Connect with us

Literary

Singapore: హాస్య రచనల విభాగంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారానికి Radhika Mangipudi ఎంపిక

Published

on

Singapore: ప్రముఖ కథా రచయిత్రిగా, కవయిత్రిగా, వ్యాఖ్యాత్రిగా పేరుతెచ్చుకున్న “శ్రీ సాంస్కృతిక కళాసారథి – సింగపూర్” సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (Suravaram Pratapa Reddy Telugu University) కీర్తి పురస్కారానికి ఎంపిక అయ్యారు. 2023 సంవత్సరానికిగాను వివిధ రంగాలలో ప్రసిద్ధిగాంచిన 48 మందిని ఎంపిక చేసినట్లుగా, వారిలో హాస్య రచనల విభాగంలో రాధిక ఎంపికయ్యారని తెలుగు విశ్వవిద్యాలయం వారు పత్రికా ప్రకటనలో తెలిపారు.

రాధిక (Radhika Mangipudi) 2016లో సింగపూర్లో (Singapore) తన సాహితీ ప్రస్థానం ప్రారంభించి ఇప్పటివరకు 3 కథా సంపుటులు, 2 కవితా సంపుటలు, 2 పద్య శతకాలు, ఒక వ్యాస సంపుటి రచించారు. ఆగస్టు 16వ తేదీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హ్యూస్టన్ (Houston, Texas) మహానగరంలో జరిగిన “14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”కు ప్రధాన అతిథులలో ఒకరిగా రాధిక హాజరయ్యారు.

తొలిసారి అమెరికా పర్యటనతో పాటు అంతటి ప్రతిష్టాత్మక వేదికపై తాను ప్రసంగించడం, తన 8వ పుస్తకం “కథ కంచికి” అనే నూతన కథా సంపుటి సినీ రచయిత బుర్రా సాయి (Burra Sai Madhav) మాధవ్ చేతుల మీదుగా ఆవిష్కరించబడడం చాలా సంతోషంగా ఉందని, ఆ వెనువెంటనే తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారానికి ఎంపిక అవ్వడం ఇంకా ఆనందంగా ఉందని రాధిక (Radhika Mangipudi) తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాల కమిటీ సభ్యులకు తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

రాధిక (Radhika Mangipudi) ఈ పురస్కారం అందుకోబోవడం పట్ల శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ (Ratnakumar Kavuturu) మరియు ఇతర సభ్యులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ రాధికను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు తెలుగు సంస్థల ప్రతినిధులు, డా. వంశీ రామరాజు వంటి భారత సాహితీ సాంస్కృతిక రంగ ప్రముఖులు, సాహిత్యకారులు, శ్రేయోభిలాషుల నుండి రాధికకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా ‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ అధ్యక్షులు, అమెరికా హాస్యబ్రహ్మ వంగూరి చిట్టెన్ రాజు (Vanguri Chitten Raju) తనకు 2011లో హాస్య రచన విభాగంలో వచ్చిన అదే కీర్తి పురస్కారం మళ్ళీ తమ సంస్థ అంతర్జాతీయ సమన్వయకర్త అయిన రాధిక అందుకోబోవడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలో హైదరాబాద్ (Hyderabad) లో పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య నిత్యానందరావు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected