యూరోపియన్ యూనియన్ లో వేగం గా అభివృద్ధి చెందుతున్న పోలాండ్ దేశంలో తెలుగు వారి కోసం మొట్టమొదటి అసోసియేషన్ ప్రారంభం అయ్యింది. పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA – Poland Telugu Association) అనే లాభాపేక్ష లేని ఈ సంస్థ ప్రారంభోత్సవం పోలాండ్ రాజధాని నగరం వార్సా లోని Airport Hotel Okęcie lo ఘనంగా జరిగింది.
దీనితో పోలాండ్ లోని షుమారు ఐదువేల మంది తెలుగు వారి చిరకాల కోరిక నెరవేరింది. గత రెండు సంవత్సరాలుగా ఎక్కువ సంఖ్యలో తెలుగు వారు విద్య, ఉపాధి అవకాశాలు కోసం పోలాండ్ వస్తూ ఉండటాన్ని గమనించి, తెలుగు వారి కోసం ఒక సంస్థ ఉండాలని భావించారు PoTA వ్యవస్థాపకులు రావ్ మద్దుకూరి, హరిచంద్ కాట్రగడ్డ, విజయ్ మోహన్, మరియు చంద్రభాను అక్కల.
భారీ జనసందోహం నడుమ Poland Telugu Association (PoTA) ప్రారంభోత్సవ వేడుకలు మార్చ్ 26వ తేదీన ఘనంగా జరిగాయి. తెలుగు వారి కోసం పోలాండ్ లో మొట్టమొదటి సారిగా జరిగిన ఈ వేడుకలకు పోలాండ్ నలుమూలల నుంచి తెలుగు వారు తరలి వచ్చారు. వచ్చిన అతిథులకు వినోదాన్ని అందించేలా సాంస్కృతిక కార్యక్రమాలు, అసౌకర్యం లేకుండా భారీ ఏర్పాట్లు, కమ్మటి తెలుగు భోజనం, ఉగాది పచ్చడితో ఈ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది.
ఈ సందర్భంగా PoTA కార్యవర్గ ప్రకటన జరిగింది. మొదటి అధ్యక్షుడుగా అక్కల చంద్రభాను, ఉపాధ్యక్షురాలుగా శోభా కిరణ్, కోశాధికారిగా దిలీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యులుగా మధుమతి, శ్రీనివాస్, ప్రకాష్, రాజశేఖర్, హనుమంత రావు, శైలేంద్ర, ప్రవీణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పోలాండ్ లోని ప్రముఖ ఇండియన్ గ్రాసరీస్ సంస్థ లిటిల్ ఇండియా, ఉషోదయ గ్రూప్ కి చెందిన ప్రియా ఫుడ్స్ సమర్పకులుగా వ్యవహరించారు.