New Jersey: ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీ నిహల్ తమ్మన (Sri Nihal Tammana) కు మరో అరుదైన గౌరవం లభించింది. బ్యాటరీ రీసైక్లింగ్‌తో పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న తెలుగు విద్యార్ధి శ్రీనిహాల్ తమ్మన విజయ ప్రస్థానాన్ని జర్మనీ (Germany) పాఠ్యాంశాల్లో భాగంగా చేశారు. విద్యార్ధుల్లో పర్యావరణంపై స్ఫూర్తి నింపేందుకు జర్మనీ ప్రభుత్వం శ్రీనిహాల్ పర్యావరణం కోసం చేస్తున్న కృషిని పాఠ్యాంశంగా మార్చి విద్యార్ధులకు బోధిస్తుంది.
ఇంతటి అరుదైన ఘనత సాధించిన శ్రీనిహాల్ మన తెలుగు వాడు కావటం నిజంగా యావత్ తెలుగుజాతి అంతా గర్వించదగ్గ విషయం. ఇప్పటికే శ్రీ నిహాల్ తాను స్థాపించిన రీ సైక్లింగ్ మై బ్యాటరీ (Recycle My Battery) కు అరుదైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ (Guinness World Record) సాధించాడు. రీసైకిల్ మై బ్యాటరీ సంస్థ ద్వారా నిహాల్, అతని బృందం సభ్యులు ఏకథాటిగా ఒక్కరోజులోనే 31,204 బ్యాటరీలను లైనింగ్ చేసి రికార్డ్ సృష్టించారు.
చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై నిహాల్ దృష్టి: 10 ఏళ్ల వయస్సులోనే నిహాల్ పర్యావరణ మేలు కోసం ఆలోచించాడు. కాలం చెల్లిన బ్యాటరీలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుంది అనే దాని గురించి చదివిన శ్రీ నిహాల్ పర్యావరణ మేలు కోసం నడుంబిగించాడు. మనం ఇళ్లలో వాడే బ్యాటరీలను చెత్తలో పడేయటం వల్ల అవి పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగించడతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని అందరికీ అవగాహన కల్పిస్తున్నాడు, వివరిస్తున్నాడు. ఈ సమస్యను పరిష్కారించడానికి శ్రీ నిహాల్ బ్యాటరీ రీ-సైక్లింగ్ (Battery Re-Cycling) కోసం తన వంతు కృషి ప్రారంభించాడు. బ్యాటరీల వల్ల వచ్చే అనర్థాలను, ప్రమాదాలపై అవగాహన కల్పించి.. పనికిరాని బ్యాటరీలను కాలం చెల్లిన బ్యాటరీలను సేకరించి వాటిని తిరిగి రీసైక్లింగ్ సెంటర్స్ కు పంపిస్తున్నాడు.
రీసైకిల్ మై బ్యాటరీ ప్రస్థానం ఇది: 2019 లో రీసైకిల్ మై బ్యాటరీ(ఆర్.ఎం.బి) పేరుతో శ్రీనిహాల్ తొలుత తన స్నేహితులతో ఓ టీం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వెబ్ సైట్ ఏర్పాటు చేసి రీసైకిల్ మై బ్యాటరీ (Recycle My Battery) అనే దానిని ప్రచారం చేశాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 900 మంది విద్యార్థి వాలంటీర్లు శ్రీనిహాల్ తో కలిసి పనిచేస్తున్నారు. దాదాపు ఆరు లక్షలకు పైగా బ్యాటరీలు ఇప్పటివరకు శ్రీ నిహాల్ తన టీమ్ సాయంతో రీ సైకిలింగ్ చేశారు. దాదాపు నాలుగు కోట్ల మందికి బ్యాటరీల రీసైక్లింగ్‌పై అవగాహన కల్పించారు. పాఠశాలల్లో ఆర్.ఎం.బీ బ్యాటరీ డబ్బాలను ఏర్పాటు చేశారు. కాల్ టూ రీసైకిల్ (Call2Recycle) వంటి సంస్థల భాగస్వామ్యంతో అడుగు వేసింది.
బ్యాటరీలను సేకరించడం, వాటిని రీసైక్లింగ్ స్టేషన్‌లకు బదిలీ చేయడాన్ని సులభతరం చేసింది. ఇప్పటికే శ్రీ నిహాల్‌కు ఎన్నో పర్యావరణ పురస్కారాలు లభించాయి. అమెరికన్ టెలివిజన్ ఛానల్ CNN రియల్ హీరో పేరుతో సత్కరించింది. యంగ్ హీరోలకు ఇచ్చే బారన్ ప్రైజ్ (Gloria Barron Prize) కూడా శ్రీనిహాల్ సొంతమైంది. ఈ రోజు వరకూ తొమ్మిది వందల మంది విద్యార్థులు శ్రీ నిహాల్ తో చేతులు కలిపి ఈ ప్రస్థానంలో ముందుకు సాగుతున్నారు. 600,000 పైగా బ్యాటరీలను ఇప్పటివరకూ రీసైకిల్ చేసి 39 మిలియన్లకు పైగా ప్రజలను చైతన్యవంతులను చేశారు.
ఇంకా, శ్రీనిహాల్ ఇటీవలే స్కూల్ బ్యాటరీ ఛాలెంజ్‌ను ప్రారంభించాడు. ఇందులో ప్రతి పాఠశాలలోని తరగతులు ఒకదానితో ఒకటి పోటీపడి, ఎవరు ఎక్కువ బ్యాటరీలను రీసైకిల్ చేస్తారో ఆ తరగతి పిజ్జా పార్టీని గెలుచుకుంటుంది. ఇప్పటి వరకు ఛాలెంజ్ ద్వారా రెండు నెలల్లో, వారు మూడు పాఠశాలల నుండి 30,000 బ్యాటరీలను రీసైకిల్ చేశారు. నిహాల్ ఈ ఛాలెంజ్‌ని 30 పాఠశాలలకు విస్తరించాడు. 300,000 బ్యాటరీలను రీసైకిల్ చేయాలనే లక్ష్యంతో మొత్తం రీసైకిల్ చేయబడిన బ్యాటరీలను వన్ మిలియన్ అంటే పది లక్షలకు పెంచాడు.