ఆగష్టు 5, శనివారం సాయంత్రం ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర 22వ సంస్థాపక దినోత్సవ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. గత 22 సంవత్సరాల ఆనవాయితీ ప్రకారం ఈ సభ కూడా బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రిగారి వేదాశ్వీరచనంతో మొదలయింది.
శ్రీ చమర్తి రాజుగారు ప్రారంభోపన్యాసం చేస్తూ గత రెండు దశాబ్దాల పైగా చేసిన ప్రయాణాన్ని, సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను ఆహూతులతో పంచుకున్నారు. హాజరైన తెలుగు కుటుంబాలు తెలుగు సాహితీసాంస్కృతికసంప్రదాయ స్ఫూర్తిని తరువాతి తరాలకు కూడా అందించేట్టుగా సంస్థ చేస్తున్న ప్రయాణం నిరాఘాటంగా కొనసాగాలని తమ మద్దతును ప్రకటించారు.
సంస్థాపక దినోత్సవ వేడుకలో ప్రముఖ ఆకర్షణగా కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో, ఆకెళ్ళ రచించిన చేసిన శ్రీనాథుడు పూర్తి నిడివి తెలుగు పద్య నాటకం ప్రదర్శించారు. గుమ్మడి గోపాలకృష్ణ శ్రీనాథుడు పాత్ర పోషించగా, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు మిగిలిన పాత్రలు పోషించారు. 400 పైచిలుకు బే ఏరియా తెలుగు వారు నాటకాన్ని కన్నార్పకుండా చూసి పాత్రలతో మమేకమై, రసానుభూతిని పొందారు.
కళాకారులు రాగయుక్తంగా పాడిన పద్యాలకు ప్రేక్షకులు ఈలలతో, చప్పట్లతో, వన్స్ మోర్ అరుపులతో అభినందించారు. శ్రీనాథుడి జీవిత చరమాంక సన్నివేశాల్లో, సభలో కంటతడి పెట్టని వారు లేరనడం అతిశయోక్తి కాదు. నాటకం పూర్తైన తరువాత డా. లకిరెడ్డి హనిమిరెడ్డి చేతుల మీదుగా గుమ్మడి గోపాలకృష్ణకు సన్మానం జరిగింది. హనిమిరెడ్డి గారు శాలువాతో సత్కరించడమే కాక సభాముఖంగా గుమ్మడి గోపాలకృష్ణకు పదివేల డాలర్ల బహుమతి కూడా ప్రకటించారు.
అలానే రఘు మల్లాది గారు, చిమట శ్రీనివాస్ గార్లు కూడా చెరో వెయ్యినూట పదహార్లు బహుమతి ప్రదానం చేశారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కూచిభొట్ల ఆనంద్, వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి, మాజీ అధ్యక్షులు సంజీవ్ తనుగుల, విజయసారధి మాడభూషి, ప్రస్తుత కార్యవర్గ నాయకులు కిరణ్ సింహాద్రి, సాయి కందుల, శివ పరిమి, పూర్వ కార్యవర్గ సభ్యులు శాంతివర్ధన్ అయ్యగారి, ప్రియ తనుగుల, రవీంద్ర కూచిభొట్ల, వంశీ నాదెళ్ళ తో పాటు ఇతర సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు శర్మ యేడిది, వంశీ ప్రఖ్య, అనిరుధ్ తనుగుల, రఘు మల్లాది, వంశీ బచ్చు, మాధవ్ కిడాంబి, ఆనంద్ విప్పర్తి, రమణ తుర్లపాటి, రామకృష్ణ కాజ, శ్రీరామ్ కోట్నీలు నాటకంలో వివిధ పాత్రలు పోషించారు.
అమెరికాలో భవిష్యత్ తెలుగు సాంస్కృతిక నాయకులు కాబోతున్న ఇక్కడి తెలుగు యువకులు, పిల్లలు సాయి కందుల, అనిరుధ్ తనుగుల, ప్రద్యుత్ పరిమిలు కూడా తొలిసారిగా నాటకంలో పాత్రలు ధరించి ప్రేక్షకులను మెప్పించారు. పాత్రధారులకు మేకప్ సహకారం అందించిన నరసింహారావు పసుమర్తి, జ్యోతి చింతలపూడి, హార్మోనియం వాయించిన మంత్రాల నిర్ణయ్, నాటకం రక్తి కట్టడానికి తెరవెనుక ఉంటూ అద్భుతముగా AV ఏర్పాట్లు చేసిన సిలికానాంధ్ర కార్యదర్శి దిలీప్ సంగరాజులకు అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బూదరాజు శ్రీనివాసమూర్తి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇప్పటివరకూ ఎప్పుడూ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా ఒక పద్య నాటక ప్రదర్శన చూడలేదని, అమెరికాకు వచ్చి ఇక్కడ ఇలా సిలికానాంధ్ర సంస్థలో చూడగలగడం తన అదృష్టమని పేర్కొన్నారు. IITH అంటే ఇన్వెంటింగ్ అండ్ ఇన్నోవేటింగ్ టెక్నాలజీ ఫర్ హ్యూమానిటీ అన్న పేరు తెచ్చుకోవడం తనకు ఆనందం కలిగించే విషయమని, ఆ దిశలో వారు చేస్తున్న హెరిటేజ్ పరిశోధనల గురించి సభికులకు వివరించారు.
తమ నాయకత్వంలో ఐఐటీ హైదరాబాద్ లో విద్యార్థులు కనీసం 10 శాతం కోర్సులను లిబరల్ ఆర్ట్స్ లో తప్పనిసరిగా చెయ్యాలనే నిబంధన తెచ్చి, తమవంతు ప్రయత్నంగా భవిష్యత్ తరం వారు మన భాషలు, కళలు నేర్చునేట్టుగా చేస్తున్నామని తెలియజేసారు. అలానే సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంతో ఐఐటీ హైదరాబాద్ కొన్ని కోర్సులనో, తరగతులనో కలిసి అందించే విధంగా ఏవైనా చెయ్యడానికి చర్చలు జరుపుతోందని సభికుల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు.
సిలికానాంధ్ర కుటుంబానికి ఆప్తులు, సన్నిహితులు, జగమంత కుటుంబం నాది అంటూ నినదించి మనకు భౌతికంగా దూరమైపోయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కుటుంబం కూడా ఈ సాయంత్రం కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికంతా పొగ కమ్మేయగా సిరివెన్నెలే వచ్చారా అన్నట్టుగా వారి కుమారుడు యోగిని వాళ్ళ నాన్నగారిలా మేకప్ వేసి వేదిక మీదకు తీసుకురావడం ఆహూతులకు ఆశ్చర్యానంద అనుభూతిని కలిగించింది.
సిరివెన్నెల గారి సతీమణి, వారి సోదరుల సమక్షంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర తెలుగు శాఖలో వచ్చే సంవత్సరం నించి సిరివెన్నెల ఆచార్య పీఠం ప్రారంభిస్తున్నట్టు యూనివర్సిటీ అధ్యక్షులు డా. కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు. అలానే ప్రతీ సంవత్సరం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభలో సిరివెన్నెల స్మారకోపన్యాసము, సిరివెన్నెల స్మారక పతకం ఇవ్వనున్నట్టు తెలియజేశారు.
యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ డా. పప్పు వేణుగోపాలరావు గారు రాసిన, “A Monograph on Yakshagana” పుస్తకాన్ని, డా. హనిమిరెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆ పుస్తకావిష్కరణలో యూనివర్సిటీ బోర్డు సభ్యులైన కల్వచర్ల ప్రభాకరరావు గారు, డా. వేణు కొండ్లే మరియు విశ్వవిద్యాలయ అధ్యక్షులు డా. ఆనంద్ కూచిభొట్ల, విద్యాధికారి రాజు చమర్తి లు కూడా పాల్గొన్నారు.
ఉర్రూతలూగించిన ఈ కార్యక్రమాన్ని అచ్చ తెలుగు భోజనంతో ముగించారు. ప్రత్యేకంగా భారతదేశం నించి తెప్పించిన అరటి ఆకుల్లో కార్యకర్తలు కొసరి కొసరి వడ్డిస్తుంటే అలా పంక్తిలో కూర్చుని భోజనం చెయ్యడం పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చిదంటూ ప్రవాస భారతీయలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా తెప్పించి వడ్డించిన మామిడిపళ్ళు భోజనంలో మరో ఆకర్షణ.