Scarborough, Canada: కెనడా లోని స్కార్బరో సిటీ కేంద్రం గా, North America Telugu & Indian Communities Association (NATICA) వారు ఈ ఆదివారం-మార్చ్ 29వ తేదీన ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, భక్తి, సంస్కృతి, సంప్రదాయం అన్నీ సమన్వితమైన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
భారతదేశానికి సుదూరమైన కెనడా నేలపై కూడా మన భారతీయ సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలు, ఆచారాలు ఎంత గొప్పవో ఈ వేడుక మరొక్కసారి మనకు తెలియజేసింది. దేవాలయ వాతావరణంలా మారిన ఈ ప్రాంగణంలో ప్రతి మంత్రోచ్చారణ, ప్రతి పూజా విధానం ప్రతి ఒక్కరి మనసులను పవిత్రం చేసింది.
ఈ దివ్య కళ్యాణంలో శ్రీరామచంద్ర వారి కుటుంబంగా శ్రీ రాజేంద్ర-అనూష రాపోలు (Rajendra Rapolu) గారి కుటుంబం, అలాగే సీతా దేవి కుటుంబంగా శ్రీ అరవింద్-కవిత అంకం గారి కుటుంబం ఎంతో భక్తితో, అంకితభావంతో పాల్గొని ఈ మహోత్సవానికి ప్రాణం పోశారు.
ఈ వేడుకలో మరొక ప్రత్యేకమైన క్షణం—అందంగా అలంకరించబడిన సీతారాముల విగ్రహాల కళ్యాణ వేదికలోకి ప్రవేశం. పుష్పాలతో, దీపాలతో శోభాయమానమైన వేదికపై, భక్తి నిండిన నాదస్వర మేళం మధ్య సీతారాములు ప్రవేశించిన ఆ దృశ్యం అందరి మనసులను హరిచేసింది. ఆ నాదస్వర ధ్వనులు, ఆ అలంకరణల వైభవం కలిసిపడి, నిజంగా భద్రాచలం (Bhadrachalam, Telangana) వాతావరణాన్ని మన ముందుకు తెచ్చినట్లుగా అనిపించింది.
ఈ కల్యాణ కార్యక్రమాన్ని, పురోహితులు శ్రీ తట్ట శ్రీనివాస చక్రవర్తి గారి మంత్త్రోచ్చరణ, పుణ్యాహవాచనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, మన హృదయాల్లోని కలుషితాలను తొలగించి, పవిత్రతను నింపింది. విశ్వక్సేన పూజతో అన్ని అడ్డంకులు తొలగిపోయి, ఈ దివ్య యజ్ఞం సాఫల్యంగా సాగేందుకు మార్గం సుగమమైంది.
ఈ సందర్భంగా రక్షాబంధనం, వరప్రసాదం మరియు సంకల్పం ఎంతో ఆధ్యాత్మికంగా నిర్వహించబడ్డాయి. కంకణధారణ ద్వారా దైవ రక్షణను కోరుతూ, ఈ మహోత్సవం విజయవంతంగా జరగాలని మనసారా ప్రార్థించాము. సంకల్పంలో ఈ కళ్యాణం నిర్వహణ వెనుక ఉన్న పవిత్ర ఉద్దేశాన్ని వ్యక్తపరచి, అందరికీ శుభఫలితాలు కలగాలని కోరుకున్నారు.
కాశీ యాత్రలో శ్రీరాముడి విరక్తి భావం, గృహస్థాశ్రమ స్వీకారం—మన జీవితంలో బాధ్యతల ప్రాముఖ్యతను గుర్తు చేసింది. వరపూజలో వరుడైన రాముడిని గౌరవించడం, కన్యాదానంలో సీతాదేవిని సమర్పించడం—ఈ రెండు క్షణాలు ఎంతో ఆధ్యాత్మికంగా, హృదయాన్ని కదిలించేవిగా నిలిచాయి.
జీలకర్ర-బెల్లం వేడుకలో ఇద్దరూ ఒకటిగా కలిసిన ఆ క్షణం, జీవితం అనే ప్రయాణంలో తీపి-చేడులు కలిసి అనుభవించాలనే సందేశాన్ని అందించింది. మంగళసూత్ర ధారణ సమయంలో గాలిలో మార్మోగిన మంగళవాద్యాలు, మన హృదయాల్లో ఆనందాన్ని నింపాయి.
తాళంబ్రాల సమయంలో పసుపు అక్షింతలు వర్షంలా కురుస్తుండగా, ఆ దృశ్యం ఒక ఆనందపర్వంగా మారింది. ప్రతి అక్షింతలో ఒక ఆశీర్వాదం, ప్రతి చిరునవ్వులో ఒక సంతోషం కనిపించింది. సప్తపదిలో వేసిన ప్రతి అడుగు ఒక వాగ్దానం—ధర్మం, ఆర్థం, కామం, మోక్షం అనే జీవన సూత్రాలను గుర్తు చేసింది. అర్ధాసనంలో సీతారాములు పక్కపక్కన కూర్చుని, సమానత్వం, సహజీవనం యొక్క అందాన్ని మనకు చూపించారు.
ఈ మహోత్సవానికి మరింత వైభవం చేకూర్చింది భక్తుల సమాగమం. Scarborogh, Eglinton, Oshawa, Mississauga, Milton, Oakville, Fergus వంటి పలు ప్రాంతాల నుండి దాదాపు 200 మంది భక్తులు హాజరై, ఈ దివ్య కళ్యాణాన్ని దర్శించి, సీతారాముల ఆశీస్సులు పొందారు. వారి భక్తి, వారి ఆనందం ఈ కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చింది.
చివరగా ఆశీర్వచనాలు, మంగళహారతితో ఈ మహోత్సవం ఒక దివ్య ముగింపుకు చేరింది. ఆ క్షణంలో ప్రతి ఒక్కరి ముఖంలో తృప్తి, ఆనందం, భక్తి – కలగలిసిన ఒక పవిత్ర భావం కనిపించింది. ఇది కేవలం ఒక వేడుక కాదు—మన సంస్కృతి, మన సంప్రదాయం, మన విలువల ప్రతిబింబం. ఇలాంటి కార్యక్రమాలు మన పిల్లలకు, మన తరాలకు ఒక మార్గదర్శకం.
ఈ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించిన రాజేంద్ర రాపోలు (Rajendra Rapolu) గారి కుటుంబం, అరవింద్ అంకం గారి కుటుంబం మరియు NATICA నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు. శ్రీ సీతా రామచంద్ర స్వామి దివ్య దంపతుల కృపకు పాత్రులమై, మన జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, ఆనందం నిండాలని కోరుకున్నారు.
ఈ అందమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన NATICA (నాటిక) అసోసియేషన్ ప్రెసిడెంట్ రాపోలు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Rapolu) గారు, అసోసియేషన్ పాలక మండలి సభ్యులు – అరవింద్ అంకం, వెంకట కృష్ణ కర్లపాలెం, విజయ్ గోడబ, రాజు జైన్, రవి బొజ్జ, సుభాష్, సమీర్, శ్రీకాంత్, శివ, శ్రీరామ్, విశాల్ తదితరులు స్వామివారిని కోరుకుంటూ, కళ్యాణం చూడడానికి వచ్చిన వారందరికీ ధన్యవాదములు తెలిపారు.