చిక్కడిపల్లి సెంటర్లో సంధ్యా థియేటర్లో సినిమాకొస్తావా అంటూ ఒకప్పుడు సినిమాలో పాడుకుంటే, ఇప్పుడు అట్లాంటా సెంటర్లో కమ్మింగ్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకెళదామా అంటూ ప్రవాసులు పాడుకుంటూ ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. దీనికి కారణం అమెరికాలోనే అతి పెద్ద కాంస్య విగ్రహాన్ని అట్లాంటాలో (Atlanta) ఆవిష్కరించబోతుండడం.
అందునా ఆ విగ్రహం తెలుగువారి ఘనకీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన నందమూరి తారక రామారావు (NTR) ది కావడం, పైగా ఆ విగ్రహాన్ని తన మనవడు నారా లోకేష్ (Nara Lokesh) చేతుల మీదుగా ఆవిష్కరించనుండడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇండియా నుంచి ఎమ్మెల్యేలు, అమెరికా నలుమూలల నుండి ఎన్టీఆర్ అభిమానులు, నాయకులు తరలి రానుండడం విశేషం.
ఈ నెల అక్టోబర్ 31, గురువారం, ఉదయం 11 గంటలకు కమ్మింగ్ (Cumming, Georgia) నగరంలోని సానీ మౌంటైన్ ఫార్మ్స్ (Sawnee Mountain Farms) లో తెలుగువారి ప్రీతిపాత్రమైన దీపావళి (Diwali) పండుగ రోజున విగ్రహావిష్కరణ జరగడం కాకతాళీయం. ఈ శుభ ఘట్టాన్ని వీక్షించి తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఎగురవేద్దాం, రండి తరలి రండి అంటూ తెలుగువారందరికీ ఆహ్వానం పలుకుతున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా సభ్యులు.
ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా (NTR Trust Atlanta) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తోపాటు గుడివాడ శాసనసభ్యులు రాము వెనిగండ్ల (Ramu Venigandla), ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ కాకర్ల (Suresh Kakarla), గన్నవరం శాసనసభ్యులు వెంకట్రావు యార్లగడ్డ (Yarlagadda Venkata Rao) మరియు నగరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ (Gali Bhanu Prakash) తదితర ప్రముఖులు పాల్గొననున్నారు.
అందరికీ ఏర్పాట్లు చేసేలా, లాజిస్టిక్స్ తదితర ప్లానింగ్ కోసం ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనే వారందరూ www.NRI2NRI.com/NTR Statue Inauguration in Atlanta లో RSVP చేయవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. అలాగే పార్కింగ్, రద్దీ రీత్యా కార్ పూల్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నారు.