గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ (Gudivada) శాసనసభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముఖ్య కారణం కొడాలి నాని. మొదట తెలుగుదేశం పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన నాని, అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) లో చేరి అత్యంత హేయమైన మాటలు, చేతలతో తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా ఇబ్బందిగా తయారయ్యారు.
గత ఎలక్షన్స్ లో దేవినేని నెహ్రు (Devineni Nehru) కొడుకు అవినాష్ ని తెలుగుదేశం పార్టీ నుంచి పోటీకి దింపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో అందరూ ఈసడించుకొనేలా నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యులపై కూడా వ్యక్తిగత దూషణలకు దిగుతుండడంతో వచ్చే ఎలక్షన్స్ లో ఎలాగైనా కొడాలి నాని కి చెక్ పెట్టాలని చూస్తుంది టీడీపీ అధిష్టానం.
ఇందులో భాగంగా టీడీపీ అధిష్ఠానం పలువురి పేర్లు పరిశీలిస్తుండగా అందరి దృష్టిలో గుడివాడ పట్టణానికి చెందిన అమెరికాలోని అట్లాంటా నగర ఎన్నారై, ప్రముఖ పారిశ్రామికవేత్త వెనిగండ్ల రాము (Venigandla Ramu) పేరు పైకొచ్చింది. అంగబలం, అర్ధబలంతోపాటు సౌమ్యునిగా, హడావుడి ప్రచారాలకు దూరంగా ఉండే భూరి విరాళ ప్రధాత రాము గుడివాడ రాజకీయ యవనికపై మెరుపులా దూసుకువచ్చారు.
ఈ టెక్ దిగ్గజం ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ని పలుసార్లు కలిసినట్టు, చంద్రబాబు కూడా చూచాయగా మాట ఇచ్చి నియోజకవర్గంలో పనిచేయమన్నట్లు వినికిడి. ఇప్పటికే రాము కుటుంబ సభ్యులు గుడివాడలో చాపకింద నీరులా పనులు చక్కబెడుతున్నారు. వచ్చే క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు విస్తృతం చేయనున్నారు రాము.
అప్పటి నుంచి ఇక నియోజకవర్గంలోనే మకాం వేసి గెలుపు గుర్రానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ ను రాము అమలు చేయనున్నారు. బడుగు బలహీన వర్గాల్లో రాము కుటుంబానికి మంచి పట్టు ఉండడం, డబ్బుకు వెనకాడాల్సిన పని లేకపోవడం, కుల సమీకరణలు, అందరినీ కలుపుకుపోయే రాము వ్యక్తిత్వం వంటి వాటితో కొడాలి నాని (Kodali Nani) కి సరైన మొగుడు వెనిగండ్ల రాము నే అని ఇటు అట్లాంటా అటు గుడివాడలో చర్చించుకుంటున్నారు.
కొడాలి నాని తో విసిగి వేసారిపోయిన గుడివాడ ప్రజలు పక్కా క్లీన్ ఇమేజ్ తో ఎక్కడా ఇప్పటి వరకు ఒక మాట తూలడం గానీ లేక ఒకరి చేత మాట అనిపించుకోవడం గానీ లేనటువంటి వెనిగండ్ల రాము ముందుకు రావడాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇదే విషయంపై అట్లాంటా వాసులు, అలాగే యావత్ అమెరికా తెలుగువారు పార్టీలకతీతంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.