నృత్య ప్రదర్శనతో అలరించిన పిల్లలందరికీ, ఆడియో, వీడియో, మీడియా, రిజిస్ట్రేషన్‌లతో పాటు సహకరించిన ప్రతి ఒక్క వాలంటీర్‌కి నిర్వాహకులు (Organizers) ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వీరు చేసిన ఈ ప్రయత్నాన్ని అందరు ముక్తకంఠంతో అభినందించారు. సీతారాముల వారి కల్యాణం ప్రతీ సంవత్సరం చేయడంలో తమ అండదండలు తప్పక ఉంటాయని వొచ్చిన ప్రతీ ఒక్కరు హామీనిచ్చారు. శాస్త్రోక్తంగా ఘనంగా పూజ నిర్వహించిన శ్రీ మార్తాండ శర్మ గారి దంపతులని, శ్రీ వేణు తమిరిస గారిని, శ్రీ వేణు బృందావణం గారి దంపతులని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected