Published
2 years agoon
By
NRI2NRI.COMశతవసంతాల యుగపురుషుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. రాజకీయాలకతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 1500 మంది పాల్గొని తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ ని స్మరించుకొని ఆయనకు ఘన నివాళులర్పించారు.
ఇందులో ప్రవాస ఆంధ్రులు సాంస్కృతిక కార్యక్రమాలు, NTR డాన్సులు, ఏకపాత్రాభినయాలు ప్రదర్శించడంతోపాటు వారే ఎన్టీఆర్ మీద కవితలు రచించి వాటిని ఆహుతులను అబ్బురపరిచారు. ఈ శతజయంతి ఉత్సవాలకు సినిమా రంగం నుంచి ప్రముఖ దర్శకులు వైవిఎస్ చౌదరి, నటులు నాగినీడు హాజరుకాగా రాజకీయ రంగం నుంచి టి డి జనార్దన్, పరిటాల శ్రీరామ్, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్ హాజరయ్యారు.
ఐపీఎస్ ఆఫీసర్ మరియు మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏ బి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరవటం కోసమెరుపు. అలానే ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రికెట్, వాలీబాల్ మరియు టెన్నికాయిట్ క్రీడా విజేతలకు ఎన్టీఆర్ ట్రోఫీలను బహుకరించడం జరిగింది.
ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రసాద్ పాపుదేశి, చందు నంగినేని, రాహుల్ వాసిరెడ్డి , వెంకట్ ఆళ్ల మాట్లాడుతూ తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన నందమూరి తారకరామారావుగారి శతజయంతి ఉత్సవాలను జరపటం తమ బాధ్యత అని దీనికి సహకరించిన అన్ని తెలుగు సంఘాల వారికి, మరియు మార్గదర్శకం చేసిన శరత్ కామినేనికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ తెలుగు తేజం గురించి అమెరికాలో పుట్టి పెరుగుతున్న యువతకు తెలియజేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఈరోజు జరిగిన కార్యక్రమం చూసిన తర్వాత ఎంతోమంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని, ఆయన గురించి మాట్లాడి, ఆయనలా నటించి డాన్స్ చేయటం చూసిన తర్వాత ఆయన ఆ ఉద్దేశం నెరవేరినట్లు భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రముఖ టాలీవుడ్ సింగర్ సింహ బృందంచే నిర్వహించబడిన ఎన్టీఆర్ సంగీత విభావరితో ఈ కార్యక్రమాన్ని ముగించారు. ప్రవాసాంధ్రుడు ప్రసాద్ పాపుదేశి మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి నుండి ఈ తరం యువత క్రమశిక్షణ, నిజాయితీ, పట్టుదల, కష్టపడే తత్వం అనేవి నేర్చుకోవాలని అన్నారు. ఎన్టీఆర్ ను దేవుడు అనడం అతిశయోక్తి కాదని, ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని తమ ఇష్టదైవాన్ని తలుచుకుంటే ఎన్టీఆర్ రూపమే కనపడుతుందన్నారు.
మరొక ప్రముఖ ప్రవాసాంధ్రుడు చందు నంగినేని మాట్లాడుతూ ఆరోజు ఎన్టీఆర్ విద్యాసంస్థలను తీసుకొచ్చి ఎంసెట్ విధానాన్ని తీసుకురాకపోయి ఉంటే ఈరోజు ఇంతమంది డాక్టర్లు, ఇంజినీర్లు, సైంటిస్టులు ఈ దేశం వచ్చి ఉండేవారు కారని అన్నారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్వహించడానికి అనేకమంది శ్రమించారని, వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పడిన విష్ణు అటుకారి, సురేష్ కందేపు, సురేష్ మల్లిన, రామ్ యలమంచిలి, సుధా దావులూరి, శిరీష గాజుల, రామ్ కొడితల, సూర్య భమిడిపాటి, కృష్ణ భూమా, సబితా గుండపనేని, మధు బోడపాటి, శివ గుంటూరు, వంశి గరికపాటి, రవి బొజ్జ తదితరులకు, అలాగే ఈ కార్యక్రమానికి విరివిగా విరాళాలు అందించిన శరత్ కామినేని, విష్ణు కేటరింగ్, డా. శ్యాం కూనం, డా. రవి ఆలపాటి, డా. కృష్ణప్రసాద్ సూరపనేని, కిషోర్ కంఠమనేని, చందు నంగినేని, ప్రసాద్ పాపుదేశి, సతీష్ గుండపనేని తదితరులకు నిర్వాహకులు ప్రేత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు.
రాజు వత్సవాయి ప్రార్థనాశ్లోకంతో ప్రారంభమైన సంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. శిరీష గాజుల నృత్యరీతులు సమకూర్చిన బంటురీతిన గీతంతో చిన్నారులు ఎన్టీఆర్ కి రాముడు రూపంలో నివాళులర్పించారు. నీలిమ గడిచర్ల 8 మంది పిల్లలతో చేయించిన ఎన్టీఆర్ మెడ్లీ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి హాలు మొత్తం అతిధుల కరతాళధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఈ పిల్లలు అచ్చం ఎన్టీఆర్ లాగా డాన్స్ చేస్తుంటే పాతతరం వారికి ఆయనను చూస్తున్న అనుభూతి కలిగించింది.
మరో గ్రూపు ఆడపిల్లలందరూ కలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ చేసిన మరో మెలోడీ సైతం ఆహుతిలందరినీ ఆకట్టుకుంది. ఈ 15 సంవత్సరాలలోపు ఆడపిల్లలందరూ ఈ డాన్స్ తమకు తాము కొరియోగ్రఫీ చేసుకోవటం విశేషం. అలానే శరవణ పడాల అనే పదహారేళ్ళ బాలుడు దానవీరశూరకర్ణ లోని ఎన్టీఆర్ డైలాగ్ చెప్పి దుర్యోధనుడి గెటప్ లో ఆహుతులను అలరించారు. ఇంత చిన్న వయసులో అంత క్లిష్టమైన సంభాషణలు పలకటం ఆహుతలను అబ్బురపరిచింది.
మనబడి టీచర్లందరూ గుండమ్మ కథలోని హాస్య సన్నివేశాలను వారి నటనతో ప్రదర్శించి ఆహుతులను కడుపుబ్బ నవ్వించారు. ఫీనిక్స్ కు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు వెంకట్ కొమ్మినేని మయసభ ఏకపాత్రాభినయంతో అందరిని ఆకట్టుకున్నారు. ఆహార్యంలో వారు ఎన్టీఆర్ ని జ్ఞప్తికి తెచ్చారు. ప్రముఖ కవి వేణుగోపాల్ అక్కినేపల్లి ఎన్టీఆర్ మీద రచించిన ఆటవలది పద్యాలను చదివి అలరించారు.
అలానే తెలుగు ప్రముఖులు రాజ్ మంచిరాజు రచించిన జోహార్ ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) అనే కవిత దృశ్య రూపంలో ప్రదర్శించారు. ఈ మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలకు సుధా దావులూరి సంధానకర్తగా వ్యవహరించగా, రామ్ కొడితల, సిద్దు యాదల్ల ఆడియో వీడియో సహకారం అందించారు.
పరిటాల శ్రీరామ్ మరియు గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ తమ కుటుంబాలకు ఎన్టీఆర్ (NTR) తో ఉన్న అనుబంధాన్ని, చిన్నతనంలో వారు ఎన్టీఆర్ తో కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు అలానే వారు ఇరువురు ఎన్టీఆర్ చూపించిన దారిలో నడుస్తూ ప్రజాసేవకు తమ జీవితాలను అంకితం చేస్తామని చెప్పారు.
పులివర్తి నాని (Pulivarthi Nani) గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలోనే చిత్తూరు జిల్లా తిరుపతిలో మహిళా యూనివర్సిటీ, పద్మావతి మహిళా కళాశాల వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. టి. డి. జనార్దన్ ఎన్టీఆర్ ఏ రకంగా ప్రజలను చైతన్యవంతులను చేసింది, ముఖ్యంగా రైతులకు సహకార సంస్థలను నెలకొల్పి వాటి ద్వారా సామాన్య ప్రజలకు రద్దు చేసినట్లు తెలిపారు.
అలానే వాళ్ళు తలపెట్టిన ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహానికి జరుగుతున్న సన్నాహ కార్యక్రమాలను వివరించి ఎన్నారైలను తమ వంతు తోడ్పాటు చేయవలసిందిగా కోరారు. నటులు నాగినీడు వారు స్వయంగా చూసిన ఎన్టీఆర్ దాతృత్వం గురించి, వారి సమయపాలన గురించి, వారి తోటి నటుల గురించి ఆలోచించే విధానం గురించి తెలిపారు.
మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ ఏ. బి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సభికులకు ఎన్టీఆర్ చిన్ననాటి రాజకీయ సాంఘిక పరిస్థితులు, అవి రామారావు గారి వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయి, ఆనాటి సామాజిక స్థితిగతులు ఎన్టీఆర్ గారు మార్పు తీసుకురావాలి అని ఒక బీజానికి అంకురార్పణ జరపటంలో కీలకపాత్ర వహించినట్లు తెలిపారు. అలానే పాలనాపరంగా, పోలీసు వ్యవస్థాపరంగా వారు చేసిన సంస్కరణలు ఈరోజు ఇంకా అమలులో ఉన్నట్లు తెలుపుతూ ఇది వారి ముందు చూపుకు నిదర్శనం అన్నారు . ఒక నటుడుగా, నాయకుడిగా, అడ్మినిస్ట్రేటర్ గా సంస్కర్తగా ఆయన చేసిన పనులు మనందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.
చివరిగా మాట్లాడిన వైవిఎస్ చౌదరి తన అనర్గల ఉపన్యాసంతో అందరిని కట్టిపడేసారు. ఒక కొడుకుగా, అన్నగా, తండ్రిగా, భర్తగా, స్టూడియో యజమానిగా, రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన నిజ జీవితంలో కూడా ఎన్నో పాత్రలను పోషించి వాటికే వంద శాతం న్యాయం చేసారని తెలిపారు. ఆయన ఇన్ని పాత్రలను పోషించటానికి కారణం ఆయనలో ఉన్న దైవత్వం అని చెప్పారు. తను సినీ రంగంలోకి రావాలి అనుకోవటానికి కారణం కేవలం ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు అని, అందుకే తన ప్రతి సినిమాకి మొట్టమొదట పడే కార్డు, చివరపడే కార్డు అన్న నందమూరి తారక రామారావు గారివి అని చెప్పారు.
ఈ ఉత్సవాలలో భాగంగా విష్ణు అటుకారి, కృష్ణ భూమా, రాహుల్ వాసిరెడ్డి, బయప్ప దాడెం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాపోటీలలో వందలమంది పాల్గొని తమ ప్రతిభపాటవాలను ప్రదర్శించారు. క్రికెట్ తోపాటు వాలీబాల్ మరియు టెన్నికాయిట్ పోటీలను నిర్వహించి విజేతలకు ఎన్టీఆర్ కప్ ట్రోఫీలను, నగదు బహుమతులను అందజేశారు.
విష్ణు కేటరింగ్, పిస్తా హౌస్ మరియు సదాశివరావు గారి తోడ్పాటుతో ఏర్పాటు చేసినటువంటి పసందయినా విందుభోజనం మరియు విజయవాడ నుండి తెప్పించిన స్వీట్లతో అతిథులు ఆహ్లాదకరమైన వాతావరణంలో కడుపారా ఆరగించారు. అదీప్ కోట, వారి తండ్రి పాండురంగ రావు సహకారంతో వచ్చిన అతిథులందరికి తిరుపతి లడ్డులను పంచటం మరో విశేషం.