Connect with us

News

మహాత్మా గాంధీ మెమోరియల్ ని సందర్శించిన రాము వెనిగండ్ల @ Irving, Texas

Published

on

Dallas, Texas: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నుండి అత్యధిక మెజారీటితో గుడివాడ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యునిగా ఎన్నికైన అట్లాంటా (Atlanta) కు చెందిన ప్రవాసాంధ్రుడు రాము వెనిగండ్ల తన గెలుపుకి సహకరించిన ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదములు తెల్పేందుకు డాలస్ (Dallas) నగరంలో ఆదివారం పర్యటించారు.

ఆ పర్యటనలో భాగంగా ముందుగా ఇర్వింగ్ (Irving, Texas) పట్టణంలో నెలకొనియున్న మహాత్మా గాంధీ మెమోరియల్ (Mahatma Gandhi Memorial of North Texas) ను సందర్శించడానికి విచ్చేసిన శాసనసభ సభ్యులు వెనిగండ్ల రాముకు మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల ఘనస్వాగతం పలికారు.

శాసనసభ్యుడు రాము బాపూజీకి పుష్పాంజలి ఘటించి, ఈ సందర్భంగా మాట్లాడుతూ – “ఎంతోకాలంగా ఈ మహత్మాగాంధీ మెమోరియల్ గురించి వింటున్నాను, కానీ ఇప్పటివరకు ఇక్కడికి రావడానికి వీలుపడలేదు. 2014లో స్థాపించబడ్డ ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ (Mahatma Gandhi Memorial of North Texas) అమెరికా దేశంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందదం, ఇప్పుడు 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషం.

ప్రాంతాలకు, పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా ప్రవాసభారతీయులందరూ ఐకమత్యంతో కలసి పనిచేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు అనేదానికి ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇది ఒక రోజులో నిర్మాణం కాలేదు, ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు, ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు అయిన డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) దూరదృష్టి, అధికారులను ఒప్పించేందుకు జరిపిన దాదాపు 5 సంవత్సరాల అవిరళ కృషితో ఇది సాధ్యం అయింది.

ఈ నిర్మాణంలో సహకరించిన బోర్డ్ సభ్యులు – రావు కల్వాల, మురళి వెన్నం (Murali Vennam), రాంకీ చేబ్రోలు, ఎంవిఎల్ ప్రసాద్, బి.ఎన్ రావు మొదలైన కార్యవర్గ సభ్యులందరికీ నా అభినందనలు” అన్నారు. మన భారతదేశం నుండి వివిధ పార్టీలకు చెందిన ఎందరో రాజకీయనాయకులు, ప్రముఖులు ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ ను సందర్శించి గాంధీజీకి నివాళులర్పించడం సంతోషించదగ్గ విషయం.

ప్రవాస భారతీయులందరికి ఇదొక ప్రధాన వేదిక కావడం ముదావహం అన్నారు. ప్రపంచమంతా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న ప్రస్తుత వాతావరణంలో మహాత్మా గాంధీ సిద్దాంతాలు, ఆశయాల గురించి లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. పరస్పర అవగాహన, గౌరవం, చర్చల ద్వారా ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్న శాంతి కాముకుడు గాంధీజీ ప్రపంచ మానవాళికి ఆదర్శం అన్నారు.

ప్రవాసభారతీయులగా స్థిరపడ్డ మీరందరూ మన మాతృదేశ అభివృద్ధికి మీకు వీలైంతవరకు తోడ్పడమని కోరుతున్నాను అన్నారు శాసనసభ సభ్యుడు రాము వెనిగండ్ల (Ramu Venigandla). ఈ పర్యటనలో రాము గెలుపుకు కృషిచేసిన వారు మిత్రులు అయిన తానా పూర్వాధ్యక్షులు లావు అంజయ్య చౌదరి (Anjaiah Chowdary Lavu), ఎంతోమంది రాము అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected