Washington DC: అమెరికా రాజధాని వేదికగా ప్రవాస సంఘాలకు మాతృకగా నెలవై తెలుగు భాష, కళా, సాంస్కృతిక రంగాలలో యాభై సంవత్సరాల అద్వితీయ ప్రస్థానంతో.. ఇటీవల అంగ రంగ వైభవంగా స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకున్న ప్రవాస తెలుగు సంస్థ గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam) నూతన అధ్యక్షునిగా రవి అడుసుమిల్లి (Ravi Adusumilli), కార్యవర్గ సభ్యులు భాద్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా GWTCS అధ్యక్షులు రవి మాట్లాడుతూ.. ఎందరో పెద్దల, దాతల, సభ్యుల సహాయ, సహకారాలతో ఐదు దశాబ్దాలుగా సాగుతున్న ఈ సంస్థ ఔన్నత్యం, తెలుగు భాష, సాంస్కృతిక సేవా పధం ఇకపై కూడా నిరంతరంగా, ముఖ్యంగా నేటి తరం యువత ప్రాతినిధ్యంతో క్రీడలు, సేవా భావంతో, అనుభవజ్ఞులతో కూడిన సమున్నత వేదికను అందిస్తూ కొనసాగుతుందని తెలిపారు..
గతమెంతో ఘనకీర్తి కలిగిన ఈ సంస్థ తర తరాలకూ తెలుగు భాష, సంస్కృతీ, సాంప్రదాయ వారధిగా తెలుగు వారందరి ఆదరణ, ఆశీర్వాదంతో చిరకాలం నిలబెట్టుకోవటం మనందరి భాద్యత అన్నారు. పూర్వాధ్యక్షులు కృష్ణ లాం (Krishna Lam) మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచిపోయే విధంగా నభూతో అన్న రీతిన.. స్వర్ణోత్సవ వేడుకలను (Golden Jubilee Celebrations) నిర్వహించామని అన్నారు.
ఇందులో భాగంగా తమకు సహకరించిన దాతలకు, సభ్యులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఈనాడు ప్రపంచ వేదికపై తెలుగు వారు అన్ని రంగాలలో రాణిస్తున్నారని.. అయినా మాతృబాష, మాతృభూమి ఎల్లప్పుడూ మనకు ప్రత్యేకమని, ఆ స్ఫూర్తిని నూతన కార్యవర్గం కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు.. సంస్థ పూర్వాధ్యక్షులు జక్కంపూడి సుబ్బారాయుడు, త్రిలోక్ కంతేటి, కిషోర్ దంగేటి, సాయిసుధ పాలడుగు, తానా (TANA) ప్రతినిధులు నరేన్ కొడాలి (Naren Kodali), పలువురు సంస్థ సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.