పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) వారి ఆధ్వర్యంలో అక్టోబర్ 12 (శనివారం), 2024 న వార్సా (Warsaw) నగరంలో మరియు అక్టోబర్ 13 (ఆదివారం), 2024 న క్రాకావ్ (Krakow) నగరంలో బతుకమ్మ మరియు దసరా పండుగలను ఎంతో వైభవంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ వేడుకలు స్థానిక తెలుగు సాంస్కృతిక ఉత్సవాల పరంపరలో అతి ముఖ్యమైనవి. PoTA సభ్యులు మరియు తెలుగు వారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పండుగలను ఘనంగా జరిపారు.
వార్సాలో జరిగిన వేడుకలు
అక్టోబర్ 12 (శనివారం), న వార్సా (Warsaw) లో జరిగిన బతుకమ్మ మరియు దసరా వేడుకలను ప్రత్యేకంగా PoTA “SHE” టీం (నారీమహిళామణులు) నిర్వహించారు. వారు ఈ కార్యక్రమం కోసం ముందే ఏర్పాట్లు చేయడం, నిర్వాహణలో కీలక పాత్ర వహించడం జరిగింది. మహిళలు అందరూ సంప్రదాయ వస్త్రధారణలో అద్భుతంగా మెరిసిపోతూ, తెలుగువారి సంప్రదాయాన్ని ప్రతిబింబించారు.
బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను అందంగా పేర్చి ఆడబడే పండుగ. వార్సాలో జరిగిన బతుకమ్మ (Bathukamma) వేడుకల్లో స్త్రీలు, పిల్లలు, యువతీ యువకులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అందమైన పూలతో రూపొందించిన బతుకమ్మలను మధ్యలో ఉంచి, స్త్రీలు బతుకమ్మ పాటలు పాడుతూ వలయాకారంలో చక్కగా తిరుగుతూ సాంప్రదాయ బతుకమ్మ ఆటను ఆడారు.
హిందూ భవన్ (Hindu Bhavan) ప్రాంగణం మొత్తం ఈ సందడి కార్యక్రమంతో కళకళలాడింది. బతుకమ్మ పాటలలో తెలుగువారి సాంప్రదాయం, ప్రకృతి అందాలు ఉట్టిపడాయి. దసరా అనేది చెడుపై మంచి గెలిచిన విజయానికి ప్రతీక. హిందూ సాంప్రదాయంలో, దసరా పండుగను చెడు శక్తులపై మంచి శక్తులు సాధించిన విజయోత్సవంగా పరిగణిస్తారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా రావణ దహనం నిర్వహించారు. రావణుడి ప్రతికృతిని సృష్టించి, దాన్ని దహనం చేయడం ద్వారా చెడు శక్తులు నశిస్తాయని, మంచి శ్రేయస్సు మరియు శాంతి చేకూరుతుందని నమ్ముతారు. వార్సా (Warsaw) లో, దసరా వేడుకల్లో PoTA “SHE” టీం (నారీమహిళామణులు) మరియు చిన్నారులు రావణుడి ప్రతీకను తయారు చేసి, దాన్ని దహనం చేశారు.
పోలాండ్ తెలుగు అసోసియేషన్ (Poland Telugu Association – PoTA) నిర్వహించిన ఈ కార్యక్రమం వారిలో మంచి – చెడు గుణాల గురించి అవగాహన కలిగించే ప్రయత్నంగా నిలిచింది. ఇది వారికి ఒక విద్యా కార్యక్రమంలా నిలిచింది, ఎందుకంటే రావణ దహనం పైనున్న ప్రతీకాత్మకతను వివరిస్తూ, చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుచేశారు.
క్రాకావ్ లోని వేడుకలు
అక్టోబర్ 13న క్రాకావ్ (Krakow) నగరంలో కూడా బతుకమ్మ పండుగకు సంబంధించి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. క్రాకావ్ (Krakow) చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ సుమన్ గారి ఆధ్వర్యంలో, క్రాకోవ్ (Krakow) నగరంలోని తెలుగు వారందరూ ఈ దసరా మరియు బతుకమ్మ వేడుకలను ఎంతో ఉత్సాహంతో, సమైక్యంగా జరుపుకున్నారు.
ఈ వేడుకలలో చిన్నపిల్లల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బతుకమ్మ ఆటలో స్త్రీలు, పిల్లలు, యువతీ యువకులు అందరూ పాల్గొని, పూలతో రూపొందించిన బతుకమ్మను వలయాకారంలో ఉంచి, సాంప్రదాయ బతుకమ్మ (Bathukamma) పాటలు పాడుతూ సందడిని సృష్టించారు. సుమన్ గారి నాయకత్వంలో వారి టీమ్, క్రాకావ్ లోని తెలుగు ప్రజలందరూ సమిస్టిగా కలిసి ఈ పండుగలను అత్యంత ఘనంగా నిర్వహించడం గర్వించ దగ్గ విషయం.
వేడుకల విజయానికి కారణమైన PoTA కోర్ కొమిటీ
ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి ఎంతో కృషి చేసిన వారందరికీ ప్రత్యేకంగా PoTA ప్రెసిడెంట్ చంద్రభాను (Chandra Bhanu Akkala) గారు ధన్యవాదాలు తెలియజేశారు. SHE టీం, క్రాకావ్ (Krakow) చాప్టర్ కోర్ కమిటీ సభ్యులు, మరియు మరెందరో స్వచ్ఛంద సేవకులు ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ఎంతో కృషి చేశారు. సామూహిక సంఘీభావం, ఉత్సాహం, సమ్మిళిత కృషి ఈ వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చాయి.