మార్చ్ 31న శాండియేగో తెలుగు అసోసియేషన్ ‘శాంటా’ ఉగాది ఉల్లాసం కార్యక్రమం భళారే భళా అన్నట్టు జరిగింది. కాలిఫోర్నియాలోని శాండియేగో జోన్ క్రోక్ థియేటర్లో నిర్వహించిన శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది ఉల్లాసం కార్యక్రమాన్ని అన్నపూర్ణ రెస్టారెంట్, సాఫ్ట్ హెచ్క్యూ, చెంవేద వారు సమర్పించగా కలర్ షాట్స్ స్టూడియో వారు ఫోటోగ్రఫీ సేవలందించారు. విఘ్నేశ్వరునికి జ్యోతి ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమం, స్థానిక ప్రతిభావంతమైన సాంస్కృతిక కార్యక్రమాలు మరియు తెలుగు సినీ గాయకుల పాటల హరివిల్లుతో వేదిక ప్రాంగణం హోరు మన్నది. మధ్యలో అతిలోక సుందరి శ్రీదేవిని స్మరిస్తూ తన సినిమాల్లోని పాటలకు చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమీరా పార్థసారధి ల పాటలకు చిన్న పెద్ద అందరూ వేదిక మీదకు వచ్చి డాన్సులు చెయ్యడం కొసమెరుపు. మనబడి, సద్గురు వంటి సంస్థలు తమ సేవాకార్యక్రమాలను వివరించారు. షడ్రుచుల ఉగాది పచ్చడి అందరూ మహదానందంగా ఆరగించారు. శాండియేగో ఉన్నత పాఠశాల విద్యార్థినీవిద్యార్థులు పెద్ద సంఖ్యలో వాలంటీరింగ్ చెయ్యడం విశేషం. ఈ సందర్భంగా స్పాన్సర్స్ మరియు సమీరా పార్థసారధిలను శాంటా కార్యవర్గం ఘనంగా సత్కరించారు. చివరిగా విందు భోజనాలతో శాంటా ఉగాది ఉల్లాసం కార్యక్రమం ముగిసింది.