ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఎప్పటికప్పుడు వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకొస్తుంది. ఈసారి పిల్లల చదువులకి సంబంధించి శాట్ (SAT – Scholastic Assessment Test) శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. శాట్ అంటే మనం చదువుకునే రోజుల్లో కొంచెం అటుఇటుగా ఎంసెట్, లేదా మాస్టర్స్ చదువుకోవడానికి రాసే జి.ఆర్.యి, టోఫెల్ లాంటి పరీక్ష అన్నమాట. అమెరికా కళాశాలల్లో ప్రవేశాల కోసం కాలేజ్ బోర్డు తరపున ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఇక్కడి పిల్లల కోసం నిర్వహించే ప్రామాణికమైన పరీక్ష. సవాళ్ళతో కూడిన ఇటువంటి పరీక్షలో అత్యుత్తమ స్కోర్ సాధించాలంటే ఎలా సన్నద్ధమవ్వాలి, ఏం చదవాలి, అందులో ఉన్న మెళకువలు తదితర విషయాలు తెలియజేయాలనే దూరదృష్టితో సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 14 వరకు 5 వారాల పాటు ప్రతి సోమవారం, గురువారం రెండు గంటల శాట్ శిక్షణ అందిస్తున్నారు.
శాట్ లో టాప్ స్కోర్ సాధించిన హాసిత్ గారపాటి 10 – 12 గ్రేడ్స్ చదువుతున్న విద్యార్థులకు ఈ శిక్షణ అందిస్తున్నారు. శాట్ లో తన అనుభవాన్నంతా రంగరించి తోటి విద్యార్ధులకి ఉపయోగపడాలనే సదుద్దేశంతో కేవలం యాభై డాలర్ల చారిటీ డొనేషన్ కు పదిహేను గంటల శిక్షణా ప్రణాళికతో ముందుకొచ్చారు. అంతేకాకుండా ఈ శిక్షణా శిబిరం ద్వారా వచ్చే నిధులను చారిటీకి దానం చేయడం విశేషం. ప్రతి క్లాస్ లో మొదటి 30 నిమిషాలపాటు ఇంతకుముందు టాప్ స్కోర్స్ సాధించిన విద్యార్థులతో మార్గదర్శకం చేయడం చూస్తే ఈ శిక్షణా శిబిరం ఎంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారో తెలుస్తుంది.
600 మందికి పైగా నమోదు చేసుకున్న విద్యార్థులతో సెప్టెంబర్ 13 సాయంత్రం 6:30 కి మొదటి క్లాస్ జూమ్ లో వర్చ్యువల్ పద్దతిలో ప్రారంభమయ్యింది. ముందుగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ నెక్స్ట్ జనరేషన్ పిల్లల చదువులకు సంబంధించి నిర్వహించే ఇలాంటి మంచి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే గత అధ్యక్షులు జయ్ తాళ్లూరి, ఉపాధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, కార్యదర్శి సతీష్ వేమూరి, ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ విద్యార్థులను అభినందించి ముందు ముందు మరెన్నో మంచి కార్యక్రమాలకు తోడ్పడతామన్నారు. తదనంతరం 7:00 నుంచి 8:30 వరకు శిక్షణా కార్యక్రమం సాగింది. హై స్కూల్ కెళ్లే పిల్లలున్న వారి మదిని తలచే ఈ శాట్ పరీక్షలోని రీడింగ్, రైటింగ్, మ్యాథ్, యస్యే, ప్రాక్టీస్ టెస్ట్స్ ఇలా అన్ని విభాగాలను వివరిస్తుండడంతో విద్యార్థులు మరింత ఆసక్తిని కనబరిచారు.
తానా క్యాపిటల్ ఏరియా ప్రాంతీయ కార్యదర్శి శ్రీనివాస్ వుయ్యూరు, ఫౌండేషన్ ట్రస్టీ విద్య గారపాటి ఈ శాట్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించగా, మీడియా కార్యదర్శి ఠాగూర్ మల్లినేని, వెబ్ కమిటీ నేషనల్ కో-చెయిర్ సతీష్ మేకా లాజిస్టిక్స్ సమన్వయపరిచారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా తానా ఆన్లైన్లో తమ పిల్లల విద్యాప్రమాణాలను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు విద్యార్థుల తల్లితండ్రులు అభినందించడం గర్హనీయం. ఈ సందర్భంగా శాట్ శిక్షణా కార్యక్రమానికి సహకరించిన అన్ని ప్రాంతాల తానా నాయకులకు, అలాగే స్థానిక తెలుగు సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.