ఆరోగ్యరీత్యా వైట్ రైస్ కి బదులు బ్రౌన్ రైస్ లేదా చపాతీలు తినడం మనకు తెలిసిన విషయమే. ఐతే ఈ మధ్య కాలంలో బ్రౌన్ రైస్ (ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం) కి బదులు కీన్వా (కినోవా) తింటున్నారట మన ప్రవాస భారతీయులు. మాములుగా దీర్ఘకాలిక నొప్పులు లేదా షుగర్ కంట్రోల్ చేద్దామనుకునేవాళ్లకు తృణ ధాన్యాలు (హోల్ గ్రైన్స్) ఎక్కువగా ఉన్న ఆహారపదార్ధాలు మంచిది. బ్రౌన్ రైస్ మరియు కీన్వా లు కేలరీలు, కార్బోహైడ్రాట్స్ పరంగా దాదాపుగా సమానమైనప్పటికీ ఫైబర్, మినరల్స్ మరియు ప్రొటీన్ల పరంగా కీన్వా నే మేలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గడానికి, మితంగా తినడానికి మరియు రుచిపరంగా కూడా కీన్వా నే కాస్త నయం. మన దైనందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగాలతో ఎక్కువగా కూర్చోవడం, వ్యాయామం చెయ్యకపోవడం, అధిక పని ఒత్తిడి తదితర కారణాల వాళ్ళ బీపీ, షుగర్ ఎప్పుడు వద్దామా అని ఎదురు చూస్తుంటాయి. కాబట్టి కీన్వా తదితర పోషక విలువలున్న ఆహారాన్ని ఎన్నుకుంటున్నారేమో మన ప్రవాస భారతీయులు. ఎంతైనా ఆరోగ్యమే మహాభాగ్యం కదా!