Connect with us

Associations

శుభకృతంగా తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ ఉగాది & శ్రీరామనవమి వేడుకలు

Published

on

తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ ‘టి.ఎల్.సి.ఎ’ ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలు శుభకృతంగా నిర్వహించారు. అధ్యక్షులు జయప్రకాశ్ ఇంజపూరి మరియు చైర్మన్ కృష్ణ మద్దిపట్ల ఆధ్వర్యంలో ఏప్రిల్ 9 శనివారం రోజున అశేష తెలుగు ఆహుతుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వహించారు.

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం పేరుకు తగ్గట్టుగానే మన తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను మైమరిపిస్తూ ఇటు శాస్త్రోక్తంగా అటు వినోదాత్మకంగా ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలు సాగాయి. మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఆద్యంతం ఆహ్లాదంగా నిర్వహించిన ఈ వేడుకలకు న్యూయార్క్, ఫ్లషింగ్‌ లోని స్థానిక హిందూ టెంపుల్‌ సొసైటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా వేదికయింది.

ముందుగా టి.ఎల్.సి.ఎ గోల్డెన్‌ జూబ్లి వేడుకలకోసం ప్రత్యేకంగా రూపొందించిన స్వాగత గీతంతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీరామనవమి వేడుకలు మొదలయ్యాయి. అనంతరం స్థానిక చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ పాటలకు నృత్యాలు, అలాగే కూచిపూడి మరియు భరతనాట్యం నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

తదనంతరం టి.ఎల్.సి.ఎ కార్యవర్గం పెద్దలను, గత కార్యవర్గ సభ్యులను, స్పాన్సర్స్ ను, కళాకారులను శాలువా మరియు మెమెంటోతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భగా అధ్యక్షులు జయప్రకాశ్ ఇంజపూరి మాట్లాడుతూ టి.ఎల్.సి.ఎ నిర్వహిస్తున్న భాష, సాంస్కృతిక, కళ, సేవా కార్యక్రమాలను అందరికీ వివరించారు. అలాగే ఎందరో మహానుభావులు నడిపించిన టి.ఎల్.సి.ఎ సంస్థకు 51వ అధ్యక్షునిగా సేవలందించడం తన అదృష్టమని, అందరి సహకారంతో సంస్థను మరింత సేవాతత్పరతతో ముందుకు నడిపిస్తానన్నారు.

స్థానిక ప్రభుత్వ ప్రతినిధి ఒక ప్రొక్లమేషన్ జయప్రకాశ్ ఇంజపూరి కి అందజేయడం విశేషం. ఉగాది పండుగ విందు భోజనం అందునా గుడిలో అవడంతో ఆహుతులందరి జిహ్వ చాపల్యాన్ని తీర్చాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వేడుకల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో బూత్ అందరినీ ఆకర్షించడంతో అందరూ తమ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఫోటోలు దిగుతూ కనిపించారు.

న్యూయార్క్, న్యూ జెర్సీ మరియు కనెక్టికట్ ప్రాంతాల నుండి తెలుగువారు విరివిగా ఈ వేడుకలలో పాల్గొనడం విశేషం. వీరిలో మద్దిపట్ల ఫౌండేషన్ వారి రాఫుల్ బహుమతులు గెలుచుకున్నవారు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇక లెజెండరీ సంగీత దర్శకులు కోటి ప్రత్యక్ష సంగీత కచేరీ అన్నిటికంటే హైలైట్.

సంగీత దర్శకులు కోటి తోపాటు ప్రముఖ గాయనీగాయకులు సుమంగళి, అంజనాసౌమ్య, శ్రీకాంత్ సండుగు, ప్రసాద్ సింహాద్రి, ఎం లైవ్ బ్యాండ్ మెహర్ చంటి పాత, కొత్త వినసొంపైన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. వ్యాఖ్యాత సాహిత్య వింజమూరి మంచి టైమింగ్ తో కూడిన వ్యాఖ్యానంతో అందరినీ అలరించింది.

మొత్తానికి కోటి బృందం లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ సెట్ ది ఫైర్ ఆన్ స్టేజ్ అనేలా వీనులవిందుగా సాగింది. కొంతమంది వేదికపైకి వెళ్లి మరీ డాన్సులు వెయ్యడం చూస్తే టి.ఎల్.సి.ఎ వారి ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలు ఎంతటి ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని పంచాయో అర్ధం అవుతుంది.

వారాంతంలో మన సంస్కృతీ సంప్రదాయాలతోపాటు చక్కని ఎంటర్టైన్మెంట్ ని అందించిన టి.ఎల్.సి.ఎ 2022 కార్యవర్గాన్ని అందరూ ప్రత్యేకంగా అభినందించారు. చివరిగా ప్రేక్షకులకు, స్పాన్సర్లకు, వాలంటీర్లకు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శకులకు టి.ఎల్.సి.ఎ కార్యవర్గం ధన్యవాదాలు తెలిపి వందన సమర్పణతో వేడుకలను విజయవంతంగా ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected