వాషింగ్టన్ రాష్ట్రం, సియాటిల్ నగరంలో ఏప్రిల్ 23న నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సంవత్సరమును పురస్కరించుకుని ఎన్టీఆర్ శతజయంతి మరియు మహానాడు ఉత్సవాలను సియాటిల్ (Seattle) నగరంలో తెలుగువారందరితో కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది తెలుగువారు పాల్గొని ఎన్టీఆర్ మరియు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్నారై టీడీపీ అమెరికా కోఆర్డినేటర్ జయరాం కోమటి (Jayaram Komati) మంగళ వాయిద్యాలతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన నుంచి విముక్తి కల్పించి, భావితరాల భవిష్యత్తు కోసం తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకు రావాల్సిన ఆవశ్యకతను ఆయన తెలియజేశారు. ఎన్టీఆర్ తెలుగు జాతి చైతన్య స్ఫూర్తికి, అభ్యుదయానికి పాటుపడిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని వక్తలు కొనియాడారు.
అంతేకాకుండా, ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, తీసుకొచ్చిన రాజకీయ, పాలనా సంస్కరణలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులు గోపి కంచేటి ఎన్టీఆర్ డైలాగులు, పాటలు పాడి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాతృష్ణ కలిగిన అనేక కళాకారులు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించి అక్కడ సమూహాన్ని ఆనందపరిచారు.
ముఖ్యంగా స్మిత డాన్స్ స్కూల్ వారు చిన్నారులతో చేయించిన విఘ్నేశ్వర ప్రార్ధన నృత్యం, సతీష్ దర్భ చేసిన ఎన్టీఆర్ (NTR) పాటల నృత్యకేళి, రవి దసిక చేసిన ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ లోని దుర్యోధన పాత్రాభినయం అక్కడ తెలుగువారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో మొదటగా ఎన్టీఆర్ భారతరత్న (Bharat Ratna) డిమాండు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత సియాటిల్ ఎన్నారై టీడీపీ కమిటీ సభ్యులు శ్రీనివాస్ అబ్బూరి, సంగీత దొంతినేని, జీవన్ నారా, రమేష్ చుండ్రు, రీనా రెడ్డి, హరిబాబు కామిశెట్టి, వేణు జోగుపర్తి, మనోజ్ లింగ, హేమంత్ మొవ్వ తదితరులు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, తీర్మానాలు రూపంలో ప్రవేశపెట్టి, అక్కడ మన తెలుగువారికి తెలుగుదేశం యొక్క విధి విధానాలను తెలియపరిచారు.
అన్ని తీర్మానాలను అతిథులందరూ హర్షద్వానాల ద్వారా ఏకగ్రీవంగా బలపరిచారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్స్ మరియు పార్టీ కార్యకర్తలకు ఎన్నారై టీడీపీ సియాటిల్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి (Srinivas Abburi) ధన్యవాదాలు తెలియజేశి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.