అమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటా నగరంలో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్క్ ఎట్ క్రీక్ స్టోన్ లో తెలుగువారు అందరూ కలిసి సంప్రదాయ పద్దతిలో పిల్లలు, పెద్దలు సందడిగా సంక్రాంతి పండుగను ఆస్వాదించారు.
ముందుగా ముగ్గులు, గొబ్బెమ్మలతో ఇండియాలో వలే మహిళలు సంస్కృతీసంప్రదాయాలు పాటిస్తూ తెలుగువారి కల్చర్ ని గుర్తు చేశారు. పిల్లలు, మహిళలు, పురుషులు అందరూ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.
చిన్నారులను భోగి పళ్లతో పెద్దలు దీవించారు. యువత సైతం తమ తమ తల్లితండ్రుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అందరూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషంగా గడిపారు. అనంతరం ఆటలు, పాటలు, నృత్యాలతో ఉల్లాసంగా గడిపారు.
రంగురంగుల గాలి పటాలు తయారుచేసుకొని, వాటిని ఎగురవేస్తూ పిల్లలు ఉత్సాహంగా కనిపించారు.తమిళవారు, ఉత్తర భారతదేశ వాసులు కూడా ఈ పార్క్ ఎట్ క్రీక్ స్టోన్ సంక్రాంతి సంబరాలలో పాల్గొనడం విశేషం.
పలు భాషల్లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం భిన్నత్వంలో ఏకత్వంలా భారతదేశ సౌభ్రాతృత్వాన్ని తెలియజేసినట్టయింది.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతో గత 12 సంవత్సరాలుగా పార్క్ ఎట్ క్రీక్ స్టోన్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు.
కోవిడ్ టైం లో బ్రేక్ వచ్చినప్పటికీ మళ్ళీ ఇప్పుడు తిరిగి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముందు ముందు కూడా ప్రతి సంవత్సరం ఇంతే ఘనంగా జరుపుకుంటామన్నారు.