Connect with us

Literary

Melissa, Texas: ప్రముఖుల నడుమ ఘనంగా NVL Memorial Telugu Library ప్రథమ వార్షికోత్సవం

Published

on

Melissa, Texas: అమెరికా లో టెక్సాస్ రాష్ట్రంలోని మెలిస్సా నగరంలో స్థాపించబడిన శ్రీ ఎన్‌.వి‌.ఎల్‌ స్మారక తెలుగు గ్రంథాలయం (NVL Memorial Telugu Library) తన ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. శ్రీ నలజల నాగరాజు గారు తన తండ్రి శ్రీ నలజల వెంకటేశ్వర్లు గారి స్మారకార్థంగా ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు.

ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే శ్రీ ఎన్‌.వి‌.ఎల్‌ స్మారక తెలుగు గ్రంథాలయం (Library) తెలుగు పుస్తక ప్రేమికులకు, సాహిత్యాభిమానులకు ఎంతో చేరువైంది. మొదటి వార్షికోత్సవ వేడుకకు తెలుగు సమాజంలోని అనేక ప్రముఖులు హాజరై ఈ గ్రంథాలయ పాత్రను విశేషంగా కొనియాడారు.

ఈ కార్యక్రమానికి గోపాల్ పోనంగి (శుభం ఫౌండేషన్), సురేష్ మండువ (FISD బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు), మల్లి వేమన  (TANA బోర్డ్ ఆఫ్ ట్రస్టీ), అనంత్ మల్లవరపు (సాహితీవేత్త), చంద్రహాస్ (రచయిత మరియు భాషాభిమాని), విజయ్ తొడుపునూరి (శుభం ఫౌండేషన్), మిమిక్రీ రమేశ్ (కళారంగ ప్రముఖుడు).

బాపు నూతి (NATS పూర్వ అధ్యక్షులు మరియు BOD), రవి తాండ్ర (NATS జాయింట్ ట్రెజరర్) మరియు కిషోర్ నారె (NATS) తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంలో మాట్లాడిన అతిథులు, శ్రీ నలజల వెంకటేశ్వర్లు గారి జీవిత స్ఫూర్తిని స్మరించుకుంటూ, ఆయన కుమారుడు శ్రీ నలజల నాగరాజు గారు తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న సేవలను విశేషంగా ప్రశంసించారు.

గోపాల్ పోనంగి (Gopal Ponangi) మాట్లాడుతూ, “తెలుగు భాషను వ్యాప్తి  చేయడంలో ఈ గ్రంథాలయం కీలక పాత్ర పోషిస్తోంది” అని పేర్కొన్నారు. సురేష్ మండువ  “పుస్తకాల పఠనం విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంచి, వారిని భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దుతుంది” అని అన్నారు. మల్లి వేమన “డల్లాస్ ప్రాంతంలోని తెలుగువారికి ఇది ఒక సాంస్కృతిక కేంద్రం” అని కొనియాడారు.

అనంత్ మల్లవరపు, చంద్రహాస్ వంటి సాహిత్య ప్రముఖులు మాట్లాడుతూ, “తెలుగు పుస్తకాలు మన సంస్కృతి మూలాలను తదుపరి తరాలకు చేరవేసే వంతెన. ఈ గ్రంథాలయం ఆ బాధ్యతను ఎంతో సమర్థంగా నిర్వర్తిస్తోంది” అని అభిప్రాయపడ్డారు. అలాగే NATS నాయకులు బాపు నూతి మరియు రవి తాండ్ర మాట్లాడుతూ, భవిష్యత్తులో ఈ గ్రంథాలయం మరింత విస్తరించడానికి తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని తెలియజేశారు. 

ప్రముఖ కళాకారులు మిమిక్రీ రమేష్ (Mimicry Ramesh) తన మిమిక్రీ తో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమానికి నాట్స్ నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె వాఖ్యాత గా వ్యవహరించారు. గ్రంథాలయ స్థాపకులు నలజల నాగరాజు (Nalajala Nagaraju) గారు “ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించడానికి నాకు ప్రేరణ నా తండ్రి నలజల వెంకటేశ్వర్లు గారు.

ఆయన పుస్తకాలపై ఉన్న ప్రేమను దేశాంతరాలలో ఉన్న తెలుగువారికి చేరవేయడమే నా సంకల్పం. ఈ గ్రంథాలయం ద్వారా పుస్తక సంస్కృతిని పునరుద్ధరించి, తెలుగు భాషను భవిష్యత్ తరాలకు అందించటం నా ధ్యేయం” అని అన్నారు. ఈ గ్రంథాలయానికి మరియు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలకు (Service Activities) ఆది నుండి సంపూర్ణ మద్దత్తు అందిస్తున్న శుభం ఫౌండేషన్ సంస్థకు, సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పిల్లలందరికీ పలకలు, బలపాలు, పుస్తకాలు పంచారు. కార్యక్రమం ముగింపులో, అందరు కలిసి ఈ గ్రంథాలయాన్ని (Library) మరింత అభివృద్ధి చేసేందుకు, పిల్లలు మరియు యువతలో తెలుగు పఠన అలవాటును పెంపొందించేందుకు అనేక కొత్త కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు.

error: NRI2NRI.COM copyright content is protected