Connect with us

Literary

సామాజిక చైతన్య సాహిత్యంపై TANA అంతర్జాల దృశ్య సమావేశం విజయవంతం

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సాహిత్యవిభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలగా ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో భాగంగా డిసెంబర్ 29న జరిగిన – 75వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం “సామాజిక చైతన్య సాహిత్యం – దశ, దిశ” (అభ్యుదయ, దిగంబర, పైగంబర, విప్లవ సాహిత్యాలు) ఘనంగా జరిగింది.

విశిష్ట అతిథులుగా – అభ్యుదయ సాహిత్యం: డా. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి – సుప్రసిద్ధ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, అధ్యక్షులు: అరసం; శ్రీ వేల్పుల నారాయణ – ప్రముఖ రచయిత, అధ్యక్షులు: తెలంగాణ (Telangana) అభ్యుదయ రచయితల సంఘం (అరసం) మరియు జాతీయ కార్యదర్శి: అఖిలభారత అరసం; దిగంబర సాహిత్యం: (దిగంబర కవులు) నిఖిలేశ్వర్ (శ్రీ కుంభం యాదవరెడ్డి) – దిగంబర కవి, ప్రముఖ కథారచయిత, అనువాద రచయిత, విమర్శకులు; నగ్నముని (శ్రీ మానేపల్లి హృషీ కేశవరావు) – దిగంబర కవి, ప్రముఖ కవి, నాటకరచయిత, నాస్తికులు; పైగంబర సాహిత్యం: (పైగంబర కవులు) కిరణ్ బాబు (శ్రీ రావినూతల సుబ్బారావు) – పైగంబర కవి, రచయిత, సంపాదకులు; వోల్గా (డా. పోపూరి లలితకుమారి) – పైగంబర కవి, ప్రముఖ రచయిత్రి, స్త్రీవాద ఉద్యమ ప్రతీక, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత; శ్రీ రజాహుస్సేన్ –  కవి, రచయిత, పాత్త్రికేయుడు, సాహిత్య విమర్శకుడు; విప్లవ సాహిత్యం: (విప్లవ రచయితల సంఘం – విరసం): అరసవిల్లి కృష్ణ, విప్లవ కవి. అధ్యక్షులు: విరసం.

సాహిత్యం కాలంతో పాటు ప్రవహించే ఓ వాహిక.. కాలగతిలో సామాజిక పరిణామాలకు అనుగుణంగా సాహిత్య ఉద్యమాలు రూపుదిద్దుకుంటాయి. వాటి ప్రభావం సామాజిక మార్పులకు దోహదపడుతుందని వక్తలు ఉద్ఘాటించారు. ’తానా ప్రపంచ సాహిత్య వేదిక (TANA Prapancha Sahitya Vedika) ఆధ్వర్యంలో “సామాజిక చైతన్యం, సాహిత్యం, దశ, దిశ” అనే అంశంపై ఆదివారం రాత్రి జరిగిన అంతర్జాల సాహిత్య చర్చాకార్యక్రమంలో తెలుగు సాహిత్యం లోని వివిధ సాహిత్య ఉద్యమాలపై సంపూర్ణ చర్చ జరిగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.‌. సమాజంలో సామాజిక చైతన్యావసరాన్ని వివరించారు. సమాజంలో ఎక్కువమంది నిశ్శబ్దంగా ఉండడంవల్ల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. జనం చైతన్యంతో ప్రతిఘటించినప్పుడే, అరాచకాలు అరికట్టబడతాయని చెప్పారు‌‌. జనాన్ని చైతన్యవంతం చేసే బాధ్యత కవులు, రచయితలపై వుందన్నారు.  ఈ కార్యక్రమంలో అరసం, విరసం, దిగంబర, పైగంబర కవిత్వోద్యమాలపై కూలంకష చర్చజరిగింది. అరసం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అధ్యక్షుడు డా. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, తెలంగాణ అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ ప్రసంగించారు. అరసం ఆవిర్భావం, వికాసం గురించి డా. రాచపాళెం ప్రసంగించారు. అరసం అందరిదీ కాకున్నా, అత్యధికులకు సంబంధించిందని ఆన్నారు.‌ పేద, బడుగు వర్గాల అభ్యున్నతికోసం అరసం ఆవిర్భవించిందన్నారు. వేల్పుల నారాయణ మాట్లాడుతూ అరసం ఆవశ్యకతను, ఆచరణను వివరించారు.

దిగంబరకవిత్వ ఆవిర్భావ వికాసాలు, సిద్ధాంతాల గురించి నిఖిలేశ్వర్, నగ్నముని ప్రసంగించారు. దిగంబర కవిత్వం చారిత్రక అవసరంగా ఆవిర్భవించిందని, సాహిత్యంలో ఓ దశాబ్ది నిశ్శబ్దాన్ని పటాపంచలు చేసిందన్నారు. దిగంబరులు ఆరుగురు ఆరు రుతువుల్లా సమాజాన్ని ప్రభావితం చేశారన్నారు.‌ దిగంబరుల కవిత్వంలో అభివ్యక్తి, భాష గురించి వచ్చిన విమర్శల్ని ఆయన తిప్పి కొట్టారు‌. నాటి యువతలో జడత్వాన్ని వదిలించడానికి ఆ మాత్రం ట్రీట్మెంట్ తప్పలేదన్నారు. నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి.‌.లేపకు.. పీక నులిమి గోతిలోకి లాగుతాడు.. ప్రభందాంగనల తొడలు తాడి మొద్దులు తాకితే కాళ్ళు విరగ్గొట్టు.. కుచములు ఎవరూ ఎక్కని పర్వతాగ్రములు తలను ఢీకొని బద్దలు కొట్టు. భావకవుల నపుంసక హావభావాలకు సవాలు; అభ్యుదయ కవీ నల్ల మందు తిని నిద్రపోయావ్” అంటూ తన స్వీయ కవిత చదివి వినిపించారు. నిఖిలేశ్వర్.. ‌ఇందులో శృంగార మేంలేదని, నిద్రపోతున్న యువతను తట్టిలేపడానికి ఈ మోతాదులో వ్రాయాల్సి వచ్చిందన్నారు‌‌.

నిద్రపోతున్న తెలుగు సాహిత్యాన్ని (Telugu Literature) మేల్కొలపటంలో దిగంబర కవిత్వం పాత్ర తక్కువేం కాదని నగ్నముని అన్నారు. ‌‌దిగంబరకవిగా అరెస్ట్ అయి ప్రభుత్వోద్యోగాన్ని కూడా కోల్పాయనన్నారు. సిద్ధాంత ప్రాతిపదికనే జనచైతన్యం కోసం దిగంబరకవులు. కవిత్వం రాశారన్నారు‌‌. అభివ్యక్తిలో, భాషలో విమర్శలకు గురైనా…దిగంబర కవిత్వం నాటి సమాజంలో సంచలనం కలిగించిందన్నారు. పైగంబర కవి ఓల్గా మాట్లాడుతూ.. నాటి సాహిత్య, సామాజిక పరిస్థితులకు మేల్కొల్పుగా పైగంబర కవిత్వం ఆవిర్భవించిందన్నారు. పైగంబర కవులు మానవతకు పెద్దపీటవేశారని చెప్పారు.‌ మరో పైగంబరకవి కిరణ్ బాబు.‌.పైగంబర కవిత్వ ఆవిర్భావ వికాసాలను వివరంగా తెలియజేశారు.‌

“మేము పైగంబరులం

మాది ఒక తపస్సు

మా కవితా దీపికలు

విడదీస్తవి గాఢ తమస్సు

ప్రపంచం సమస్యల కీకారణ్యంలా వుంది

ఎటుచూసినా ఘోర నిబిడ నిశీథి

ఎటుపోయేందుకు దారి చూపదు”..

1970 నాటి సామాజిక పరిస్థితుల్ని చూసి, తట్టుకోలేక అయిదుగురు కవులు పైగంబరులుగా పేరుపెట్టుకొని కవిత్వం రాశారని కిరణ్ తెలిపారు. దేవిప్రియ, సుగమ్ బాబు, కమలాకర్, ఓల్గా తాను పంచపాండవుల్లా కవిత్వాయుధాలు పట్టి మానవత్వాన్ని తట్టి లేపేందుకు కలంపట్టామని చెప్పారు. విరసం తరపున అరసవిల్లికృష్ణ మాట్లాడారు. విరసం ఆవిర్భావ, వికాసాలను అరసవెల్లి వివరించారు. విరసం చారిత్రక అవసరంగా ఏర్పడిందన్నారు. సాహితీ విమర్శకులు ఎ.రజాహుస్సేన్ మాట్లాడుతూ పైగంబర కవిత్వంపై సాధికార విమర్శ పుస్తకం తేవడం తన అదృష్టమన్నారు. పైగంబర కవులతో, తన సాన్నిహిత్యాన్ని వివరించారు. దేవిప్రియ ఆత్మ కథ రాస్తానని ప్రకటించినా, ‌‌చివరకు రాయకుండానే దూరమయ్యారని అన్నారు.

ఈ కార్యక్రమంలో తానా (TANA) అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు (Niranjan Srungavarapu), తానా సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ (Chigurumalla Srinivas) శుభాకాంక్షలందజేశారు. ‌అమెరికామ్రేడ్స్ గా పిలువబడే లెనిన్ వేముల (Lenin Vemula), కిరణ్మయి గుంట (వేముల) అనంత్ మల్లవరపు (Ananth Mallavarapu) బృందం సందర్భోచితం గా పాటలు గానం చేసి, కవితా పఠనం చేశారు. కార్యక్రమం ఆసక్తికరంగా తెలుగు సాహిత్యం (Literary) లోని వివిధ ఉద్యమాల ఆవిర్భావం, ‌వికాసం, వాటి ఆనుపానులగురించి చక్కటి చర్చ జరిగింది.

error: NRI2NRI.COM copyright content is protected