Connect with us

Literary

Dallas, Texas: ఘనంగా జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా పోటీ విజేతల సన్మాన సభ, ఉత్తమ నవలగా కిలారి ఎంపిక

Published

on

Dallas, Texas: “Sirikona Sahithi Academy”- జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక 2024 నవలా రచనల పోటీలలో ఎంపికైన నవలా విజేతల సన్మాన సభా కార్యక్రమం, అక్టోబరు 26 వ తేదీ ఆదివారం అంతర్జాలంలో జరిగింది. అనేకమంది సాహితీ వేత్తలతో  పాటు, పురస్కార ప్రదాతలు అయిన  శ్రీయుతులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం (Subramanyam Jonnalagadda), వారి శ్రీమతి  శారద  కూడా ఈ కార్యక్రమానికి  హాజరై ముందుండి నడిపించారు. తొలుత “అక్షర పరబ్రహ్మ యోగి” స్వర్గీయ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ వారిని గుర్తు చేసుకొంటూ, వారితో తమకు సాహిత్య పరంగాను, వ్యక్తిత్వ పరంగాను  ఏర్పడిన అనుబంధం ”సిరికోన సాహితీ అకాడమీ” స్థాపనలో ఆచార్యులవారు చూపిన చొరవ వారి ధైర్యం ఇంకా వారి ఆశయాల  గురించి, ‘అక్షర పరబ్రహ్మ యోగి’ అని ఆచార్య గంగిశెట్టి వారిని ఉద్దేశించడంలోని పరమార్థం మరియు సంబంధించిన విషయాలను సభకు తెలుపుతూ సిరికోనీయులు, శ్రీయుతులు పాలడుగు శ్రీచరణ్ చక్రవర్తి,  జె ఎస్ ఆర్ మూర్తి, అత్తలూరి విజయలక్ష్మి, నిర్మల ఘంటసాల, అరవింద పారనంది ఆత్మీయంగా స్పందించారు.

జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం (Subramanyam Jonnalagadda) సదస్సుకు హాజరైన సాహితీ ప్రియులకు స్వాగత వచనాలు పలికారు. స్వర్గీయ  ఆచార్య గంగిశెట్టి వారిని గుర్తు చేసుకొంటూ, 2021 వ సంవత్సరంలో ప్రారంభించి వరుసగా 2022, 2023 సంవత్సరాలతో పాటు 2024 సంవత్సరములో కూడా ఈ పోటీలు నిర్వహించడం తన కెంతో సంతృప్తి నిచ్చిందన్నారు. 2024 వ సంవత్సరానికి కథావస్తువును సూచించకుండా, రచయితలు తమకు నచ్చిన ఇతివృత్తం మీద తాజాగా రచించిన నవలలు (Novels) పోటీకి సమర్పించవచ్చు అని ప్రకటించగా, అనూహ్యమైన స్పందన లభించిందనీ. ఎక్కువమంది ప్రేమను కేంద్ర వస్తువుగా తీసుకుని  రాసినా, గణనీయ సంఖ్యలో ఆధునిక జీవన వైవిధ్యాన్ని చిత్రించే నవలలు రచించి పోటీకి సమర్పించారని తెలిపారు.. ప్రాథమిక వడబోత పిమ్మట 26 నవలలు పోటీకి నిలిచాయని, a. కథావస్తువు, b. ఇతివృత్త నిర్మాణం- వాస్తవికత/ తార్కికతలు, c. శైలి- శిల్పం, d. సామాజిక ప్రయోజనం అంశాల ఆధారంగా గుణ పరిశీలన జరిగిందనీ తెలిపారు.

అసాధారణ నిర్మాణ చతురతతో, అద్భుత మాండలిక భాషా కథనంతో, సమగ్ర గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరిస్తూ  డా.బి.నాగశేషు రచించిన ”కిలారి” ఉత్తమ నవలగా ఎంపిక  చేయబడిందని, మూడు తరాల నారీ చేతన కు అద్దం పడుతూ శ్రీమతి  రెంటాల కల్పన రచించిన నవల ”కావేరికి అటూ ఇటూ” మరియు నల్లమల అడవుల్లోని చెంచుల జీవితాన్ని అత్యంత సన్నిహితంగా పరిచయం చేస్తూ శ్రీ రంజిత్ గన్నోజు రచించిన నవల”. లింగాల కంఠంలో” ప్రత్యేక బహుమతులకు ఎంపిక కాబడ్డాయనీ పై మూడు నవలలు సిరికోనకు  గర్వకారణంగా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. రచయితలు  ముగ్గురికీ, సిరికోనీయులందరి పక్షాన మనఃపూర్వక అభినందనలు తెలుపుతూ, వారి కృషి తెలుగు సాహిత్య రంగంలో మరింత సమున్నత  గౌరవ, ప్రతిష్టలను సముపార్జించు కొంటుందని మనసారా విశ్వసిస్తూ, శుభాకాంక్షలు అందించారు.

ముఖ్య అతిథి ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ  తనకు శిష్యులని అన్నారు. వారి ఆశయ  సాధనకు కొనసాగింపుగా  జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం (Subramanyam Jonnalagadda) మరియు శ్రీమతి శారదలు  సిరికొన సాహిత్య అకాడమీ నవలా రచనా పోటీలు నిర్వహించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈరోజు ముగ్గురు రచయితలు డాక్టర్ బీ.నాగశేషు, శ్రీమతి రెంటాల కల్పన,శ్రీ రంజిత్ గన్నోజు లు పురస్కారములు తీసుకోవడం చాలా సంతోషించదగిన విషయమన్నారు. పోటీలో ఉత్తమ రచన గా ఎంపికైన నవల”కిలారి” ని రచించినది తనకు ఆత్మీయయుడైన బీ.నాగశేషు కావడంతో  తాను ఆనవలను అత్యంత ఆసక్తితో  చదవడం జరిగిందన్నారు.  గ్రామాలలోని అతి సామాన్యులైన  బలహీన వర్గాలను, చిన్న చిన్న కుల వృత్తులు చేసుకుంటూ జీవనము సాగిస్తున్న అట్టడుగువర్గాలను సంపన్నులు  ఎలా పీడిస్తారో పాఠకుల మనసులకు హత్తుకునేలా వ్రాయడం చదివినపుడు  రచయిత అనుభవపూర్వకంగా వ్రాసిన వైనం ప్రస్ఫుటమవుతున్నదని పేర్కొన్నారు.

చదువులు అంతగా లేని వివిధ కులవృత్తుల వారు గ్రామాల్లో సాగించే వాడుక పదాల  సంభాషణల రచన ఒక విశిష్టత కాగా, ఉన్నత  చదువులకోసం  పట్టణాలకు వలసవెళ్లిన కొందరు తమ శక్తి యుక్తులనుపయోగించి ఆర్ధికంగా ఎదిగి తాము పుట్టిపెరిగిన గ్రామాల్లోని  అట్టడుగు పీడిత వర్గాలకు ఆర్ధికంగా తోడ్పడడం వంటి సంఘటనలు వెలుగులోనికి తేవడం వెనుక  గ్రామీణుల జీవితాలలో  సామాజిక చైతన్యాన్ని కలిగించడం రచయిత నాగశేషు ఆశయం గా అర్ధమవుతుందని పేర్కొన్నారు. తరువాత  ప్రధాన వక్త డాక్టర్ పాలకోడేటి సత్యనారాయణ రావు మాట్లాడుతూ డా.బి.నాగశేషు రచించిన”కిలారి”, శ్రీమతి  రెంటాల కల్పన రచించిన నవల ”కావేరికి అటూ ఇటూ” శ్రీ  రంజిత్ గన్నోజు రచించిన నవల”. లింగాల కంఠంలో”, నవలల  రచన లోని ప్రత్యేక విశిష్టతలను లోతుగా పరిశీలిస్తూ ప్రసంగించారు. తాను విధించుకున్న నియమానుసారం తాను సమీక్షించే ప్రతి నవల ను నిర్విరామంగా చదవడము జరిగిందనీ, అదేవిధంగా తాను ఎంపిక చేసిన నవలలను గూర్చిన విశ్లేషణను మంచి  చెడుల నిర్ణయాత్మక దృష్టితో తరచి చూడడంతో పాటు ప్రతి నవలలోనూ తనకు నచ్చిన అంశాలను మరియు నచ్చని అంశాలనూ ప్రస్తావిస్తూ తమ స్పందనలను అద్భుతంగా వ్యక్తీకరించారు. ఆయన చేసిన సూచనలు కొత్త రచయితలకి మార్గదర్శకం కూడాను.

ప్రముఖ సాహితీ విశ్లేషకులు శ్రీ లెనిన్ వేముల (Lenin Vemula) ముందుగా ఆచార్య గంగి శెట్టి లక్ష్మీ నారాయణ వారిని అక్షర పరబ్రహ్మగా గుర్తుచేసుకున్నారు. అదేసమయంలో ఈ నవలల పోటీ నిర్వహించిన జొన్నలగడ్డ  సుబ్రహ్మణ్యం మరియు  శ్రీమతి శారద గార్లను అభినందించారు. తాను పరిశోధనా విద్యార్థిగా నాగశేషు గారిని కలవడం జరిగిందనీ లోతైన విశ్లేషణ చేసి తనకు పరిశోధనా విషయాలు బోధించారని  తెలిపారు. మహాకవి దాశరధి పేర్కొన్నట్లు డాక్టర్ నాగశేషు తాదాత్మ్యము చెంది రచన సాగించే  కవి గా అభివర్ణించారు. అందుకు ఉదాహరణగా నవలలో సాగిన గ్రామదేవత జాతర వర్ణన ను ప్రస్తావిస్తూ అందెశ్రీ గారి ”కొమ్మ చెక్కితే బొమ్మరా”అనే  వీనుల విందైన పాట పాడి నాగశేషు గారి  వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు.

ఆయా కుల వృత్తులవారు వారి గ్రామీణ భాషలో మాట్లాడడాన్ని డాక్టర్ నాగశేషు తాను మాట్లాడే యాసలోమాటలు వ్రాయడం తనకు నచ్చిన మరొక అంశమని వివరించారు. పేదరికాన్ని, కులవివక్షను కేవలం ఎత్తిచూపి వర్ణించడమే కాక, ఆయా బలహీనవర్గ ప్రజలు ఆధునిక సమాజపు ఆర్థిక పురోగతిని తమకోసమెలా ఉపయోగించుకొని, తద్వారా క్రమాభివృద్ధిని సాధించడెమెలా అన్న సాహిత్య (Literature) ప్రయోజనాన్నీ నాగశేషు పోషించారని శ్రీ లెనిన్ వేముల (Lenin Vemula) నొక్కి చెప్పారు. తరువాత శ్రీ దర్భముళ్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ వారిని గొప్ప గురువు గా నూ  అవ్యాజమైన ప్రేమచూపించే పితృసమానులుగానూ గుర్తు  చేసుకున్నారు. 

తరువాత పురస్కార గ్రహీతలైన డాక్టర్ నాగశేషు స్పందిస్తూ తన నవలలో పేర్కొన్న  పాత్రలు ఇంకా కథావస్తువును గురించి చక్కగా వివరించారు. స్త్రీ  పాత్రతోనే  ఈ”కిలారి ” నవల మొదలవుతుందన్నారు. ఆవులు మేకలు మొదలగు వాటిని పెంచడం వంటి కుల వృత్తులు చేసుకుంటూ జీవించే వారి పేర్లకు ముందు కిలారి అనే పదాన్ని జోడించి పిలిచే  పద్దతి తాము పుట్టి పెరిగిన గ్రామీణ జన జీవనస్రవంతి లో భాగమైనందున తన నవలకు ”కిలారి” నామం అతికినట్లుగా సరిపోయిందన్నారు. ఊరిలో  మంగలి వృత్తి చేసుకొనే  పాత్ర  చేత కొన్ని సందర్భాల్లో చెప్పించిన ఆత్మీయ మాటలను, హృద్యంగా మలచడం జరిగిందన్నారు.

అనేకమంది గ్రామాలనుండి  పట్టణాలకు ఆర్ధికముగా బలపడడానికి  వలస వెళ్లినప్పటికీ తమ గ్రామాలలో ఇప్పటికీ మూఢనమ్మకాలతో పోటీపడుతూ  కుల వృత్తులు అనుసరిస్తున్న గ్రామీణులకు  విద్య వైద్య రంగాల్లో ఎంతో కొంత సహాయం చేయడం దేవాలయ నిర్మాణంలో భాగస్వాములను చేయడం వంటివి తన మనసుకు నచ్చిన అంశాలని  అన్నారు. ఆతరువాత ప్రత్యేక బహుమతి పొందిన ”కావేరికీ అటూ ఇటూ” నవలా రచయిత శ్రీమతి కల్పన రెంటాల మాట్లాడుతూ ఆచార్య గంగిశెట్టి వారితో తనకు గల సాన్నిహిత్యం  గురించి గుర్తుచేసుకొంటూ ఆయనతో అనువాద ప్రక్రియల గురించి చాలాసార్లు సాహిత్య చర్చలలో పాల్గొనే అవకాశము కలిగినట్లు పేర్కొన్నారు. ఆచార్య గంగిశెట్టి వారు ఈనవలను చదివి కొన్ని అమూల్యమైన సలహాలివ్వడం జరిగిందనీ, అయితే వారు తనకు ఇచ్చిన మాట ప్రకారము ఈనవలకు ”ముందు మాట”వ్రాయకుండానే ఆచార్యులవారు ఈలోకమునుండి నిష్క్రమించడం తననెంతో  బాధించిందన్నారు.

ఈ నవల వ్రాయడానికి గల కారణము ప్రస్తావిస్తూ సాహిత్యంలో కుటుంబ చరిత్ర  స్త్రీల వైపునుండి మాట్లాడితే ఏవిషయాలు ప్రస్తావనకు వస్తాయో చర్చించడమే ఈ నవల వ్రాయడంలో తన ఉద్దేశ్యమని  అన్నారు. అంతేకాకుండా స్త్రీల (Women) స్వేచ్ఛ, వారి బాధ్యత  మరియు అంతర్గత వలసల చుట్టూ స్త్రీల జీవితాలు  ఎలా ముడిపడివుంటాయి, సమాజములో జరిగే సంఘటనలు వారి మీద  ఎంతమేరకు ప్రభావము చూపుతాయి మొదలైన అంశాలు తన నవలలో ప్రస్తావించడం జరిగిందని అన్నారు.

ఉదాహరణకు పాల క్కాడులో పూర్వము స్త్రీలను కొనుగోలు చేసినట్లు వెల్లడయిన విషయాన్ని ప్రస్తావించారు ఈనవలలో స్త్రీ పాత్రలనునాలుగింటిని తీసుకొని అందులో భాగంగా మలయాళ భాష మాట్లాడే ప్రాంతమైన కేరళ (Kerala) పాలక్కాడుకు చెందిన స్త్రీ వివాహానంతరం తమిళభాష మాట్లాడే ప్రాంతానికి వలసవెళ్లడం ఆమె కుటుంబములోని తరువాతి తరం స్త్రీలు వివాహ రీత్యా విభిన్న భాషలైన తెలుగు (Telugu), కన్నడం మాట్లాడే ప్రాంతాలకు వెళ్ళవలసిరావడంఆ ప్రత్యేక పరిస్థితులలోకుటుంబ పరంగానూ సామాజిక పరంగానూ వారిపై పడిన నిందలు వాటిని వారు ఎదుర్కొన్నతీరును వారి జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయనే  విశేషాలను అద్భుతంగా వివరించారు. చివరగా శ్రీమతి కల్పన రెంటాల నవలల పోటీల నిర్వాహకులకు,  పురస్కార ప్రదాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేశారు.

ప్రత్యేక బహుమతి పొందిన ”లింగాల కంఠంలో” నవల రచయిత శ్రీ రంజిత్ గన్నోజు మాట్లాడుతూ ”ఇప్ప సారా కత్తిసారం” అనేది ఈ నవలకు ఉపశీర్షిక అని పేర్కొన్నారు.  లింగాల ఒక ప్రాంతము పేరు అనీ సారాను కాచి అమ్మడం లేదా త్రాగడానికి అలవాటుపడ్డ  చెంచుల జీవన విధానమును దగ్గరగా చూచినవాడిని కావడంచేత లింగ దాసు, మల్లి దాసుఅనే రెండు పాత్రలను, చిన్నవయసులోనే పెళ్లయిన ఒక చెంచు బాలిక పాత్ర ను ఎంచుకొని, అడవికి దగ్గరిగావున్నవారు మాట్లాడే తీరు వారి జీవన విధానం  ఈ అడవుల్లో నివసించే వారి పిల్లలకు  విద్య అవకాశాలు వంటి విశేషాలతో ఆటవిక, ఆధ్యాత్మిక చారిత్రక సామాజిక అంశాలు మేళవించి ఈ నవలనురూపిందించడం  జరిగిందనీవివరించారు. పాలకోడేటి సత్య నారాయణ రావు గారన్నట్లు తన మీద ఇతర రచయితల ప్రభావము ఉన్నదనీ, ఇంకా లెనిన్ వేముల గారు పేర్కొన్నట్లు గోరటి వెంకన్నవంటి వారి ప్రభావం కూడా తనమీద ఉన్నదనీ చెప్పుకొచ్చారు.

న్యాయ నిర్ణేతలు తన నవలను ఎంపికచేయడం తన అదృష్టముగా భావిస్తున్నానని  అన్నారు. చివరగా శ్రీరంజిత్ గన్నోజు  ఈ పోటీల నిర్వాహకులకు పురస్కార ప్రదాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ చేశారు. శ్రీ నీలకంఠం నరస రాజు, శ్రీమతి సరోజ కొమరవోలు లతో బాటు, డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి (Dr. Narasimha Reddy Urimindi), శ్రీ గోవర్ధనరావు నిడిగంటి, శ్రీ ఇక్బాల్.. ఆచార్య గంగిశెట్టి వారిని స్మరిస్తూ, సన్మాన సభ కార్యక్రమ విశేషాల గురించి వారి స్పందన తెలిపారు. బెంగళూరు యూనివర్సిటీ తెలుగు శాఖలో పరిశోధన విద్యార్థి శ్రీ సోమశేఖర్ కూడా సిరికొన సంస్థ వ్యవస్థాపకులు ఆచార్య గంగిశెట్టి వారిని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆచార్య కొలకలూరి ఇనాక్, డాక్టర్ పాలకోడేటి సత్యనారాయణ రావు, శ్రీ చంద్ర కన్నెగంటి, శ్రీ లెనిన్ వేముల, డాక్టర్ సూరం  శ్రీనివాసులు, శ్రీ విట్టు బాబు, శ్రీ జయన్న, శ్రీమతి పాలపర్తి హవీలా మరియు మిగతా సిరికోనీయులందరికి, శ్రీ వీర్నపు చినసత్యం (Chinasatyam Veernapu), శ్రీమతి విజయలక్ష్మి కందిబండ్ల, శ్రీమతి భాగ్యలక్ష్మి నల్లా, శ్రీ ఇస్మాయిల్ పెనుకొండ, శ్రీ సడ్లపల్లె, శ్రీమతి దార్ల సుప్రజ, శ్రీ శ్రీనివాసులు బసాబత్తుని వంటి సాహిత్యాభిమానులకు మరియు ప్రపంచం నలుమూలల నుండి హాజరైన దాదాపు అరవై మంది పైగా సాహితీ ప్రియులకు (Literary Scholars), పురస్కార దాతలు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం వారి శ్రీమతి శారద గార్ల కృతజ్ఞతా పూర్వక తుది పలుకులతో సదస్సు విజయవంతముగా ముగిసింది.

error: NRI2NRI.COM copyright content is protected