ఈ రోజుల్లో అన్ని దానాల్లో కల్లా విద్యా దానం గొప్పది అంటారు. ఎందుకంటే బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే పరపతి, డబ్బు తర్వాత అవే వస్తాయి. అందుకనే రెండు తెలుగు రాష్ట్రాలలోని పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు ఉపకార వేతనాల ద్వారా తోడ్పాటు అందిస్తున్నారు వల్లేపల్లి కుటుంబ సభ్యులు.
వివరాలలోకి వెళితే, ప్రముఖ క్వాలిటీ మాట్రిక్స్ గ్రూప్ (Quality Matrix Group) అధినేతలు శశికాంత్ వల్లేపల్లి మరియు ప్రియాంక వల్లేపల్లి మరొక్కసారి తమ ఉదారతను చాటుకున్నారు. అక్టోబర్ 14 శుక్రవారం రోజున కృష్ణా జిల్లా, పామర్రులో ముప్పై మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శశికాంత్ వల్లేపల్లి ప్రసంగిస్తూ వల్లేపల్లి సీతారామ్మోహన్ రావు (Vallepalli Sita Rama Mohana Rao, Gudivada) గారి జ్ఞాపకార్ధం 30 మందికి ఉపకార వేతనాలు అందించామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్ల కుమార్ రాజా లబ్దిదారులను ఒక పద్దతి ప్రకారం ఎంపిక చేశారు.
ఈ ఉపకార వేతనాలకు ఎంపికైన వారిలో కోవిడ్ మరియు రోడ్డు ప్రమాదాల కారణంగా తల్లితండ్రులను కోల్పోయిన అభాగ్యులు, పాముకాటు మరియు విద్యుత్ ప్రమాదాలకు గురైన విద్యార్థులు, అనారోగ్య రీత్యా ఇబ్బందులను ఎదుర్కొంటున్న పలువురు విద్యార్థులు ఉన్నారు.
ఇలా రకరకాల ఇబ్బందులతో అన్ని విధాలా ఆర్ధిక సహకారం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనాల (Scholarships) ద్వారా సహాయం చేయడం అభినందనీయం అంటూ గుడివాడ, పామర్రు వాసులు వల్లేపల్లి కుటుంబాన్ని కొనియాడారు.