భాషా సేవే భావితరాల సేవ అనే నినాదంతో సిలికానాంధ్ర మనబడి (Silicon Andhra Manabadi) గత 17 సంవత్సరాలుగా తెలుగు భాషను ఖండాతరాలలో వున్న తెలుగు వారి పిల్లలకు నేర్పించి సుమారు లక్షకు పైగా విద్యార్థులకు తెలుగు నేర్పించడంలో సఫలీకృతం అయ్యింది.
సిలికానాంధ్ర మనబడి చికాగోలోని నేపర్విల్/అరోరా మరియు వెస్ట్ మోంట్ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే పిల్లల పండుగను ఈ నెల మార్చ్ 16వ తారీఖున లేమోంట్ టెంపుల్ లో ప్రాంతీయ సమన్వయ కర్త మాలతీ దామరాజు (Malathi Damaraju), నేపర్విల్/అరోరా సమన్వయ కర్తలు సుజాత అప్పలనేని (Sujatha Appalaneni) మరియు కిరణ్ మట్టే (Kiran Mattey), మరియు వెస్ట్ మోంట్ సమన్వయ కర్త లోహిత తునుగుంట్ల (Lohitha Tunuguntla) ఆధ్వర్యంలో నిర్వహించారు.
మొదట శోభా యాత్రతో ప్రారంభించి, అటుపై విద్య సుసర్ల గారు, విశ్వనాధ్ సుసర్ల గారు చేతుల మీదుగా భాషా జ్యోతిని వెలిగించి, తదుపరి తరాలకి అందించి సిలికానాంధ్ర మనబడి పిల్లల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మనబడి సమన్వయ కర్తలు (Manabadi Coordinators) మాట్లాడుతూ నేపర్విల్ శాఖలో 150 మంది విద్యార్థులు తెలుగు నేర్చుకుంటున్నారు అని చెప్పారు.
అలాగే మనబడి నిర్వహిస్తున్న ఇతర కార్యక్రమాలైన మాట్లాట, బాలానందం గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి సిలికానాంధ్ర వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రాయవరం (Vijaya Bhaskar Rayavaram) గారు అతిధిగా విచ్చేసి సిలికానాంధ్ర వారు చేస్తున్న కార్యక్రమాల మరియు తెలుగు ఆవశ్యకత గురించి వివరించారు.
తెలుగువారంతా సాంప్రదాయక దుస్తులు ధరించి ఒక కుటుంబంగా తరలి వచ్చిన ఈ సందర్భం కన్నులకు ఇంపుకుగా ఒక పండగ వాతావరణాన్ని తలపించింది. వివిధ తరగతులలో వున్న విద్యార్థులు పద్యాలు, హాస్య నాటికలు మరియు నీతి కథలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాల తో అందరిని అలరించారు.
ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఈ కార్యక్రమాలను రూపొందించి, పిల్లల చేత సాధన చేయించి, ప్రదర్శింప చెయ్యటంలో చేసిన కృషి శ్లాఘనీయం. ఈ సిలికానాంధ్ర (Silicon Andhra) మనబడి కార్యక్రమం ఆద్యంతం ఆసక్తి గా జరిగి అందరిని అలరించింది.