Connect with us

Sports

Mississippi: ప్రొవైన్ హై స్కూల్ ఫుట్‌బాల్ అసిస్టెంట్ కోచ్ గా, యువతకు ప్రేరణగా శశాంక్ యార్లగడ్డ

Published

on

Jackson, Mississippi: అమెరికా హై స్కూల్ ఫుట్‌బాల్‌ (High School Football) లో భారతీయ యువ కోచ్‌గా అరుదైన గుర్తింపు తెచ్చుకుంటూ, ఫుట్‌బాల్ పట్ల తన ప్రేమను సేవగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్న ప్రతిభావంతుడు శశాంక్ యార్లగడ్డ (Shashank Yarlagadda) దేశ విదేశాల్లో తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. అమెరికాలో జన్మించిన ఫుట్‌బాల్ కోచింగ్ నిపుణుల మధ్య, భారతీయ మూలాలు కలిగిన కొద్ది మంది ప్రతినిధుల్లో శశాంక్ ఒకరు కావడం ప్రత్యేకం.

ప్రస్తుతం శశాంక్, మిసిసిప్పి రాష్ట్రంలోని జాక్సన్ నగరంలో ఉన్న ప్రొవైన్ హై స్కూల్లో డిఫెన్స్ అసిస్టెంట్ కోచ్ (Defense Assistant Coach) గా, లైన్‌బ్యాకర్స్ కోచ్ (Linebackers Coach) గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా లో లో ఉన్న ఈ ఫుట్‌బాల్ ప్రోగ్రామ్‌ను తిరిగి పునరుద్ధరించేందుకు పాఠశాల చేస్తున్న విశాలమైన ప్రయత్నాల్లో శశాంక్ పాత్ర ప్రధానంగా నిలుస్తోంది.

కళాశాల రోజుల నుంచే ప్రారంభమైన గురు–శిష్య బంధం

శశాంక్ కళాశాలలో ఫ్రెష్మన్‌గా ఉన్న రోజుల్లో, ప్రస్తుత హెడ్ కోచ్ మార్‌సెలస్ స్పీక్స్ (Marcellus Speaks) సీనియర్. అదే సమయంలో శశాంక్, మార్‌సెలస్‌ వద్ద ఆఫెన్స్, డిఫెన్స్‌ను వంటి ఆధునిక ఫుట్‌బాల్ సూత్రాలను నేర్చుకున్నారు. ఈ అనుబంధమే నేటి ఇద్దరి కోచింగ్ ప్రయాణానికి పునాది అయింది. మార్‌సెలస్, తర్వాత ఎన్ఎఫ్‌ఎల్ జట్టు టాంపా బే బకనీర్స్ (Tampa Bay Buccaneers) లో ప్లేయర్‌గా చోటు సంపాదించాడు. ఫుట్‌బాల్ రంగంలో తన అనుభవాన్ని కోచింగ్‌లోకి మార్చుకుంటూ, ఆపై ప్రొవైన్ హై స్కూల్‌కు హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు.

హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, మార్‌సెలస్ (Marcellus Speaks) వెంటనే శశాంక్‌ను ప్రాక్టీస్ గ్రౌండ్‌కి ఆహ్వానించాడు. జట్టులో ఉన్న లైన్‌బ్యాకర్స్ డిఫెన్స్ వ్యవస్థను పరిశీలించిన శశాంక్ ఆ పిల్లల సామర్థ్యాన్ని గుర్తించి, తనంతట తాను సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. శశాంక్ ప్రదర్శించిన నిబద్ధత, శిక్షణా ధోరణిని గమనించిన మార్‌సెలస్, “ఇదే నీ స్థానం… ఎప్పుడు పూర్తి స్థాయి కోచ్‌గా వస్తావ్?” అని అడిగారు. ఇదే శశాంక్ కోచింగ్ ప్రస్థానానికి ప్రారంభం అయింది.

జట్టును మార్చే ప్రయాణం – ఆటగాడి నుంచి కోచ్‌గా మారిన ఆలోచన

ఇది శశాంక్‌కు కోచింగ్‌లో మొదటి సంవత్సరం. ఆటగాడి మనస్తత్వం నుంచి కోచ్‌ వైపు ఆలోచన మార్చుకోవడం, హై స్కూల్ పిల్లలతో పనిచేసే సమయంలో ఓర్పు, సహనం కలిగి ఉండటం వంటి పాఠాలు ఆయన నేర్చుకున్నారు. పిల్లల అభివృద్ధి కోసం శశాంక్ (Shashank Yarlagadda) ప్రతి రోజూ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తూ, లైన్‌బ్యాకర్స్‌కు బలోపేతమైన రక్షణ నిర్మిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా ప్రొవైన్ హై స్కూల్ ఫుట్‌బాల్ ప్రోగ్రామ్ (Football Program) శిథిల స్థితికి చేరిపోయింది. ఈ జట్టు ఒకప్పుడు ఎన్నో కాలేజ్ ప్లేయర్స్ ను ఇచ్చి, వారు తర్వాత ఎన్ఎఫ్‌ఎల్ (NFL) వరకు ఎదిగిన ప్రసిద్ధ పవర్‌హౌస్. అయితే మధ్యలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా క్రీడపై ఆసక్తి తగ్గిపోయింది. ఇప్పుడు శశాంక్–మార్‌సెలస్ ద్వయం, ఈ జట్టు ప్రతిష్టను మళ్లీ పాత స్థాయికి తెచ్చేందుకు పునర్నిర్మాణ యాత్ర మొదలుపెట్టారు. ప్రాథమిక స్థాయి నుంచి ప్రారంభించి, విద్యార్థులకు ఖచ్చితమైన ఫుట్‌బాల్ పునాదులు వేస్తున్నారు.

సేవా రంగంలో కూడా ముందు వరుసలోనే శశాంక్

క్రీడా రంగంతో పాటు, శశాంక్ సేవా కార్యక్రమాల్లోనూ (Service Activities) విశేషంగా వ్యవహరిస్తున్నారు. మిసిసిప్పి రాష్ట్రం (Mississippi State) లోనే కాకుండా జాతీయ స్థాయిలో పలు వాలంటీర్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) లో స్పోర్ట్స్ సెక్రటరీగా పనిచేసిన కాలంలో, అనేక క్రీడా టోర్నమెంట్లు ఇటు అమెరికా అటు భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు.

తనకు అప్పగించిన బాధ్యతను మనసా వాచా అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తున్న శశాంక్ (Shashank Yarlagadda), అమెరికా తెలుగు సమాజంలో యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచారు. క్రీడల అభివృద్ధి, యువతలో నాయకత్వ లక్షణాల పెంపుకై చేసిన కృషికి శశాంక్‌కి మంచి గుర్తింపు లభిస్తోంది.

భారతీయ యువతకు మార్గదర్శకంగా శశాంక్ యార్లగడ్డ

క్రీడలలో ప్రతిభను, వాలంటీరింగ్‌లో సేవా ధర్మాన్ని, కోచింగ్‌లో క్రమశిక్షణను కలగలిపి ముందుకు తీసుకెళ్తున్న శశాంక్ యార్లగడ్డ (Shashank Yarlagadda) ప్రయాణం, అమెరికాలో ఉన్న భారతీయ యువతకు కొత్త ప్రేరణ. జట్టును పునరుద్ధరించేందుకు చేస్తున్న కృషి, పిల్లల భవిష్యత్తును నిర్మించేందుకు ఆయన చేస్తున్న సేవ, ఆయనను మరింత ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడుతోంది.

ఫుట్‌బాల్ ప్రోగ్రామ్ పునర్నిర్మాణంలో శశాంక్ (Shashank Yarlagadda) పాత్రను అభినందిస్తున్న ప్రొవైన్ హై స్కూల్ (Provine High School), రాబోయే సంవత్సరాల్లో మరిన్ని విజయాలు అందుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అలాగే చిన్న వయస్సులోనే రోల్ మోడల్ గా ఎదుగుతున్న శశాంక్ యర్లగడ్డ ని ప్రవాసులు అభినందిస్తున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected