Connect with us

Festivals

Singapore: ఆకట్టుకునేలా శ్రీ సాంస్కృతిక కళాసారథి వారి కార్తీకమాస స్వరారాధన

Published

on

Singapore: సింగపూర్ నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన సాంస్కృతిక సంస్థ “శ్రీ సాంస్కృతిక కళాసారథి”, ఈ పవిత్ర కార్తీకమాస సందర్భంగా అంతర్జాల మాధ్యమంలో శనివారం “కార్తీకమాస స్వరారాధన” అనే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.‌

ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత అయిన డా. అద్దంకి శ్రీనివాస్ (Dr. Addanki Srinivas) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్తీకమాస వైశిష్ట్యం గురించిన వివిధ అంశాలను ఒక చక్కటి ప్రవచనంగా అందించారు. పోలాండ్ దేశస్తుడైన యువ గాయకుడు (Zach) బుజ్జి పాత తెలుగు సినిమాలలోని ఘంటసాల పాడిన శివ భక్తిగీతాలను, శివతాండవ స్తోత్రాన్ని పాడి వినిపించడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది.

సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ (Kavuturu Ratna Kumar) మాట్లాడుతూ “డా. అద్దంకి శ్రీనివాస్ తమ సంస్థ కార్యక్రమంలో తొలిసారి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే సింగపూర్ గాయని గాయకులతో పాటుగా మాతృభాష తెలుగు కాని ఒక విదేశీయుడైన బాలుడు చక్కగా తెలుగు భక్తి పాటలు నేర్చుకొని పాడడం చాలా అభినందనీయమని” తెలియజేశారు.

డా. అద్దంకి శ్రీనివాస్ (Dr. Addanki Srinivas) తమ ప్రసంగంలో మాట్లాడుతూ కార్తీకమాసంలో వచ్చే వివిధ పర్వదినాల గురించి ఆయా రోజులలో ఆచరించే పూజలు, వాటి వెనుక ఉన్న కథలు, ప్రత్యేకతలు, కారణాల గురించి సోదాహరణంగా విశ్లేషిస్తూ వివరిస్తూ, అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా, అన్ని వయసుల వారికి అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో తెలియజేశారు.

సంస్థ ప్రధాననిర్వహకవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి (Radhika Mangipudi) సభా సమన్వయం చేయగా,  సుబ్బు వి పాలకుర్తి సహ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సభలో, సింగపూర్ గాయనీగాయకులు విద్యాధరి కాపవరపు, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, శేషుకుమారి యడవల్లి, షర్మిల చిత్రాడ, స్నిగ్ధ ఆకుండి, శ్రీవాణి, చంద్రహాస్ ఆనంద్, హరి మానస శివ భక్తిగీతాలను ఆలపించారు.

వానిలో త్యాగరాజ కృతులు వంటి సంప్రదాయ సంగీతం, శివపదం గీతాలు, చలనచిత్ర గీతాలు, లలిత గీతాలు కూడా ఉండడం విశేషం. కల్చరల్ టీవీ (Cultural TV) సాంకేతిక సహకారంతో ప్రపంచవ్యాప్తంగా ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమం ఎప్పటివలే అన్నిదేశాల తెలుగు ప్రజల మన్ననలు అందుకుంది.

error: NRI2NRI.COM copyright content is protected