News
పండుగ రోజున నింగినంటిన అన్నగారి విగ్రహావిష్కరణ మహోత్సవం @ Atlanta
Published
2 months agoon
By
NRI2NRI.COMఅమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటా (Atlanta) మహానగర సమీపంలోని కమ్మింగ్ పట్టణ నడిబొడ్డున సానీ మౌంటైన్ ఫార్మ్స్ (Sawnee Mountain Farms) లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహావిష్కరణ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా, వీక్ డేస్ ఆఫీసుల సమయంలో కూడా దాదాపు 2000 మంది అభిమానుల నడుమ జరిగింది.
అక్టోబర్ 31 గురువారం దీపావళి (Diwali) పండుగ రోజున ఒక పెద్ద పండుగలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 8 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఒక ఎత్తైతే, ఆ విగ్రహాన్ని తాతకు తగ్గ మనవడు నారా లోకేష్ (Nara Lokesh) ముఖ్య అతిథిగా ఆవిష్కరించడం మరొక ఎత్తు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
ఈ కార్యక్రమంలో గుడివాడ శాసనసభ్యులు రాము వెనిగండ్ల (Ramu Venigandla), ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ కాకర్ల (Suresh Kakarla), గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkata Rao), నగరి శాసనసభ్యులు గాలి భాను ప్రకాష్ (Gali Bhanu Prakash) మరియు ఎన్నారై టీడీపీ యుఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా (http://ntrtrustatlanta.org/) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ విగ్రహావిష్కరణ మహోత్సవానికి అమెరికా దేశ నలుమూలల నుంచి ముఖ్యంగా నార్త్ కెరోలీనా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, న్యూ జెర్సీ, అలబామా, మేరీల్యాండ్, టెక్సస్, కాలిఫోర్నియా రాష్ట్రాల నుండి తెలుగువారు స్వచ్ఛందంగా తరలి రావడం విశేషం.
బిజీ షెడ్యూల్ లో అనుకున్న సమయం కంటే ఆలస్యంగా నారా లోకేష్ వచ్చినప్పటికీ అందరూ వేయికళ్లతో వేదిక వద్దే ఎదురుచూసి ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కనులారా చూసిన తర్వాతే వెనుతిరిగారు. జోహార్ ఎన్టీఆర్ (NTR), జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహే అంటూ అభిమానులు నినాదాలు చేశారు.
3:30 గంటలకు గెయిన్స్విల్ (Gainesville Lee Gilmer Memorial Airport) విమానాశ్రయంలో నారా లోకేష్ ప్రత్యేక విమానంలో దిగగా ఎమ్మెల్యేలు, ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా నాయకులు, అభిమానులు దాదాపు 100 మంది స్వాగతం పలికారు. 4 గంటలకు వేదిక ప్రాంగణంలోకి ఎంటర్ అవడంతో డప్పులతో, పూల దండలతో, పుష్ప గుచ్ఛాలతో ఎదురెళ్లి మహిళలు, యువత ఘనస్వాగతం పలికారు.
ముందుగా వ్యాఖ్యాతలు సుజాత ఆలోకం (Sujatha Alokam) మరియు వెంకి గద్దె (Venky Gadde) అందరికీ స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులందరినీ పుష్పగుచ్ఛాలతో వేదిక మీదకు ఆహ్వానించి ఆసీనులుగావించారు. అనంతరం అతిథులు, ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా నాయకులు కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు.
తదనంతరం అందరూ ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వెళ్లగా, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా (Hindu Temple of Atlanta) పండితులు పవన్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూజాకార్యక్రమాలు గావించారు. నారా లోకేష్ రిబ్బన్ కటింగ్ చేసి, ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్న ముసుకు తొలగించి ఆహ్వానితుల కరతాళధ్వనులు నడుమ ఘనంగా ఆవిష్కరించారు.
అతిథులందరూ ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) విగ్రహానికి గజమాలలు వేసి నివాళులర్పించారు. అదే సమయంలో సూర్యకిరణాలు అన్నగారి మీద పడి మెరవడం, ఆకాశంలో హెలికాఫ్టర్ నుంచి ఎన్టీఆర్ విగ్రహంపై పూల వర్షం కురిపించడంతో చూడడానికి రెండు కళ్ళు చాలవన్నట్టు వేదిక ప్రాంగణమంతా కేరింతలు, జై ఎన్టీఆర్, జై లోకేష్ నినాదాలతో మారుమోగింది.
తిరిగి అతిథులందరూ వేదికపైగా రాగా, ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా ఫౌండర్ శ్రీనివాస్ లావు (Srinivas Lavu) 16 సంవత్సరాల క్రితం 2008లో స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా సంస్థ వివరాలు, కార్యక్రమాలు, అలాగే గత సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించిన అన్నగారి సెంటెన్నియల్ సెలెబ్రేషన్స్ సమయంలో ఇలా విగ్రహం ప్రతిష్టించాలనే ఆలోచన రావడం వంటి విషయాలపై ప్రసంగించారు.
గుడివాడ ఎమ్మెల్యే, అట్లాంటా వాసి రాము వెనిగండ్ల మాట్లాడుతూ… అన్నగారి విగ్రహం ఇంత స్థాయిలో అట్లాంటాలో ప్రతిష్టించడం చాలా ఆనందంగా ఉందని, లోకేష్ రావడం మరింత ఊపు తెచ్చిందని, ఐటీ మినిస్టర్ గా లోకేష్ కి ఉన్న పరిజ్ఞానం, 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన కోసం రేయింబవళ్లు పడుతున్న కృషి మరువలేనిదన్నారు. చివరిగా జై ఎన్టీఆర్, జై బాలయ్య (Jai Balayya) అంటూ అందరినీ ఉత్సాహపరిచారు.
ఉదయగిరి ఎమ్మెల్యే, ర్యాలీ నగర వాసి సురేష్ కాకర్ల మాట్లాడుతూ… ఇంత పెద్ద కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా మరియు ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) నాయకులను అభినందించారు. అలాగే నారా లోకేష్ యువగళం, ఎన్నికలప్పటి పరిస్థితులు, ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులు వంటి విషయాలను ప్రస్తావించారు.
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ… ఎంతో మంది యవ్వన దశలో పార్టీలు పెట్టారు గానీ, ఒక్క ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao – NTR) మాత్రమే 60 సంవత్సరాల వయసులో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పార్టీ పెట్టి విజయవంతమయ్యారని, ఎన్టీఆర్ మొదలుపెట్టిన కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, దటీజ్ ఎన్టీఆర్ అన్నారు.
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ… ఎన్నారైలు అందరూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృధ్హిలో పాలుపంచుకోవాలని కోరారు. ప్రస్తుతం మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో, అన్నీ ఒకదారికి తెచ్చి గాడిన పెట్టే సత్తా ఒక్క చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కి, లోకేష్ కే ఉన్నాయన్నారు.
ఎన్నారై టీడీపీ యుఎస్ఏ (NRI TDP USA) కోఆర్డినేటర్, కాలిఫోర్నియా బే ఏరియా వాసి జయరాం కోమటి మాట్లాడుతూ… గత ఎన్నికల సమయంలో ఎన్నారైలు చేసిన సహాయాన్ని ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, అలాగే ముందు ముందు కూడా ఎన్నారైలందరం టీడీపీ (Telugu Desam Party) కి మరియు రాష్ట్ర అభివృధ్హి కోసం ముందుంటామని అన్నారు.
చివరిగా ఆంధ్రప్రదేశ్ ఐటీ,ఈసీ & హెచ్ఆర్డి మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ కార్యదర్శి, ఎన్టీఆర్ (NTR) మనవడు నారా లోకేష్ మాట్లాడుతూ… ఎన్నారై (NRI) అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్ (MRI) అని, ఏమీ ఆశించకుండా పార్టీ కోసం అలాగే ఆంధ్ర రాష్ట్రం కోసం ఇప్పుడూ, ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నారన్నారు.
రెడ్ బుక్ (Red Book) గురించి యువత ప్రస్తావించగా 92 శాతం సీట్లు వచ్చినప్పుడు బాధ్యత చాలా పెరిగిందని, పెట్టుబడులు మరియు ఉద్యోగాల సృష్టిపై ఫోకస్ చేస్తున్నామని, కానీ చట్టాన్ని ఉల్లంఘించి మరీ తప్పులు చేసినవారిని మాత్రం వదిలే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే రెడ్ బుక్ చాప్టర్ 1 & 2 ఓపెన్ అయ్యాయని, త్వరలో చాప్టర్ 3 మొదలవనుందని, కొంచెం ఓపికగా ఉండాలని కోరారు.
అతిథులందరినీ NTR Trust Atlanta (http://ntrtrustatlanta.org/) సభ్యులు శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. తర్వాత నారా లోకేష్ ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు. చివరిగా ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించిన భరత్ మద్దినేని (Bharath Maddineni), మధుకర్ యార్లగడ్డ (Madhukar Yarlagadda) లను లోకేష్ శాలువాతో సత్కరించడం అభినందనీయం.
వందన సమర్పణలో (Vote of Thanks) భాగంగా అందరికీ భోజనాలు అందించిన సంక్రాంతి, అడ్డా, పెర్సిస్ బిర్యానీ ఇండియన్ గ్రిల్, శ్రీ కృష్ణ విలాస్, హైదరాబాద్ కేఫ్, బావర్చి, బిర్యానీ పాట్, ఇండిఫ్రెష్, స్పైస్ హట్, డాడీ’స్ కిచెన్, దేశి డిస్ట్రిక్ట్ రెస్టారెంట్స్ అధిపతులకు వ్యాఖ్యాత వెంకి గద్దె (Venky Gadde) కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే సానీ మౌంటైన్ ఫార్మ్స్ టీం, డెకొరేషన్ వెండర్స్ మాధవి కొర్రపాటి, మేఘన, లక్ష్మి మండవల్లి, ఫోటో & వీడియో వెండర్ కిషోర్ తాటికొండ, స్పాన్సర్స్, ముఖ్యంగా గత సంవత్సరంపాటు ఇండియాలో NTR విగ్రహం తయారుచేసేటప్పటి నుండి ఇప్పుడు ఆవిష్కరించే వరకు వివిధ స్థాయిల్లో సహాయం చేసిన వాలంటీర్స్ (Volunteers), ఇలా ప్రతి ఒక్కరికీ పేరుపేరునా వెంకి గద్దె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అంతకు ముందు మాలతి నాగభైరవ (Malathi Nagabhirava) అందరికీ స్వాగతం పలికి అట్లాంటా గాయనీగాయకులు రాగ వాహిని (Raaga Vahini), రామ్ దుర్వాసుల (Ram Durvasula) మరియు జనార్ధన్ పన్నెల (Janardhan Pannela) లను వేదిక మీదకు ఆహ్వానించగా, వారు ఎన్టీఆర్ సినిమాలలోని పాటలతో ఆహ్వానితులను అలరించారు. అలాగే ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించి ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పిన వారికి గిఫ్ట్ కార్డ్స్ అందజేశారు.
ఇప్పటి వరకు కాలిఫోర్నియా (California) రాష్ట్రం లోని లాస్ ఏంజెల్స్ (Los Angeles) నగరంలో ఒకరు తమ ఇంట్లోనే కృష్ణుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఒక సంస్థ (NTR Trust Atlanta) తరపున ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ గావించడం అమెరికాలో ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం. విగ్రహం కూడా చాలా చక్కగా వచ్చిందని అందరూ అభిప్రాయపడ్డారు. వేదిక ప్రాంగణమంతా ఎన్టీఆర్ కటౌట్లు, టీడీపీ జండాలతో, టెంట్, ఫోటో బూత్ లతో చక్కగా డెకరేట్ చేశారు.
అట్లాంటా (Atlanta) లో 2008 లోనే NTR Trust Atlanta స్థాపించి ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, పద్మశ్రీ, అన్న స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు 100వ పుట్టినరోజు వేడుకల (NTR Centennial Birthday Celebrations) నిర్వహణతోపాటు ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మరొక ఎత్తు అయ్యింది. అందరూ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించారంటూ అభినందనలతో ముంచెత్తారు.
వేదిక ప్రాంగణంలోకి నారా లోకేష్ (Nara Lokesh) వచ్చేటప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడు మరియు మధ్యలో అందరూ ఫోటోలు దిగేటప్పడు జనం తాకిడితో కిక్కిరిసిపోయింది. అయినప్పటికీ ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడుతూ ముందుగా మహిళలు, పిల్లలు, పెద్దలు, తర్వాత యువకులతో ఓపికగా ఫోటోలు దిగడంతో అందరూ నారా లోకేష్ ని హీ ఈస్ ఏ రియల్ లీడర్ (He is a real leader) అంటూ అభినందనలతో ముంచెత్తారు.
వెండితెర ఇలవేల్పుగా, పురాణ పురుషుడిగా, రాజకీయాలలో మకుటంలేని మహారాజుగా తెలుగు జాతికి విశిష్ట సేవలు అందించి రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చి సరికొత్త శకానికి నాంది పలికి, తెలుగు వారి గుండెల్లో గూడుకట్టుకొని, నేటికీ చెరగని ముద్రవేసుకున్న మరణమే లేని శకపురుషుడు ఎన్టీఆర్ కి అట్లాంటా (Atlanta, Georgia) నేల పులకించేలా విగ్రహావిష్కరణ బహుశా ఇండియా బయట మొదటిసారేమో. ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా ఇలాంటి అవకాశం వస్తుందంటూ అందరూ ఆహ్లాదకరంగా కార్యక్రమాన్ని ముగించారు.