Connect with us

Service Activities

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ లో రాజా కసుకుర్తి సేవాకార్యక్రమాలు: TANA Chaitanya Sravanthi

Published

on

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ లో రాజా కసుకుర్తి స్పాన్సర్ గా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 21న నిర్వహించిన పలు సేవాకార్యక్రమాలు విజయవంతమయ్యాయి. స్థానిక పాలశీతలీకరణ కేంద్రంలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌తో సంయుక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు.

నేత్ర వైద్య శిబిరంలో 700 మందికి పైగా కంటి పరీక్షలను నిర్వహించి, 325 మందికి పైగా కళ్లజోళ్లు అందించారు. అలాగే 125 మందికి పైగా కేటరాక్ట్ ఆపరేషన్లు చేయనున్నారు. పెద్ద ఎత్తున జనాలు రావడం, కొంతమంది వెనుదిరిగి వెళ్లడంతో వారి కోసం ప్రత్యేకంగా జనవరిలో మరో శిబిరాన్ని నిర్వహించనున్నారు. రైతులకు గడ్డి కత్తిరించు యంత్రాలను 100కు పైగా పంపిణీ చేశారు. రైతుల కోసం 100 రక్షణ పరికరాలను అందజేశారు.

ఈ సందర్భంగా తానా నాయకులతోపాటు స్థానిక రైతు నెక్కంటి సుబ్బారావును సన్మానించారు. చైతన్య స్రవంతి కార్యక్రమాలలో భాగంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి తోపాటు ముఖ్య అతిధిగా రాము వెనిగండ్ల, చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌ సునీల్‌ పంత్ర, కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ రాజా కసుకుర్తి, కృష్ణా మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. తామంతా రైతు బిడ్డలమేనని తమ తల్లితండ్రులు వ్యవసాయం చేస్తున్నప్పుడు పడిన కష్టాలు తమకు ఇంకా గుర్తుందని రైతు కష్టంతో తామంతా చదివి ఇప్పుడు అమెరికాలో ఉన్నప్పటికీ రైతులకు ఏదైనా మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో తానా తరపున రైతుకోసం పలు కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు.

జిల్లాలో పాడిపరిశ్రమను నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రస్తుతం గడ్డిని పండించే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోవడం బాధగా ఉందని అంటూ, రైతులకు గడ్డి కోసే యంత్రాలను అందించడం ద్వారా వారి కష్టాలను తగ్గించే ప్రయత్నాన్ని తానా తరపున చేస్తున్నామని చెప్పారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి రైతులంతా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి కృష్ణా మిల్క్‌ యూనియన్‌ బాగా పనిచేస్తోందని ప్రశంసించారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ రాజా కసుకుర్తి మాట్లాడుతూ.. తామంతా రైతులు పడిన కష్టాలను స్వయంగా చూసినవారమని, మా నాన్న వ్యవసాయం చేసినప్పుడు పడ్డ కష్టం, మా అమ్మ పాలు అమ్మి మమ్మల్ని చదివించిన సంగతిని గుర్తు చేసుకున్నారు.

జిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధికి, రైతు బాగుకోసం తామంతా కృషి చేస్తున్నామని, తానా తరపున రైతు సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మదర్స్‌ డెయిరీకి పాలు అమ్మితే  ఆ డబ్బులు గుజరాత్‌కు వెళ్తాయని, అదే మన కృష్ణాజిల్లా మిల్క్‌ యూనియన్‌కు అమ్మితే ఆ డబ్బులు మనకే ఉపయోగపడుతాయని చెప్పారు.

కృష్ణా జిల్లా మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడినా రైతు కుటుంబానికి చెందిన వీళ్ళంతా ఇక్కడకు వచ్చి రైతులకు సహాయం అందించడం ఎంతో ప్రశంసనీయమైన విషయమని చెప్పారు. వారికి కూడా మనవంతు సహకారాన్ని అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తానా నాయకులు శశికాంత్‌ వల్లేపల్లి, సతీష్‌ వేమూరి, పురుషోత్తమ చౌదరి గుడే, శశాంక్‌ యార్లగడ్డ, రఘు ఎదులపల్లి, వెంకట రమణ గన్నె, ఠాగూర్‌ మల్లినేని, శ్రీనివాస్‌ కూకట్ల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, ప్రశాంత్‌ కాట్రగడ్డ, విష్ణు దోనెపూడి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected