స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సంబరాలు ఫ్లోరిడా లోని టాంపా నగరంలో మే 27న అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మొదటగా టాంపా బే ఎన్టీఆర్ అభిమానులు నందమూరి తారక రాముడికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం మొత్తం ‘జోహార్ అన్న ఎన్టీఆర్!’ నినాదాలతో హోరెత్తింది.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి అంగరంగ వైభవంగా మునుపెన్నడూ లేని విధంగా జరిగింది. ఈ వేడుకలకు పెద్దలు, మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషమే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీనివాస్ గుత్తికొండ, డాక్టర్ కోత శేఖరం హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆహుతులనుద్దేశించి శ్రీనివాస్ గుత్తికొండ గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ తీసుకువచ్చిన ప్రభుత్వ పధకాలు అయన ముక్కుసూటి వ్యక్తిత్వం మరియు అయన చేసిన అభివృద్ది ని వివరించారు. అలాగే డాక్టర్ కోత శేఖరం మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు రీల్ స్టార్ నుంచి రియల్ స్టార్ ప్రస్థానం లో ఒడిదుడుకులు గురించి వివరించారు.
అనంతరం స్థానిక నాయకులు కొందరు ప్రసంగించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ కట్ చేసి అందరూ అన్న నందమూరి తారక రామారావు గారి శతజయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన పాటలు అందరినీ అలరించాయి.
ఎన్టీఆర్ మీదున్న అభిమానంతో ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన టాంపా బే ఎన్టీఆర్ అభిమానులు, నాయకులు రాజ్ శేఖర్ పోపూరి, నాగేందర తుమ్మల, శ్రీనివాస్ మల్లాది, శివ తాళ్లూరి, సుధాకర్ మున్నగి, శ్రీనివాస్ నానపనేని, అజయ్ దండమూడి, సుమంత్ రామినేని, సుధీర్ వేమూరి, ప్రసాద్ కొసరాజు, విజయ్, చంద్ర, వేణు, స్వరూప ఆచి లను ఆహూతులందరూ అభినందించారు.