“నార్వే, వీధి అరుగు” ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా 100 కి పైగా తెలుగు సాహిత్య సాంస్కతిక సంస్థల భాగస్వామ్యముతో నిర్వహించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కీ. శే. నందమూరి తారకరామారావు గారి శతవసంతోత్సవాలు ఎన్టీఆర్ గారిని ఒక ప్రత్యేకమైన రీతిలో గుర్తుచేసుకునే విధంగా అపూర్వముగా 27 మే 2023 నాడు అద్భుతంగా జరిగాయి.
వందకు పైగా తెలుగు సంఘాలు పరిచయమైన ఈ వేదిక అనేక నక్షత్రాలను కలిపిన పాలపుంతలా తోచిందని పలువురు అభిప్రాయ పడ్డారు. ఎన్టీఆర్ గారికి అంజలి ఘటిస్తూ ఘనంగా జరుపుకున్న “శకపురుషుని శతవసంతాలు” కార్యక్రమంని ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ఇప్పటివరకు 30 వేల మందికి పైగా వీక్షించారు.
ముఖ్య అతిథులుగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు మాన్యశ్రీ వెంకయ్యనాయుడు ముప్పవరపు గారు విచ్చేసి అందరికి శుభాశీస్సులు అందించారు . భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ “విలువలతో కూడిన రాజకీయాలకు నిజమైన నిర్వచనం ఎన్టీఆర్ అనీ, ఆయన వ్యక్తిత్వం భావితరాలకు మార్గదర్శనం అని దివంగత ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.
తెలుగు భాష పరిరక్షణకు ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ పునరంకితం కావాలని వారు పిలుపునిచ్చారు. తెలుగు వారి హృదయాలపై చెరగని ముద్ర వేసిన శ్రీ నందమూరి తారకరామారావు గారి శతజయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలు తెలుగు సంఘాలు భాగస్వామ్యం వహించటం అభినందనీయమని, ఎన్టీఆర్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఉన్న ఎల్లలు లేని అభిమానానికి ఇది నిదర్శమన్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిధిగా వచ్చిన రామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు మాట్లాడుతూ అద్భుతమైన ఈ కార్యక్రమం నిర్వహించినందుకు, వారిని కూడా ఇందులో భాగం చేసినందుకుగాను హర్షం వ్యక్తం చేశారు.
ప్రముఖ చలనచిత్ర నటుడు శ్రీ మాగంటి మురళీమోహన్, ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ చలసాని అశ్వనీదత్త్, శ్రీమతి నారా బ్రాహ్మణి, శ్రీ కె. లక్ష్మీనారాయణ, డా. విజయభాస్కర్ దీర్ఘాశి, శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ, డా. శంకర నారాయణ తదితర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.
వీధిఅరుగు ఆధ్వర్యంలో కార్యక్రమం మొదలు పెట్టినప్పటికీ, 40 దేశాల నుండి తెలుగుసంస్థలు అందించిన సహాకారం వెలకట్టలేనిది. ముఖ్యంగా, వివిధసంస్థల నుంచి అనేక మంది చిన్నారులు, పెద్దలు ఎన్టీఆర్ గారు నటించిన సినిమాల నుండి పద్యాలు, పాటలు, నృత్యాలు చేసి కార్యక్రమం అద్భుతంగా రావడంలో పెద్ద పాత్ర పోషించారు.
అంతర్జాలంలో అంతర్జాతీయంగా 14 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఎన్టీఆర్ గారి గొప్పతనాన్ని ముందు తరాలకు తెలియజేసేందుకు ఒక వారధి కాగలదని వీధిఅరుగు వ్యవస్థాపకులు శ్రీ వెంకట్ తరిగోపుల తెలియచేసారు.
ఈ కార్యక్రమం సమన్వయకర్తలుగా వ్యవహరించినవారు శ్రీ సుధాకర్ రావు కుదరవల్లి, శ్రీ విక్రమ్ సుఖవాసి, శ్రీమతి పావని రాగిపాని, శ్రీ నవీన్ సామ్రాట్ జలగడుగు, శ్రీ లక్ష్మణ్ వెన్నెపురెడ్డి, శ్రీ వై. భార్గవ్, శ్రీమతి లక్ష్మి రాయవరపు, శ్రీమతి శిరీష తూనుగుంట్ల, శ్రీ రాజగోపాల్ మోహన్ ఆరేటి, శ్రీ అశోక్ కుమార్ పారా.
ఈ కార్యమానికి తోడ్పాటు అందించిన ప్రసార మధ్యమ సంస్థలకు, మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. చరిత్ర పుటల్లో నందమూరి తారక రామారావు పేరు స్వర్ణాక్షరాలతో నిలిపోయేలా అపూర్వమైన అద్భుతమైన “శకపురుషుని శతవసంతాలు” అంతర్జాల కార్యక్రమాన్ని సంకల్పించి అందరికీ భాగస్వామ్యం కల్పించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వెంకట్ తరిగోపుల గారికి, అలుపెరగకుండా పనిచేసిన ఆయన బృందానికి వివిధ సంస్థల అధినేతలు అభినందనలు తెలియజేశారు.